జంప్ జిలానీలు ఆ క్ర‌మ‌శిక్ష‌ణ త‌ట్టుకోలేక‌పోతున్నార‌ట‌..!

అత్యంత క్ర‌మశిక్ష‌ణ కలిగిన పార్టీ మాదే అని తెలుగుదేశం నేత‌లు గొప్ప‌గా చెప్పుకుంటూ ఉంటారు. కార్య‌క‌ర్త‌ల మొద‌లుకొని అధినాయ‌క‌త్వం వ‌ర‌కూ అంద‌రూ పార్టీ నియ‌మ నిబంధ‌న‌ల‌కు క‌ట్టుబ‌డి ఉంటార‌నీ, ఏళ్ల త‌ర‌బ‌డి పార్టీని నిల‌బెడుతున్న‌ది త‌మ క్ర‌మ‌శిక్ష‌ణే అని సంద‌ర్భం వ‌చ్చిన ప్ర‌తీసారీ ప్ర‌చారం చేసుకుంటారు. దీనికి త‌గ్గ‌ట్టుగానే పార్టీ త‌ర‌ఫున ఏ కార్య‌క్ర‌మాలు జ‌రిగినా, ప్ర‌భుత్వ కార్య‌కలాపాల్లోనైనా ఈ క్ర‌మశిక్షణ క‌నిపిస్తూనే ఉంటుంది. ఇది కాస్త అటుఇటు అయితే ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు క్లాస్ తీసేసుకుంటార‌నే అభిప్రాయం కూడా నాయ‌కుల్లో ఎల్ల‌ప్పుడూ ఉంటుంది. అయితే, ఇప్పుడీ క్ర‌మ‌శిక్ష‌ణ అనేది ఏదైతే ఉందో.. వైకాపా నుంచి వ‌చ్చి చేరినవారికి కాస్త ఇబ్బందిక‌రంగా ఉంద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మౌతోంది!

వైకాపాలో ఉండ‌గా కావాల్సినంత స్వేచ్ఛ వారికి అక్కడ ఉండేది. ఎమ్మెల్యేలు అయినాస‌రే, పార్టీ త‌ర‌ఫున మీటింగులు అరుదుగా ఉండేవి. కానీ, తెలుగుదేశంలోకి వ‌చ్చాక ప‌రిస్థితి అలా కాదు క‌దా! ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఎప్ప‌టికిప్పుడు రివ్యూలు అంటారు, నివేదిక‌లు అంటారు, సుదీర్ఘ స‌మావేశాలంటారు. ఇవ‌న్నీ కొంత‌మంది ఫిరాయింపు నేత‌ల‌కు ఇంకా పూర్తిగా డైజెస్ట్ కావ‌డం లేదనీ, ఈ వాతావరణం అలవాటు కాలేదనే అభిప్రాయం వ్య‌క్త‌మౌతోంది. ఈ విష‌యం తాజాగా బ‌య‌ట‌ప‌డింది. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న అసెంబ్లీ స‌మావేశాల‌ను ప్ర‌తిప‌క్షం బ‌హిష్క‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ మ‌ధ్య వ‌రుస‌గా సెల‌వులు రావ‌డంతో.. ఆ త‌రువాత కూడా స‌భ‌కు ఎమ్మెల్యేలు ఆల‌స్యంగా రావ‌డంపై సీఎం సీరియ‌స్ అయిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా స‌భ్యుల రాక‌పోక‌ల‌పై సీఎం గ‌ట్టి నిఘా పెట్టార‌నీ అన్నారు.

శాస‌నస‌భ‌కు స‌భ్యులు ఎన్ని గంట‌ల‌కు వ‌స్తున్నారూ, స‌భ జ‌రుగుతూ ఉంటే ఎన్ని బ్రేకులు తీసుకుంటున్నార‌నేది కూడా చంద్ర‌బాబు ఆరా తీస్తున్నార‌ట‌. దీంతో కొంత‌మంది జంప్ జిలానీ నేత‌లు అసెంబ్లీ లాబీల్లో మీడియా ప్ర‌తినిధుల‌తో ఆఫ్ ద రికార్డ్ త‌మ గోడు వెళ్ల‌గ‌క్కుతున్నారు. త‌మ‌కు కొన్ని ఆరోగ్య స‌మ‌స్య‌లున్నాయ‌నీ, షుగ‌ర్ పేషెంట్ల‌మ‌నీ, గంట‌ల త‌ర‌బ‌డి కూర్చోవ‌డానికి ఆరోగ్యం స‌హ‌క‌రించ‌ద‌నీ, మ‌ధ్య‌మ‌ధ్య‌లో బ‌య‌ట‌కి వ‌చ్చి ఏదైనా తినాల్సిన అవ‌స‌రం వ‌స్తుంద‌నీ… ఇలా కొంద‌రు ఎమ్మెల్యేలు వాపోయార‌ట‌. స‌మీక్ష‌లూ నివేదిక‌లూ అంటూ త‌మ‌కు నిత్యం ఏదో ఒక హోమ్ వ‌ర్క్ ఉంటూనే ఉంద‌ని అంటున్నార‌ట‌! కాసేపు బ్రేక్ తీసుకునేందుకు బ‌య‌ట‌కి వ‌చ్చినా, ఇత‌ర స‌భ్యులు అదోలా చూస్తున్నారంటూ జంప్ జిలానీల్లో కొంద‌రు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రి, అధికార పార్టీ కావాలీ, ఆ పార్టీ నుంచి ల‌భించే ప‌ద‌వులు కావాలీ, ప్ర‌యోజ‌నాలు పొందాలీ.. ఇన్ని కావాల‌నుకున్న‌ప్పుడు కొన్ని భ‌రించక త‌ప్ప‌దు క‌దా!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.