న‌ర‌సింహ‌న్ తీరుపై విమ‌ర్శ‌లు త‌గ్గ‌డం లేదు..!

తెలుగు రాష్ట్రాల గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ తీరుపై విమ‌ర్శ‌లు ఇప్ప‌ట్లో త‌గ్గేలా లేవు. ఆ దిశ‌గా ఆయనా ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు లేదులెండి! గ‌తవారం వ‌ర‌కూ ఆంధ్రాలో న‌ర‌సింహ‌న్ తీరుపై విమ‌ర్శ‌లు వినిపించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌భుత్వం ప్ర‌వేశపెట్టిన నాలా బిల్లుకు లేనిపోని కొర్రీలు పెడుతున్నార‌నీ, తెలంగాణ ప‌క్ష‌పాతిగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నీ, అమ‌రావ‌తిలో ఆయ‌న కొద్దిరోజులు కూడా బ‌స చేయ‌డం లేద‌నీ, ఈ నేప‌థ్యంలో ఏపీకి ప్ర‌త్యేక గ‌వ‌ర్న‌ర్ కావాల‌నే డిమాండ్ వ‌ర‌కూ వెళ్లింది. ఇదే అంశ‌మై ఏపీ భాజ‌పా నేత‌లు కేంద్రానికి లేఖ రాస్తామ‌న్నంత‌వ‌ర‌కూ చ‌ర్చ న‌డించింది. ఈ నేప‌థ్యంలో నాలా బిల్లుపై న‌ర‌సింహ‌న్ ఆమోదముద్ర వేసేయ‌డంతో ప‌రిస్థితి కొంత స‌ద్దుమ‌ణిగిన‌ట్టు అయింది. అయితే, ఇంత జ‌రిగాక కూడా ఆయ‌న తీరేం మార‌లేదు అన‌డానికి తాజాగా కాళేశ్వ‌రం ప‌ర్య‌ట‌నే సాక్ష్యం.

కాళేశ్వరం ప్రాజెక్టు ప‌నుల‌ను గ‌వ‌ర్న‌ర్ ప‌రిశీలించిన సంగ‌తి తెలిసిందే. అంత‌వ‌ర‌కూ బాగానే ఉందిగానీ.. ముఖ్య‌మంత్రి కేసీఆర్ ను, మంత్రి హ‌రీష్ రావును ఆకాశానికి ఎత్తేయ‌డ‌మే.. ఇప్పుడు మ‌ళ్లీ విమ‌ర్శ‌ల‌కు ఆస్కారం ఇచ్చిన‌ట్ట‌యింది. కేసీఆర్ ను ఇక‌పై కాళేశ్వ‌రం చంద్ర‌శేఖ‌ర‌రావు అనాల‌నీ, హ‌రీష్ రావును కాళేశ్వ‌ర‌రావు అనాలంటూ ఆయ‌న పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ఇదే అంశంపై తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు భ‌గ్గుమంటున్నారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టు నిర్ణీత స‌మ‌యంలో పూర్తికాక‌పోతే అధికార పార్టీ చేసిన అవినీతిలో గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ కు కూడా భాగం ఉందేమో అని అనుమానించాల్సి వ‌స్తుందంటూ కాంగ్రెస్ వీహెచ్ ఆరోపించారు. కొద్దిరోజులు పోతే రాజ్ భ‌వ‌న్ ని కూడా తెరాస భ‌వ‌న్ అని న‌ర‌సింహ‌న్ చెప్తారేమో అంటూ భ‌ట్టి విక్ర‌మార్క ఎద్దేవా చేశారు. రాజ్యంగబ‌ద్ధ‌మైన ప‌ద‌విని కించ‌ప‌ర‌చేలా ఒక పార్టీకి లేదా ప్ర‌భుత్వానికి మ‌ద్ద‌తు ఇచ్చే విధంగా గ‌వ‌ర్న‌ర్ వ్య‌వ‌హ‌రిస్తూ ఉండ‌టం స‌రైంది కాదంటూ మండిప‌డ్డారు. గ‌వ‌ర్న‌ర్ తీరుపై త్వ‌ర‌లోనే ప్ర‌ధాన‌మంత్రి, రాష్ట్రప‌తికి ఫిర్యాదు చేయ‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టు అవినీతిపై భ‌విష్య‌త్తులో కేసులు త‌ప్ప‌వ‌నీ, అప్పుడు న‌ర‌సింహ‌న్ పేరు కూడా చేర్చాల్సి ఉంటుందంటూ కాంగ్రెస్ నేత‌లు వ్యాఖ్యానించారు.

ఆంధ్రాలో గ‌వ‌ర్న‌ర్ పై చ‌ర్చ ముగిసిందీ అనుకుంటే.. ఇప్పుడు టి. కాంగ్రెస్ దాన్ని అందుకుంది. టీ కాంగ్రెస్ నేత‌లు గ‌వ‌ర్న‌ర్ తీరుపై ఎంత గుర్రుగా ఉన్నారో ఆ మ‌ధ్య రాజ్ భ‌వ‌న్ లో చోటు చేసుకున్న ఘ‌ట‌నే సాక్ష్యం. కాళ్వేశ్వ‌రం ప్రాజెక్టు ప‌నుల‌ను ప‌రిశీలించ‌డం వ‌ర‌కూ ఓకే. కానీ, కేసీఆర్ ను ఆకాశానికి ఎత్తేయాల్సిన అవ‌స‌రం గ‌వ‌ర్న‌ర్ కు ఏముంటుంది..? అధికార పార్టీ నేత‌ల‌ను ప్ర‌స‌న్నం చేసుకునే విధంగా న‌ర‌సింహ‌న్ వ్య‌వ‌హ‌రించాల్సిన ప‌నేముంది..? రెండు రాష్ట్రాల గ‌వ‌ర్న‌ర్ గా ఉన్న‌ప్పుడు కొంత స‌మ‌తౌల్యం పాటించాలి. కాళేశ్వ‌రం వెళ్లారు కాబ‌ట్టి, ఇప్పుడు పోల‌వ‌రం గురించి చ‌ర్చ మొద‌లైనా ఆశ్చ‌ర్యం లేదు! ఆయ‌న పోల‌వ‌రం సంద‌ర్శించరా, ఈ రాష్ట్రంలో నిర్మిత‌మౌతున్న ఇరిగేష‌న్ ప్రాజెక్టుల‌పై మాట్లాడ‌రా, కేసీఆర్ ను మెచ్చుకున్న‌ట్టే చంద్ర‌బాబు కృషినీ గుర్తించ‌రా… ఇలాంటి చ‌ర్చ‌ల‌న్నింటికీ న‌ర‌సింహ‌నే ఆస్కారం ఇస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.