అంబులెన్స్ కోసం కాన్వాయ్‌ను ఆపేసిన ప్ర‌ధాని

అంబులెన్స్ ప్రాధాన్య‌త తెలిసిన వారు కాబట్టి ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ చురుకుగా స్పందించారు. ఓ అంబులెన్స్ సైర‌న్ విని త‌న కాన్వాయ్‌ను నిలిపివేయించారు. అంబులెన్స్ వెళ్ళిన అనంత‌రం కాన్వాయ్ బ‌య‌లుదేరింది. ఆఫ్రిక‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ బ్యాంకు స‌మావేశాల‌కు ఆయ‌న వెడుతున్న‌ప్పుడు ఈ సంఘ‌ట‌న చోటుచేసుకుంది. ఈ స‌మావేశాల‌ను ప్రారంభించ‌డానికి మంగ‌ళ‌వారం ఉద‌యం ఆయ‌న గుజ‌రాత్ రాజ‌ధాని గాంధీన‌గ‌ర్‌కు వ‌చ్చారు. తిరిగి వెడుతున్న సంద‌ర్భంలో ట్రాఫిక్ పోలీసులు ఓ అంబులెన్స్ ఆపివేశారు. దీన్ని గ‌మ‌నించిన మోడీ త‌క్ష‌ణం త‌న కాన్వాయ్‌ను నిలిపివేయ‌మ‌ని ఆదేశించారు. వెంటనే అధికారులు దానిని పాటించారు. అంబులెన్స్‌కు దారిచ్చారు. అది వెళ్ళిన త‌ర‌వాత మోడీ కాన్వాయ్ బ‌య‌లుదేరింది. గుజ‌రాత్‌కు చెందిన దేశ్ గుజ‌రాత్ అనే వార్తా సంస్థ ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది. అక్క‌డి మీడియా ఈ సంఘ‌ట‌న‌ను హైలైట్ చేసి, ప్ర‌చురించింది. అంబులెన్సుల‌ను ఆపేసి మ‌రీ త‌మ కాన్వాయ్‌ల‌ను పోనిచ్చుకునే మంత్రులున్న క‌ర్ణాట‌క రాష్ట్రం దీన్ని గ‌మ‌నించాలి. ముఖ్య‌మంత్రి సిద్దరామ‌య్య కోసం ఇలాగే ఒక అంబులెన్సును నిలిపివేస్తే, అందులోని రోగి మ‌ర‌ణించాడు. ఇలాంటివే ఆ రాష్ట్రంలో సంఘ‌ట‌న‌లు జ‌రుగుతూనే ఉంటాయి. తెలంగాణ రాష్ట్రంలో కూడా సీఎం కేసీఆర్ కాన్వాయ్ కోసం అంబులెన్సును గంట‌పాటు నిలిపి ఉంచ‌డంతో అందులోని రోగి స‌కాలంలో వైద్యం అంద‌క క‌న్నుమూసిన సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. అంబులెన్స్ అంటే ప్రాణాలను కాపాడే వాహ‌నం. ఎంత‌టి వారైనా ఆగిపోయి వాటికి దారివ్వాల‌ని త‌న చ‌ర్య‌తో న‌రేంద్ర మోడీ చాటి చెప్పారు. ఆయ‌న ఆచ‌ర‌ణ‌ను అంద‌రం పాటిస్తే బాగుంటుంది. కదూ!

-సుబ్ర‌హ్మ‌ణ్యం విఎస్ కూచిమంచి

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.