ఈ పోరాటంతో ఫ‌లితం ఉంటుంద‌న్న ధీమా ఏదీ.?

కేంద్రంపై స‌ర్కారు పోరాటం… మిత్ర‌ప‌క్ష‌మైన భాజ‌పాపై తెలుగుదేశం స‌మరం.. ఇదే కిం క‌ర్త‌వ్యం అన్న‌ట్టుగా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నిర్ణ‌యించారు! అయితే, ఈ పోరాటం ఎలా ఉండ‌బోతోందంటే… వ్ర‌తం చెడ‌కూడదు, ఫ‌ల‌మూ ద‌క్కాల‌న్న‌ట్టుగా ఉంది! పొత్తు చెడ‌కూడ‌దు, పొందాల్సిన‌వి ద‌క్కించుకోవాలి… ఇదే ప్ర‌స్తుతం టీడీపీ స్ట్రాట‌జీ. పార్ల‌మెంటు ఉభ‌య స‌భ‌ల్లోనూ ఏపీ కేటాయింపుల‌పై గ‌ళ‌మెత్తాల‌ని చంద్ర‌బాబు నిర్ణ‌యించిన సంగ‌తి తెలిసిందే. రాష్ట్ర విభ‌జ‌న త‌రువాత ఆంధ్రాకు రావాల్సిన నిధుల విష‌య‌మై ఇంత‌వ‌ర‌కూ అంత‌ర్గ‌తంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చామ‌నీ, ఇక‌పై ఆ ఒత్తిడి పెంచేమార్గాలు బ‌హిరంగంగా ఉండబోతున్నట్టు నిన్న‌టి భేటీలో నిర్ణ‌యించారు. అయితే, ఇంతవరకూ సాగించిన ఈ అంత‌ర్గ‌త పోరాట‌మేంటో బ‌హిర్గ‌తం చేస్తే బాగుండేది. ఆంధ్రా ప్ర‌యోజ‌నాల కోసం ఇప్ప‌టివ‌ర‌కూ 28 సార్లు ఢిల్లీ వెళ్లొచ్చాన‌ని చంద్ర‌బాబు చెప్పారు. అంత‌ర్గ‌తంగా ఒత్తిడి పెంచే ప‌ర్య‌ట‌న‌లుగా వీటిని చూడాల‌న్న‌మాట‌!

ఇక‌, ఇప్ప‌టి విష‌యానికొస్తే… తెలుగుదేశం పార్టీ కేంద్రంపై ప్ర‌క‌టించి ఈ విధానం వ‌ర్కౌట్ అవుతుందా..? ఇదే ఇప్పుడు ప్ర‌ధాన‌మైన ప్ర‌శ్న‌. ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటే.. ప్ర‌స్తుతం ఉభ‌య స‌భ‌ల్లో నిర‌స‌న మాత్ర‌మే తెలుపుతామ‌ని టీడీపీ నేత‌లు అంటున్నారు. ఒక‌వేళ స‌భ‌ల్లో వీలుకాక‌పోతే.. స‌భ బ‌య‌ట ప్ర‌ద‌ర్శ‌న‌లు చేసి, కేంద్రంపై ఒత్తిడి పెంచుతామంటున్నారు. నిజానికి, పార్లమెంటు సమావేశాలు ఈ నెల‌లో జరిగేది ఇంకా నాలుగు రోజులే. అంటే, ఈ నాలుగు రోజుల్లోనే కేంద్ర బ‌డ్జెట్ కేటాయింపుల‌పై… అదీ ఒక రాష్ట్రానికి చెందిన ఎంపీలు నిర‌స‌న వ్య‌క్తం చేసేంత స‌మ‌యం టీడీపీకి స‌భ‌లో ల‌భిస్తుందా..? పైగా, మిత్ర‌ప‌క్ష‌మైన టీడీపీ నిరస‌న వ్య‌క్తం చేయ‌డం మొద‌లుపెడితే… ఇత‌ర ప‌క్షాల నుంచి భాజ‌పాపై కొంత ఒత్తిడి పెరుగుతుంది. విమర్శలు పడాల్సి వస్తుంది. కాబ‌ట్టి, స‌భ‌లో టీడీపీ స‌భ్యుల‌కు ఆ స్థాయిలో స‌భాస‌మ‌యం కేటాయించే ప‌రిస్థితి ఉంటుందా..? ఈ నాలుగు రోజుల్నీ వీలైనంత ప్రభావవంతంగా టీడీపీ ఎలా వాడుకుంటుంద‌నేది అస‌లు ప్ర‌శ్న‌.

ఈ నాలుగు రోజులూ గ‌డ‌చిపోయిన త‌రువాత ప‌రిస్థితి ఏంటీ..? ఈ ప్ర‌శ్న‌కు ప్ర‌స్తుతం టీడీపీ ద‌గ్గ‌ర స‌మాధానం క‌నిపించ‌డం లేదు. పోనీ, ఆ త‌రువాత ఎంపీలు రాజీనామాలు చేసే అవకాశం ఉందా… అంటే, అదీ లేదు! కేంద్రంతో తెగ‌తెంపులు చేసుకుందామ‌ని జేసీ, ఎంపీ ప‌ద‌వుల‌కు రాజీనామా చేసి ప్ర‌జ‌ల్లోకి వెళ్తే బాగుంటుంద‌ని అవంతి శ్రీ‌నివాస్ లు తీసుకొచ్చిన ప్ర‌తిపాద‌న‌ల్ని కూడా చంద్ర‌బాబు ప‌క్క‌కు తోసేశారు. అంతేకాదు, కేంద్రంపై ఏపీ ప్ర‌యోజ‌నాల విష‌య‌మై ఒత్తిడి పెంచ‌బోతున్నామ‌ని ముందుగానే కేంద్రానికి స‌మాచారం ఇచ్చి చూద్దామ‌ని అన్నారు. ఓవ‌రాల్ గా చూసుకుంటే… ఈ ఒత్తిడి పెంచే కార్య‌క్ర‌మాలు కూడా కేంద్రానికి లోబ‌డి, వారిని నొప్పించకుండా చేస్తున్న‌ట్టుగా క‌నిపిస్తున్నాయి. మ‌రి, ఈ త‌ర‌హా పోరాటంతో కేంద్రం దిగివ‌చ్చే ప‌రిస్థితులు ఉంటాయా..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.