రేవంత్ వ్యూహం చంద్ర‌బాబుకు న‌చ్చ‌లేదా..?

తెలంగాణ‌లో తెలుగుదేశం పార్టీకి కొత్త ఊపు తేవాల‌ని టీ టీడీపీ నేత‌లు ప్ర‌య‌త్నిస్తున్న సంగ‌తి తెలిసిందే. నిజానికి, ఆ పార్టీలో చెప్పుకోద‌గ్గ నాయ‌కులెవ్వ‌రూ లేక‌పోయినా… వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ప్ర‌త్యామ్నాయ మార్గాల ద్వారా ప్ర‌భావ‌వంత‌మైన రాజ‌కీయ శ‌క్తిగా ఎదిగేందుకు ర‌క‌ర‌కాల వ్యూహాల గురించి ఆలోచిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే రేవంత్ రెడ్డి ఓ ప్ర‌తిపాద‌న‌ను తెర‌మీదికి తెచ్చిన సంగ‌తి తెలిసిందే! అదేంటంటే… కేసీఆర్ వ్య‌తిరేక‌ రాజ‌కీయ శ‌క్తుల‌ను ఏకీకృతం చేయ‌డం. కాంగ్రెస్‌, వామ‌ప‌క్షాల‌ను క‌లుపుకుని తెరాస వ్య‌తిరేక రాజ‌కీయ పార్టీల‌ను సంఘ‌టితం చేస్తే బాగుంటుంద‌ని ఈ మ‌ధ్య రేవంత్ అభిప్రాయ‌ప‌డుతూ వ‌స్తున్నారు. దీంతోపాటు, తెలంగాణ‌లో భాజ‌పాతో పొత్తు తెగ‌తెంపులు చేసుకుని, ఇలాంటి కూట‌ముల‌ను ఏర్పాటు చేసుకుంటే బెట‌ర్ అనే ప్ర‌పోజ‌ల్ ని రేవంత్ తీసుకొచ్చారు.

అయితే, ఈ అంశాల‌ను పార్టీ అధ్య‌క్షుడు చంద్రబాబు ముందుకు తీసుకెళ్లేస‌రికి… ఆయ‌న స్పంద‌న మ‌రోలా ఉంద‌ని స‌మాచారం! మ‌హానాడు సందర్భంగా చేయాల్సిన తీర్మానాల‌పై చంద్ర‌బాబుతో టీ.టీడీపీ నేత‌లు భేటీ అయ్యారు. ఎల్‌. ర‌మ‌ణ‌, రేవంత్ రెడ్డి, రావుల చంద్ర‌శేఖ‌ర్ రెడ్డిలు… తెలంగాణ‌లో టీడీపీ అనుస‌రించాల్సిన వ్యూహాల‌కు సంబంధించి కొన్ని ఆలోచ‌న‌ల్ని చంద్ర‌బాబుతో పంచుకున్నారు. వాటిలో ప్ర‌ముఖంగా ఉన్న‌వి ఈ రెండే.. ఒక‌టీ తెరాస‌కు వ్య‌తిరేకంగా ఇత‌ర పార్టీల‌తో కూట‌మి క‌ట్ట‌డం, రెండు.. భాజ‌పాతో పొత్తు తెగ‌తెంపులు! అయితే, ఈ రెండింటిపైనా చంద్ర‌బాబు ఏం చెప్పారంటే… తొంద‌రప‌డొద్ద‌ని!

తెరాస‌కు ప్ర‌త్యామ్నాయాన్ని ప్ర‌జ‌ల ముందుంచాల‌నీ, కానీ ఇప్ప‌ట్లోనే పొత్తులు వంటి వాటి గురించి మాట్లాక‌పోతే మంచిదంటూ చంద్ర‌బాబు హిత‌వు ప‌లికార‌ట‌. ఇక‌, భాజ‌పా విష‌యంలో కూడా కొన్నాళ్లు సైలెంట్ గా ఉండ‌మని చెప్పార‌ట‌. తొంద‌ర‌ప‌డి భాజపాపై విమ‌ర్శ‌లు చెయ్యొద్ద‌నీ, పొత్తుకు సంబంధించి తెలంగాణ భాజ‌పా నేత‌లు ఎలా వ్యాఖ్యానిస్తున్నా స్పందించవ‌ద్ద‌నీ, తాను అమిత్ షాతో చ‌ర్చిస్తాన‌నీ అన్నార‌ట‌. తెలంగాణ పొత్తు విష‌య‌మై అమిత్ షా స్ప‌ష్ట‌త ఇచ్చిన త‌రువాత‌నే కార్యాచ‌ర‌ణ మొద‌లుపెడ‌దామని చంద్ర‌బాబు చెప్పిన‌ట్టు తెలుస్తోంది.

మొత్తానికి, రేవంత్ ప్ర‌తిపాదించిన కూట‌మి వ్యూహానికి చంద్ర‌బాబు తాత్కాలికంగా బ్రేకులు వేశారు. అవ‌స‌ర‌మైతే కాంగ్రెస్ తో కూడా పొత్తుకు సిద్ధ‌మే అన్న‌ట్టుగా ఈ మ‌ధ్య రేవంత్ సంకేతాలు ఇచ్చేస్తూ వ‌చ్చారు. కానీ, భాజ‌పాను వ‌దులుకునేందుకు చంద్ర‌బాబు సిద్ధంగా లేర‌నేది మ‌రోసారి అర్థ‌మౌతోంది. తెలంగాణ‌లో టీడీపీని వ‌ద‌లించుకుందామ‌ని భాజ‌పా అనుకుంటూ ఉన్నా… టీడీపీ వ‌దిలేలా క‌నిపించ‌డం లేదు!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com