ప్రొ.నాగేశ్వర్: పుష్కరాల దుర్ఘటనలో ముఖ్యమంత్రి బాధ్యత ఎంత..?

గోదావరి పుష్కరాల సమయంలో.. రాజమండ్రిలో జరిగిన తొక్కిసలాట ఘటనపై… జస్టిస్ సోమయాజులు కమిషన్ నివేదిక ఇచ్చింది. పుష్కరాల సమయంలో జరిగిన అతి ప్రచారం, మీడియా అత్యుత్సాహం, ప్రవచనకారులు చెప్పిన విషయాల కారణంగానే ప్రజల్లో ఓ ముహుర్తం మీద నమ్మకం పెట్టుకోవడం వల్ల ఈ దుర్ఘటన జరిగిందని.. సోమయాజులు కమిషన్ నివేదిక ఇచ్చింది. ముఖ్యమంత్రికి ఎటువంటి సంబంధం లేదని.. ఆయన స్నానం చేసిన వెళ్లిపోయిన తర్వాతే ఈ ఘటన జరిగిందని.. సోమాయాజులు కమిటీ చెప్పింది.

కమిటీని వేసింది సీఎంకు క్లీన్ చిట్ ఇవ్వడానికా..?

జస్టిస్ సోమయాజులు కమిటీ .. పుష్కరాల దుర్ఘటనపై విచారణ జరిపి పదిహేడు పేజీల నివేదిక ఇచ్చింది. ఈ నివేదికలో ప్రమాదం ఎలా జరిగింది… భవిష్యత్‌లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఏం చేయాలన్నదానిపై కన్నా.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఈ ఘటనకు సంబంధం లేదని చెప్పడానికే ఈ నివేదికలో ఎక్కువ తాపత్రయం కనిపించింది. సోమయాజులు కమిషన్ ను అసలు ఎందుకు వేశారు..?. అసలు ఈ ప్రమాదానికి కారణం ఎవరో తేల్చడానికి వేశారా..? ఇలాంటి దుర్ఘటనలు మళ్లీ మళ్లీ జరగకుండా జాగ్రత్తలు తీసుకునేందుకు ఈ కమిటి వేశారా..?. అసలు ఈ దుర్ఘటనలో ఫండమెంటల్ ఇష్యూ.. ఏమిటంటే.. ముహుర్తం ప్రచారం. పుష్కరాలు జరిగే పన్నెండు రోజులు.. ప్రతి క్షణం .. పుణ్య ఘడియలే. అయితే.. కొంత మంది ప్రత్యేకంగా ఓ ముహుర్తాన్ని ఎంపిక చేసుకుని ప్రచారం చేశారు. ప్రవచనకారులు దాన్నే ప్రబోధించారు. ఫలితంగా… ఆ ముహుర్తం సమయానికి స్నానం చేయాలన్న తాపత్రయంతో.. ఒక్కసారిగా అందరూ దూసుకెళ్లడంతో ప్రమాదం జరిగింది. ఇది పండమెంటల్ ఇష్యూ. ఇది ప్రవచన కర్తల తప్పు కాదు.. మీడియానూ తప్పుపట్టలేం. సాక్షాత్తూ ప్రభుత్వమే ప్రచారం చేసింది.

ప్రభుత్వమే అతి ప్రచారం చేసిందా..?

సహజంగా ప్రభుత్వం భక్తులకు సౌకర్యాలు కల్పించడానికే పరిమితమవ్వాలి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ప్రజల విశ్వాసాల్ని కూడా రాజకీయాలకు వాడుకోవాలనే తాపత్రయం పెరిగిపోయింది. ఇది దేశవ్యాప్తంగా ఉంది. అందుకే… పుష్కరాల లాంటి వాటిని ప్రభుత్వం నిర్వహిస్తోంది. లౌకిక రాజ్యంలో ప్రజల పాత్రేమిటంటే.. విశ్వాసాలు కలిగినటువంటి ప్రజలు ఓ కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు.. వారికి ఏ ఇబ్బంది లేకుండా చూడటం అనేది ప్రభుత్వాల బాధ్యత. కానీ ప్రభుత్వాధినేతలే ఈ కార్యక్రమాలకు నాయకత్వం వహిస్తున్నారు. ముఖ్యమంత్రి పుష్కర స్నానం చేశారు. ఓ ప్రత్యేకమైన ముహుర్తంలో స్నానం చేసి వెళ్లారు. ఆ తర్వాత భక్తులందర్నీ ఒక్క సారిగా ఘాట్‌లోకి వదిలారు. సోమయాజులు కమిషన్ కూడా అదే చెప్పింది. ముఖ్యమంత్రి వెళ్లిపోయిన తర్వాత తొక్కిసలాట జరిగిందని చెప్పింది. నిజమే అది. ముఖ్యమంత్రి ఉండగా ఎవర్నీ వెళ్లనివ్వలేదు.

మళ్లీ జరగకుండా ఏం చేయాలో కమిటీ సూచనలు చేసిందా..?

ఈ ప్రమాదానికి చంద్రబాబునాయుడే.. కారణం అనో… .. చంద్రబాబునాయుడు వల్లే ప్రమాదం జరిగిందనో ఎవరూ అనడం లేదు. కానీ అతి వినయం ధూర్త లక్షణం అంటారు. అధికారగణం ముఖ్యమంత్రికి సేవలు చేయడంలో.. నిమగ్నమై.. ప్రజల భద్రతను మర్చిపోవడం వల్ల జరిగిందని క్లియర్‌గా అర్థమైపోతుంది. చంద్రబాబు నాయుడు వల్ల జరిగిందని ఎవరూ అనడం లేదు. చంద్రబాబునాయుడే దోషి అని కూడా అనడం లేదు. కానీ మన రాజ్యవ్యవస్థలో ఉన్న లోపం మాత్రం బయటపడిపోతోంది. ముఖ్యమంత్రి కోసం.. భక్తుల్ని ఆపారు. యంత్రాంగం అంతా ఆయన సేవలో నిమగ్నమయింది. ఆయన వెళ్లిపోయిన తర్వాత ఒక్కసారిగా భక్తుల్ని విడుదల చేశారు. వాస్తవానికి ముఖ్యమంత్రి స్నానం చేసిన ఘాట్ గురించి కూడా.. విపరీతంగా ప్రచారం జరిగింది. అక్కడే స్నానం చేస్తేనే పుణ్యమన్నట్లుగా చెప్పుకొచ్చారు. కానీ ఏ సమయంలోనైనా.. ఏ ఘాట్‌లో అయినా… స్నానం చేస్తే.. పుణ్యం వస్తుందని… ప్రచారం చేసి ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదు కదా..! . కానీ పర్టిక్యులర్ ఘాట్‌లో.. పర్టిక్యూలర్ సమయంలో స్నానం చేయాలన్న ప్రచారాన్ని ఉద్ధృతంగా చేశారు.

సీఎం కారణం కాదు కానీ బాధ్యత ఉంటుంది..!

ఘాట్‌ దగ్గర ఒక్కసారిగా.. భక్తుల్ని వదిలారు. భక్తుల్ని కంట్రోల్ చేసే ప్రయత్నం జరగలేదు. అక్కడ ప్రధానంగా తప్పు జరిగింది. ఇలాంటి సమయంలో జస్టిస్ సోమయాజుల కమిషన్.. దీనిపై దృష్టి సారించి.. నివేదికలో పొందు పరచాల్సి ఉంది. పెద్ద ఎత్తున.. జనం ఉన్నప్పుడు.. వీఐపీలను ఎలా నియంత్రించాలన్నదానిపై… రిపోర్ట్ ఇచ్చి ఉంటే.. నివేదిక ఉపయోగపడి ఉండేది. నిజానికి రైళ్లు పెద్ద సంఖ్యలో భక్తుల్ని తీసుకుని రావడం.. రైల్వే స్టేషన్ నుంచి ఘాట్ వద్దకు.. వచ్చే దారి ఇరుకుగా ఉండటంతో పాటు.. భక్తుల్ని నిలిపివేసి ఒక్కసారిగా.. పంపడం వల్ల సమస్య వచ్చింది. వీటన్నింటిని మొదటి నుంచి రెగ్యులేట్ చేసి ఉంటే.. ఈ సమస్య వచ్చేది కాదు. శబరిమలలో కూడా.. ఓ సారి తొక్కిసలాట జరిగింది. ఎందుకంటే.. అక్కడ కూడా.. చాలా రోడ్డులో.. అత్యధిక మందిని పంపడం వల్ల.. ఈ తొక్కిసలాట జరిగింది. ఇలాంటి పరిస్థితుల్ని సహజంగానే గుర్తించవచ్చు. కానీ.. గుర్తించలేకపోయారు. ఎందుకు రోడ్ క్యారీయింగ్ కేపాసిటీకి మించి… జనాల్ని పంపించారు..? ఎందుకు అపరిమితంగా రైళ్లను రైల్వేస్టేషన్లలో నిలిపే అవకాశం ఇచ్చారు..? ఇరుకైన రోడ్లున ఎందుకు వెడల్పు చేసే ప్రయత్నం చేయలేదు..?

మళ్లీ మళ్లీ జరగకుండా చూడటమే ముఖ్యం..!

కనీసం.. ప్రజల్ని అవగాహన పెంచే ప్రయత్నం చేయలేదు. అందుకే ఇప్పటికైనా.. ఈ సోమయాజులు కమిటీ కానీ..మరో కమిటీ కాని… చేయాల్సింది ఏమిటంటే.. రాజకీయ నాయకులకు క్లీన్ చిట్ ఇవ్వడం కాకుండా… అలాంటి డిజాస్టర్స్ జరగకుండా.. తీసుకోవాల్సిన చర్యలను సూచించాలి. ఈ దుర్ఘటనకు.. ముఖ్యమంత్రి కారణం అని చెప్పలేం.. కానీ ప్రభుత్వాధినేతగా బాధ్యత ఉంటుంది. అందుకే.. డిజాస్టర్ మేనేజ్‌మెంట్ గురించి జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌ అనేది ఇప్పుడో సైన్స్‌లా అభివృద్ధి చెందుతోంది. ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా… సోమయాజులు లాంటి కమిటీలు నివేదికలు ఇవ్వాలి. వాటిని ప్రభుత్వం ఆచరించాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.