సత్యజిత్ రే, గురుదత్, మృణాల్ సేన్, బిమల్ రాయ్, రిత్విక్ ఘటక్, శ్యామ్ బెనెగల్, హృషీకేశ్ ముఖర్జీ, గిరీష్ కాసరవల్లి, అదూర్ గోపాలకృష్ణన్, కె. బాలచందర్, కె. విశ్వనాథ్, మణిరత్నం, రామ్ గోపాల్ వర్మ… వీళ్లందరిలోని కామన్ క్యాలిటీ ఒరిజినల్ సిగ్నేచర్. నాలుగు సీన్లు చూసి ఆడియెన్స్ ఇది ఫలానా డైరెక్టర్ సినిమా అని చెప్పగలిగే సొంత ఒరవడి. అలాంటి తనదైన ఒరవడిని సృష్టించుకున్న దర్శకుల్లో ఒకరు శేఖర్ కమ్ముల. దర్శకులు రెండు రకాలుగా వుంటారు. ట్రెండ్‌ను పట్టుకొని విజయవంతమైన సినిమాలే లక్ష్యంగా ముందుకు సాగేవారు. అలాగే, ట్రెండ్‌తో సంబంధం లేకుండా తన సొంత గొంతును వినిపించి, ఆ ఒరిజినల్ వాయిస్‌తోనే ట్రెండ్‌ను సెట్ చేసుకునే దర్శకులు. శేఖర్ కమ్ముల ఈ రెండో కేటగిరీలోకి వస్తారు.
సాఫ్ట్వేర్ నుంచి సినిమాల్లోకి వచ్చారు కమ్ముల. ఫిల్మ్ మేకింగ్ చదివారు. ఆయన సినిమాల్లోకి వచ్చిన అప్రోచ్ కూడా చాలా డిఫరెంట్. తన సొంత ఖర్చులతోనే ‘డాలర్ డ్రీమ్స్’ అనే ఇండీ ఫిల్మ్‌ను మొదలుపెట్టారు. ఆ సినిమా యూట్యూబ్‌లో ఉంది. ఆసక్తి ఉన్నవారు ఆ సినిమా చూస్తే ఫిల్మ్ మేకింగ్‌కు సంబంధించిన చాలా విషయాలు అర్థమవుతాయి. బుర్రలో ఆలోచన, చేతిలో కెమెరా ఉంటే దాన్ని విజువలైజ్ చేయడంలో ఎన్ని కష్టాలు, ఎలాంటి అవాంతరాలు వస్తాయో… అలాంటి ఒక చిన్న సినిమా తీస్తూ కూడా నేర్చుకోవచ్చు. ఆ చిన్న సినిమా చూసినప్పుడే కమ్ముల విజన్ అర్థమవుతుంది. నిజానికి ఒక ఫిల్మ్ మేకర్‌కు ఇది చాలా ప్రాక్టికల్ అప్రోచ్. అలాంటి యూనిక్ థాట్స్‌తో వచ్చే ఫిల్మ్ మేకర్స్ ఇప్పుడు నిర్మాతలకు అవసరం. కానీ ఈరోజుల్లో ఏ కొత్త దర్శకుడినైనా, రచయితనైనా కదిపితే ‘‘మా కథకి బడ్జెట్ యాభై కోట్లు అండి’’ అని చెబుతుంటే, దడుసుకోవడం నిర్మాతల వంతౌతుంది. ఇది వేరే సంగతి.
‘డాలర్ డ్రీమ్స్’ ఇచ్చిన అనుభవంతో ‘ఆనంద్’ సినిమాను మళ్లీ సొంతంగా మొదలుపెట్టారు. డాలర్ డ్రీమ్స్‌కు జాతీయ ఉత్తమ తొలి చిత్ర దర్శకుడి అవార్డు రావడంతో ‘ఆనంద్’ కోసం NFDC సపోర్ట్ దొరికింది. మెయిన్ స్ట్రీమ్ సినిమాగా వచ్చిన ఆనంద్ మెల్లమెల్లగా జనాల్లోకి వచ్చింది. మంచి కాఫీ లాంటి సినిమానే పేరు తెచ్చుకుంది. తర్వాత వచ్చిన ‘గోదావరి’, ‘హ్యాపీ డేస్’ సినిమాలతో శేఖర్ కమ్ముల ఒరవడి ఏమిటో అర్థమైంది. ఆహ్లాదకరమైన సంగీతం, సహజమైన సంభాషణలు, హ్యూమన్ రిలేషన్స్, ఎమోషన్స్, బలమైన స్త్రీ పాత్రలు, మంచి సందేశం ఉన్న ఉప కథలు – ఇవన్నీ కమ్ముల సినిమాల్లో థీమ్‌లుగా ఉంటాయి. కమర్షియల్ ఎలిమెంట్స్ డామినేట్ చేసే తెలుగు సినిమాల్లో లోతైన భావోద్వేగాలకు పెద్దపీట వేసే దర్శకుడిగా ఒక కొత్త ఒరవడిని ఏర్పరిచారు కమ్ముల.
శేఖర్ కమ్ముల సినిమాలు అనగానే “సాఫ్ట్” అనే మార్క్ ఉంటుంది. కానీ ఒక ఫిల్మ్ మేకర్‌గా ఆయన కనిపించేటంత సాఫ్ట్ కాదు. చాలా గుండెధైర్యం కలిగిన ఫిల్మ్ మేకర్ కమ్ముల.
‘‘ఒక ఆడపిల్లకు న్యాయం చేయలేని సీఎం ఉంటే ఎంత, ఊడితే ఎంత?’’
‘‘లక్షల కోట్లు, కొన్ని ప్రాజెక్ట్స్, ఇంత బియ్యం, ఇంత కరెంట్… ఇవి కాదండి మన ప్రజలు కోరుకునేది. మార్పు. వ్యవస్థలో మార్పు, విధానాల్లో మార్పు.’’
‘‘అరవై ఏళ్ల స్వతంత్ర భారతంలో అంటరానితనమా? ఎంత మూర్ఖత్వం… వీళ్లా మనల్ని పాలించేది?’’ – ఇలా వ్యవస్థల్ని కదిలించే మాటలు కమ్ముల కలం నుంచి ఎప్పుడో వచ్చాయి.
శేఖర్ కమ్ములని ఎరిగినవారికి ఆయన కేవలం ప్రేమ కథలు తీసే దర్శకుడిగా కనిపించరు. ‘లవ్ స్టోరీ’ సినిమాలో ఆయన ఎత్తిచూపిన రుగ్మత ఎలాంటిదో అందరికీ తెలుసు. ఇప్పుడు చేస్తున్న ‘కుబేర’ కూడా డబ్బు, వ్యవస్థ, అవినీతి చుట్టూ కేంద్రీకృతమైన కథాంశమని అర్థమౌతోంది. ఆయన ఇండస్ట్రీలోకి వచ్చిన 25 ఏళ్లు అవుతుంది. ఈ జర్నీలో జయాపజయాలు ఉన్నాయి. రిజల్ట్‌తో సంబంధం లేకుండా తన వాయిస్‌ను వినిపించుకుంటూ వెళుతున్న శేఖర్ కమ్ముల నుంచి భవిష్యత్తులో మరిన్ని పాత్ బ్రేకింగ్ సినిమాలు రావాలని కోరుకుందాం.