జేసీపై ఇప్పుడైనా చ‌ర్య‌లు ఆశించొచ్చా..?

ఆ మ‌ధ్య విశాఖ‌ప‌ట్నం ఎయిర్ పోర్టులో టీడీపీ ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి చేసిన ర‌చ్చ అంద‌రూ చూశారు. తాను గంట ముందు ఎయిర్ పోర్టుకు వ‌చ్చినా బోర్డింగ్ పాస్ ఇవ్వ‌డం లేదంటూ సిబ్బందిపై చిర్రుబుర్రులాడారు. ప్రింట‌ర్ ని పైకెత్తి పడేసే ప్ర‌య‌త్నం చేశారు. అయితే, అదే స‌మ‌యంలో కేంద్ర‌మంత్రి అశోక్ గ‌జ‌ప‌తిరాజు అక్క‌డే ఉన్నారనీ.. జేసీ విష‌యం తెలుసుకుని ఆయ‌నే బోర్డింగ్ పాస్ ఇప్పించి, జేసీని విమానం ఎక్కించార‌ని క‌థ‌నాలు వ‌చ్చాయి. దీంతో వెంట‌నే అశోక్ స్పందించి ఓ ట్వీట్ చేశారు. ఈ క‌థ‌నాల్లో వాస్త‌వం లేదంటూ కొట్టి పారేశారు. ఈ ఘ‌ట‌న‌పై పూర్తి వివ‌రాల కోసం ఆదేశించామ‌నీ, భ‌ద్ర‌తా నియ‌మాల‌కు విరుద్ధంగా ఎవ‌రు ప్ర‌వ‌ర్తించినా చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని అశోక్ అప్ప‌ట్లో అన్నారు. అంటే, జేసీపై ఏవో చ‌ర్య‌లు ఉంటాయేమో అనే బిల్డ‌ప్ ఇచ్చారు. ఆ త‌రువాత‌, జేసీ యూర‌ప్ టూర్ వెళ్లొచ్చారు. ఈలోగా విశాఖ ఇష్యూకి బూజు ప‌ట్టేసింది!

అయితే, అదే ఇష్యూని మ‌రోసారి వెలుగులోకి తెచ్చింది రిప‌బ్లిక్ టీవీ. ఓ స్టింగ్ ఆప‌రేష‌న్ నిర్వ‌హించి జేసీ ఘ‌ట‌న‌ను తిర‌గ‌దోడింది. ఈ స్టింగ్ ఆప‌రేష‌న్ తిరిగి తిరిగీ కేంద్ర‌మంత్రి అశోక్ జ‌గ‌ప‌తిరాజు మెడ‌కు చుట్టుకునేట్టుగా ఉంది. తాజాగా జేసీ ఈ ఘ‌ట‌న గురించి మాట్లాడుతూ.. ‘ఆరోజు మంత్రి అక్క‌డే ఉన్నారు. ఆయ‌నే మేనేజ‌ర్ తో మాట్లాడి బోర్డింగ్ పాస్ నాకు ఇప్పించారు. అదే రోజున విమానంలో హైద‌రాబాద్ కి వ‌చ్చాను’ అంటూ వీడియోలో చెప్పారు. దీంతో జేసీ చెప్పిన ఆ మంత్రివ‌ర్యులు ఎవ‌రు అనే చ‌ర్చ మొద‌లైంది. రొటీన్ గా అంద‌రి చూపూ ఆయ‌న‌వైపే ఉంటుంది. ఆరోజు విమానాశ్ర‌యంలో ఉన్న‌ది అశోక్ జ‌గ‌ప‌తి అని క‌థ‌నాలు వ‌చ్చాయి. అబ్బే నేను ఆరోజు అక్క‌డ లేన‌ని అశోక్ క్లారిఫికేష‌న్ ఇచ్చుకున్నా.. జేసీ చెప్పిన మంత్రి ఎవ‌రు అనేది ప్ర‌శ్న‌..?

విశాఖ ఘ‌ట‌న‌కు సంబంధించి ఆ చ‌ర్య‌లేంటో, విమానాశ్ర‌యంలో జేసీ ప్ర‌వ‌ర్త‌న‌కు సంబంధించిన స‌మాచారాన్ని ప్ర‌భుత్వం తెప్పించుకున్నాక ఏం చేసిందో ఎవ్వ‌రికీ తెలీదు! ఆ త‌రువాత ఆ ఇష్యూ ఫాలో అప్ గురించి ప్ర‌భుత్వం త‌ర‌ఫు నుంచి ఎవ్వ‌రూ మాట్లాడ‌లేదు. జేసీ ప్ర‌వ‌ర్త‌న‌పై ముఖ్య‌మంత్రి ఆగ్ర‌హించార‌నీ, మంద‌లించార‌నే క‌థ‌నాల‌తో ఈ ఇష్యూకి ఫుల్ పెట్టేశారు! అయితే, ఇప్పుడు జేసీ మ‌రోసారి కెమెరాల‌కి దొరికిపోయి.. త‌న‌కు సాయం చేసింది మంత్రిగారే అనేశారు క‌దా. దీంతో అశోక్ గ‌జ‌ప‌తి స‌త్య‌సంధ‌త‌ను శంకించాల్సి వ‌స్తోంది.

అయితే, ఇప్పుడైనా ఆ ఘ‌ట‌న విష‌య‌మై చ‌ర్య‌లుంటాయ‌ని ఆశించ‌డం.. క‌చ్చితంగా అత్యాశే. మ‌హా అయితే ఇప్పుడేం జ‌రుగుతుందీ.. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు మ‌రోసారి జేసీని పిలిపిస్తారు. క్లాస్ తీసుకుంటారు. ఈ ఘ‌ట‌న‌పై చంద్ర‌బాబు ఆగ్ర‌హంతో ఉన్నారంటూ టీడీపీ వ‌ర్గాలు చ‌ర్చించుకుంటాయి. పార్టీ ప‌రువు తీసేలా ఏ స్థాయి నాయ‌కులు ప్ర‌వ‌ర్తించినా చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని, క్ర‌మ‌శిక్ష‌ణే ముఖ్యం అంటూ చంద్ర‌బాబు హెచ్చ‌రించార‌ని చెబుతారు. ఈ తాటాకు చ‌ప్పుళ్లు ఓ నాలుగైదు రోజుల్లో చ‌ల్ల‌బ‌డిపోతాయి. ఇందుక భిన్నంగా ఏదైనా జ‌రిగితే.. ఆరోజే మెచ్చుకుందాం!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.