క‌డ‌ప ఉక్కు క‌ర్మాగారంపై కేంద్రం కొత్త కిరికిరి ఉండ‌దుగా..!

ఎట్ట‌కేలకు విభ‌జ‌న హామీల్లోని ఒక అంశంపై సానుకూలంగా అడుగులు ప‌డే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. క‌డ‌ప‌లో ఉక్కు క‌ర్మాగారం ఏర్పాటు డిమాండ్ ఎప్ప‌ట్నుంచో వినిపిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్ర‌భుత్వం నుంచి కూడా కేంద్రానికి ఈ కర్మాగారం ఏర్పాటుపై చాలా విన్న‌పాలే వెళ్లాయి. అయితే, కేంద్రం నుంచి ఇంత‌వ‌ర‌కూ ఎలాంటి స్పంద‌నా లేదు. ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రాజకీయ వాతావరణం ఎలా ఉందో తెలిసిందే. ఈ నేప‌థ్యంలో టాస్క్ ఫోర్స్ క‌మిటీ ఒక సానుకూల నివేదిక‌ను ఇచ్చింది. దీంతో క‌ర్మాగారం ఏర్పాటుకు కొంత సానుకూలత ఏర్పడుతుంద‌నే ఆశ‌లు చిగురిస్తున్నాయి.

ఉక్కు క‌ర్మాగారం ఏర్పాటుపై టాస్క్ ఫోర్స్ క‌మిటీ త‌న నివేదిక‌ను కేంద్రానికి పంపింది. ఉక్కు శాఖ‌మంత్రి చౌద‌రీ బీరేంద్ర సింగ్ దీన్ని ప‌రిశీలించి, సంతృప్తి వ్య‌క్తం చేశారు. కడపలో ప‌రిశ్ర‌మ ఏర్పాటుకు అవ‌స‌ర‌మైన సౌక‌ర్యాల క‌ల్ప‌న గురించి రాష్ట్ర ప్ర‌భుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూస్తున్నామ‌ని ఉక్కు శాఖ మంత్రి అన్నారు. భూమి, విద్యుత్‌, నీరు వంటి మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న విష‌య‌మై త‌మ మంత్రిత్వ శాఖ రాష్ట్రంతో చ‌ర్చ‌లు జ‌రుపుతోంద‌న్నారు. టాస్క్ ఫోర్స్ క‌మిటీ నివేదిక సానుకూలంగానే ఉంది. కానీ, దీనిపై కేంద్రం వైఖ‌రి ఎలా ఉంటుందో అనే అనుమానాలు ఉన్నాయి. క‌నీసం ఇప్ప‌టికైనా దీన్ని ఆమోదించి, అధికారికంగా ప‌రిశ్ర‌మ నిర్మాణ ప‌నులు ప్రారంభిస్తే మంచిదే.

ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటు విష‌యంలో ఏపీ స‌ర్కారు స్పంద‌న ఎంత వేగంగా ఉంటుంద‌నేది ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. అందుకు కియా మోటార్స్ ఏర్పాటే ఉదాహ‌ర‌ణ‌. ఆ సంస్థ ఏర్పాటుకు అవ‌స‌ర‌మైన మౌలిక స‌దుపాయాల‌ను అత్యంత వేగంగా క‌ల్పించింది. రాష్ట్రంలో ప‌రిశ్ర‌మ‌ల‌కు అనువైన వాతావ‌ర‌ణాన్ని చంద్ర‌బాబు స‌ర్కారు సృష్టించి పెట్టింది అన‌డంలో ఏమాత్రం సందేహం లేదు. కానీ, ఇప్పుడిది కేంద్ర ప్ర‌భుత్వంతో జరుగుతున్న డీల్ కదా. అస‌లే భాజ‌పా స‌ర్కారు, ఆ పై ఆంధ్రా విష‌యంలో ఆగ్ర‌హంగా ఉన్నారు. ఈ నేప‌థ్యంలో మ‌ళ్లీ ఏదో ఒక కిరికిరి పెట్టి ఆల‌స్యం చేస్తారేమో అనేది చిన్న అనుమానం..! క‌డ‌ప ఉక్కు క‌ర్మాగారంతో ఇత‌ర విభ‌జ‌న హామీల‌పై ఇప్ప‌టికైనా కేంద్రం సానుకూల దృక్ప‌థంతో నిర్ణ‌యాలు తీసుకుంటే బాగుంటుంది. కానీ, రాజ‌కీయంగా క‌క్ష‌సాధింపు ధోర‌ణిలో ఉన్న భాజ‌పా పెద్ద‌లు.. ఇలా ఆలోచిస్తారా..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.