తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అందరి దృష్టి కేబినెట్ విస్తరణ పైనే ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన టీమ్‌లో మార్పు చేర్పులకు రెడీ అయ్యారు. హైకమాండ్ వద్ద నుంచి అనుమతి కోసం ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఐదు రాష్ట్రాల ఎన్నికల హడావుడి నడుస్తుండటంతో హైకమాండ్ పట్టించుకోవడంలేదు. అందుకే మే నెలలోనే మళ్లీ చాన్స్ అనే వాదన వినిపిస్తోంది.
ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాతే ముహూర్తం
కాంగ్రెస్ అధిష్టానం ప్రస్తుతం ఐదు రాష్ట్రాల ఎన్నికలపైనే పూర్తిస్థాయిలో దృష్టి సారించింది. ముఖ్యంగా కేరళలో అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా అక్కడ ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఏప్రిల్ 9న కేరళ, అస్సాం, పుదుచ్చేరిలలో, ఏప్రిల్ 23న తమిళనాడులో, ఏప్రిల్ 23, 29 తేదీల్లో పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ కీలక సమయంలో కేబినెట్ విస్తరణ చేపడితే పార్టీ దృష్టి మళ్లుతుందని, అసమ్మతి జ్వాలలు వచ్చే అవకాశం ఉంటుందని అధిష్టానం భావిస్తోంది.
ప్రోగ్రెస్ రిపోర్ట్ ఆధారంగా ప్రక్షాళన
కేవలం ఖాళీగా ఉన్న ఒక్క సీటును భర్తీ చేయడమే కాకుండా, ప్రస్తుతం ఉన్న మంత్రుల పనితీరు ఆధారంగా ఒక భారీ మార్పులు చేయడానికి రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు. గత ఏడాది కాలంగా మంత్రుల పనితీరు, వారిపై వస్తున్న ఫిర్యాదులు, శాఖల వారీగా సాధించిన పురోగతిపై సీఎం ఇప్పటికే ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ సిద్ధం చేసినట్లు సమాచారం. పనితీరు సరిగ్గా లేని ఇద్దరు లేదా ముగ్గురు మంత్రులను తప్పించి, వారి స్థానంలో కొత్త రక్తానికి అవకాశం ఇవ్వాలని ఆయన భావిస్తున్నారు. ఈ విషయంలో అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉంది, అయితే అంతర్గత విభేదాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రాహుల్ గాంధీ సూచించినట్లు తెలుస్తోంది.
సామాజిక సమీకరణాలు
ఈసారి విస్తరణలో సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేయనున్నారు. ముఖ్యంగా ఇప్పటివరకు కేబినెట్లో సరైన ప్రాతినిధ్యం లేని ఒక బీసీ నేతకు, అలాగే ఒక లంబాడా సామాజిక వర్గ ప్రతినిధికి కచ్చితంగా చోటు దక్కనుంది. ఉమ్మడి అదిలాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి ప్రాతినిధ్యం పెంచేలా రేవంత్ రెడ్డి తన టీమ్‌ను రీ-డిజైన్ చేస్తున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మే 4న విడుదల కానున్నాయి. ఆ ఫలితాల్లో కాంగ్రెస్ కు నిరాశ కలిగితే రేవంత్ వెంటనే మార్పు చేర్పులపై గ్రీన్ సిగ్నల్ కోసం అడగకపోవచ్చు. మంచి ఫలితాలు వస్తే వెంటనే నిర్ణయం తీసుకుంటారు. గ్రేటర్ ఎన్నికల కన్నా ముందే తన టీమ్ ను మార్చాలనుకుంటున్నారు.
