భారత్-పాక్ క్రికెట్ మ్యాచ్ జరుగుతుందో లేదో?

పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై పాక్ ఉగ్రవాదులు దాడులు చేసినప్పటి నుండి భారత్-పాక్ దేశాల మధ్య మళ్ళీ ఉద్రిక్తతలు పెరగడంతో రెండు దేశాల మధ్య సంబంధాలు ఇప్పుడు అంతంత మాత్రంగానే ఉన్నాయి. మూడు నెలలు అవుతున్నా ఇంతవరకు ఆ దాడికి పాల్పడిన వారినెవ్వరినీ అరెస్ట్ చేయకుండా యధాప్రకారం పాక్ తనకు అలవాటయిన అన్ని నాటకాలన్నీ ఆడుతోంది. ఆ కారణంగానే భారత్-పాక్ విదేశాంగ కార్యదర్శుల మధ్య ఇస్లామాబాద్ లో జరుగవలసిన చర్చలు నిరవధికంగా మళ్ళీ వాయిదా పడ్డాయి. ఆ సంగతి పాక్ కి తెలిసినప్పటికీ చర్చలకు రావాలని భారత్ పై ఒత్తిడి చేస్తోంది.

పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై దాడి జరిగినప్పుడు మోడీ ప్రభుత్వం కూడా చాలా హడావుడి చేసింది కానీ ఆ తరువాత ఎందుకో హటాత్తుగా నిశబ్ధమయిపోయింది. నిశబ్ధంగానే భారత్-పాక్ మధ్య క్రికెట్ మ్యాచ్ కి అంగీకరించింది. అంటే పాక్ పట్ల భారత్ మళ్ళీ మెత్తబడిందని అర్ధమవుతోంది. భారత్-పాక్ విదేశాంగ కార్యదర్శుల సమావేశానికి భారత్ ఇష్టపడనపుడు, ఇరు దేశాల ప్రజలలో చాలా తీవ్ర ఉద్రిక్తతలు కలిగించే భారత్-పాక్ క్రికెట్ మ్యాచ్ ని అనుమతించడం చాలా ఆశ్చర్యంగానే ఉంది. నిజానికి విదేశాంగ కార్యదర్శుల సమావేశం జరిగినా జరుగకపోయినా ఇరుదేశాల ప్రజలు పెద్దగా పట్టించుకోరు కానీ ఇరుదేశాల మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే దానిని ఒక నిజమయిన యుద్ధంగానే భావిస్తుంటారు.

మరి ఆ సంగతి తెలిసి కూడా భారత్ గడ్డపై పాక్ తో క్రికెట్ మ్యాచ్ ఆడటానికి మోడీ ప్రభుత్వం ఎందుకు అనుమతించిందో తెలియదు. పఠాన్ కోట్ పై దాడులు జరిగి మూడు నెలలు గడిచిపోయాయి కనుక బహుశః దేశ ప్రజలు దాని గురించి మరిచిపోయుంటారని అనుకొందో లేకపోతే పాక్ పట్ల దేశ ప్రజల స్పందన ఏవిధంగా ఉందో తెలుసుకొనేందుకే ఈ మ్యాచ్ కి అనుమతించిందో తెలియదు. ఒకవేళ దేశ ప్రజలు ఈ మ్యాచ్ ను ఆహ్వానించినట్లయితే, అప్పుడు భారత్-పాక్ విదేశాంగ కార్యదర్శుల సమావేశానికి ముహూర్తం పెట్టుకోవచ్చని మోడీ ప్రభుత్వం ఆలోచిస్తోందేమో?

మొదట హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో మ్యాచ్ నిర్వహించాలనుకొన్నప్పటికీ, ఆ రాష్ట్ర ప్రభుత్వం మ్యాచ్ కి భద్రత కల్పించలేమని చేతులు ఎత్తేయడంతో దానిని కోల్ కోతాలోని ఈడెన్ గార్డెన్స్ కి మార్చేరు. కానీ అక్కడ కూడా మ్యాచ్ జరపడానికి వీలులేదని భారత తీవ్రవాద వ్యతిరేక ఫ్రంట్‌ (ఏటీఎఫ్‌ఐ) హెచ్చరిస్తోంది. పఠాన్ కోట్ పై జరిగిన దాడిని అప్పుడే మరిచిపోయి, ఉగ్రవాదులకు ఆశ్రయం, శిక్షణ, అండదండలు ఇస్తూ భారత్ పై దాడులకు ప్రోత్సహిస్తున్న పాక్ తో క్రికెట్ మ్యాచ్ ఆడటం సిగ్గుచేటని ఏటీఎఫ్‌ఐ వాదిస్తోంది. ఒకవేళ తమ హెచ్చరికలను కాదని ఈడెన్ గార్డెన్ లో మ్యాచ్ నిర్వహించాలనుకొంటే దానిని చాల తీవ్రంగా ప్రతిఘటిస్తామని ఏటీఎఫ్‌ఐ సభ్యులు హెచ్చరిస్తున్నారు. ఈడెన్ గార్డెన్ పిచ్ ని తవ్వేస్తామని హెచ్చరిస్తున్నారు. భారత్ లో ఎదురవుతున్న ఈ వ్యతిరేకతను చూసి, తమ ఆటగాళ్ళ భద్రతకు పూర్తి భరోసా కల్పిస్తామని భారతప్రభుత్వం హామీ ఇస్తేనే మ్యాచ్ ఆడేందుకు తమ ఆటగాళ్ళను కోల్ కొతా పంపిస్తామని పాక్ క్రికెట్ బోర్డు చెపుతోంది. కనుక ఈ మ్యాచ్ జరుగుతుందో లేదో తెలియని పరిస్థితి నెలకొని ఉందిపుడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com