మోడీ దీక్ష‌కు దిగుతూ ఏం సందేశం ఇస్తున్న‌ట్టు..?

పార్లమెంటులో అవిశ్వాస తీర్మానాన్ని మోడీ సర్కారు ఎలా త‌ప్పించుకుందో చూశాం. స‌భ‌లో తిరుగులేని మెజారిటీ ఉండి కూడా అవిశ్వాసాన్ని ఎదుర్కొనే ధైర్యం భాజ‌పా స‌ర్కారుకు లేకుండాపోయింది. అయితే, స‌భ‌లో గంద‌ర‌గోళానికి కార‌ణం కాంగ్రెస్ తీరే అంటూ అభాండం ప్ర‌తిప‌క్షంపై నెట్టేశారు. అంతేకాదు, ప్ర‌తిప‌క్షాల తీరుకు నిర‌స‌న‌గా భాజ‌పా ఎంపీలు నిరాహార దీక్ష‌లు చేస్తార‌ని గ‌త‌వారమే ప్ర‌క‌టించారు. అయితే, ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ, భాజ‌పా జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా కూడా ఒక‌రోజు నిరాహార దీక్ష‌కు సిద్ధం కావ‌డం విశేషం! అయితే, ప్ర‌ధాని ఎక్క‌డా దీక్ష‌కు కూర్చోరట‌. త‌న కార్యాల‌యంలో రోజువారీ కార్య‌క‌లాపాలు చేసుకుంటూ.. ఒక రోజు భోజ‌నం మానేస్తారట‌. అమిత్ షా మాత్రం క‌ర్ణాట‌క ప్ర‌చారంలో ఒక చోట దీక్ష చేస్తార‌ట‌.

సాక్షాత్తూ ప్ర‌ధాన‌మంత్రి దీక్ష చేస్తే ఎలా చూడాలి..? ఇంత‌కీ ఆయ‌న దీక్ష‌కు ఎందుకు దిగుతున్న‌ట్టు..? ఎందుకంటే, విప‌క్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని వీరోచితంగా ఎదుర్కొన లేక‌పోయారు. దేశ‌వ్యాప్తంగా త‌మ‌కు ఎదురులేద‌నీ, ఏ రాష్ట్రంలో ఎన్నిక‌లు జ‌రిగినా అక్క‌డ గెలుపు త‌మ‌దేన‌నీ, మోడీ హ‌వా దిన‌దిన ప్ర‌వ‌ర్థ‌మానం అవుతోంద‌ని ఓప‌క్క ఊద‌ర‌గొడుతూ… పార్ల‌మెంటులో ముఖం చాటేశారు. అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొన‌లేక‌పోయేస‌రికి.. దేశవ్యాప్తంగా తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. మోడీ ధీరోదాత్త‌త ఇదేనా అంటూ చాలా విశ్లేష‌ణ‌లు వినిపించాయి. చారిత్రకం అనుకుంటూ చాటింపేసుకున్న‌ మోడీ నిర్ణ‌యాల వైఫ‌ల్యాల ఫ‌లితాల‌ను ప్ర‌జ‌లు ఇప్ప‌టికీ అనుభ‌విస్తున్నారు. వెర‌సి ఇవన్నీ ఏక‌రూపం దాల్చి.. మోడీపై వ్య‌తిరేక‌త‌కు కార‌ణ‌మ‌య్యాయి. వీట‌న్నింటినీ ఎదుర్కొవాలంటే ఏదో ఒక హ‌డావుడి చేయాలి. ఆ హ‌డావుడి పేరే ఈ దీక్ష‌!

ఒకే దెబ్బ‌కు రెండు పిట్ట‌లు అన్న‌ట్టుగా.. ఎలాగూ క‌ర్ణాట‌క‌లో ఎన్నిక‌లు రాబోతున్నాయి. ఏదో ఒక‌టి చేసి ఇక్క‌డ గెల‌వ‌క‌పోతే… మోడీ హ‌వాకు బ‌లం త‌గ్గింద‌నే ప్ర‌చారం మ‌రింత తీవ్ర‌త‌రం అవుతుంది. క‌ర్ణాట‌క‌లో తీవ్ర ప్ర‌చారం చేయాల్సిన అవ‌స‌రం ఉంది కాబ‌ట్టి… ఈ దీక్ష కార్య‌క్ర‌మాన్ని అమిత్ షా అక్క‌డ పెట్టుకున్నారు అనుకోవ‌చ్చు. నిజానికి, దీన్ని నిరాహార దీక్ష అనే కంటే… నిరాహార ప్ర‌చారం అన‌డం క‌రెక్ట్‌! ఆంధ్రా హోదా అంశంగానీ, త‌మిళ‌నాడు కావేరీ బోర్డు స‌మ‌స్య‌గానీ, లేదా ద‌ళితుల స‌మ‌స్య‌గానీ, ప్ర‌ముఖంగా వినిపిస్తున్న స‌మ‌స్య‌లేవైనాగానీ.. వీట‌న్నింటినీ ప్ర‌ధాని హోదాలో ప‌రిష్కారం చూపించే మార్గం ఉంటుంది. పాల‌నాప‌రంగా స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవాలి. అంతేగానీ, ఆ మార్గాన్ని వ‌దిలేసి… ప్ర‌ధాన‌మంత్రే స‌గ‌టు రాజ‌కీయ నాయ‌కుడిగా నిర‌స‌న‌ చేయడం ద్వారా ఆయ‌న ఇస్తున్న సంకేతాలేంటో ప్ర‌త్యేకంగా చెప్పుకోవాల్సిన అవ‌స‌రం లేదు. ప్ర‌తిప‌క్షాలు మోడీని తీవ్ర మ‌న‌స్థాపానికి గురి చేస్తున్నాయ‌న్న సెంటిమెంట్ ర‌గిల్చ‌డానికే ఈ కార్య‌క్ర‌మం అనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.