అంబటి రాంబాబును పొగడాల్సింది పోయి కొడతారా అని వైసీపీ అధినేత జగన్ రెడ్డి ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అంబటి రాంబాబు తిట్టి.. మళ్లీ ప్రెస్మీట్ పెట్టి క్షమాపణ చెప్పాడట. అందుకే పొగడాలట. మధ్యాహ్నం తాడేపల్లిలో బయలుదేరి ఊరేగింపు చేసుకుంటూ సాయంత్రానికి అంబటి రాంబాబు ఇంటికి చేరుకుని అక్కడ ఓ ఐదు నిమిషాలు కుటుంబసభ్యుల తలపై చేతులు పెట్టి ఓదార్చి.. తర్వాత గంట సేపు మీడియా ముందు పచ్చి అబద్దాల ప్రసంగాన్ని వినిపించారు. ఆయన మాట్లాడిన మాటల్లో ఒక్కటి కూడా నిజం లేకపోవడం రికార్డు అనుకోవచ్చు.
సీబీఐ సిట్ లడ్డూ కల్తీ జరగలేదని క్లీన్ చిట్ ఇచ్చిందని సిగ్గు లేకుండా ప్రకటించేశారు జగన్ రెడ్డి. ఇందుకు ఆయన ప్రతిష్టాత్మక ల్యాబ్ల పేర్లూ వాడుకున్నారు. సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చినా ఫ్లెక్సీలు కట్టారని చెప్పుకొచ్చారు. తమ పార్టీ నేతలు ఏం తప్పులు చేశారని అమాయకంగా ప్రశ్నిస్తున్నారు. అధికారం ఉన్నప్పుడు అడ్డగోలుగా వ్యవహరించి … సుప్రీంకోర్టులోనూ బెయిల్ రాక జైలుకెళ్లిన వాళ్లు అందరూ అయితే.. ఏం తప్పు చేయకుండా ఎలా ఉంటారో ఆయన మర్చిపోయారు.
ఇప్పుడు సీబీఐ ఇచ్చిన రిపోర్టులో తప్పులు ఉన్నాయని ఇప్పుడు మరో కమిటీ వేసి తమ నేతలను ఇరికించే ప్రయత్నాల్లో చంద్రబాబు ఉన్నారని జగన్ మండిపడ్డారు. సీబీఐ చెప్పింది తప్పు తాను నియమించిన కమిటీ చెప్పిందే కరెక్ట్ అనేలా ప్రచారం ప్రారంభించారని దీన్ని ప్రజలు గమనిస్తున్నారని కచ్చితంగా బుద్దిచెబుతారని ఆవేశపడ్డారు. ఇలాంటి దాడులు చేస్తున్నావారిని, చేయిస్తున్న వారిని, వాటికి సహకరిస్తున్న పోలీసులను వదలిపెట్టబోమని వార్నింగ్ ఇచ్చారు. మూడేళ్లలో అధికారంలోకి వచ్చిన తర్వాత అందరికీ వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు.