రాజీనామాల విష‌యంలో అడ్డంగా దొరికిపోయిన జ‌గ‌న్‌

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై ప్రతిప‌క్ష వైసీపీకి ఎంత చిత్తశుద్ధి ఉందో మ‌రోసారి స్పష్టమైంది. వాళ్ల రాజీనామా డ్రామా బ‌య‌ట‌ప‌డింది. ఇది కూడా ఎవ‌రో బ‌య‌ట‌పెట్టింది కాదు. ఆ పార్టీ నేత‌లే. జ‌గ‌న్ మ‌రో పెద్ద డ్రామాకు తెర‌తీశార‌ని ప్రజ‌లు అనుమానిస్తూనే ఉన్నారు. వాటిని నిజం చేసేలా ఉన్నాయి వైసీపీ నేత బొత్స స‌త్యనారాయ‌ణ వ్యాఖ్యలు. ఆయ‌నేమంటారంటే.. ఏప్రిల్ 6 త‌ర్వాత కూడా కేవ‌లం లోక్‌స‌భ ఎంపీలు మాత్రమే రాజీనామా చేస్తార‌ట‌. రాజ్యస‌భ ఎంపీగా ఉన్న విజ‌య‌సాయిరెడ్డి మాత్రం చేయ‌ర‌ట‌. దీనిని బ‌ట్టే మీకు ప‌రిస్థితి అర్థమై ఉంటుంది. అంద‌రూ విమ‌ర్శిస్తున్నట్లే.. ఏప్రిల్ 6 త‌ర్వాత ఎంపీలు రాజీనామా చేస్తే వాటి ఆమోదానికి రెండు నెల‌లైనా ప‌డుతుంది. ఆ త‌ర్వాత ఏడాదిలోపు ఉంది కాబ‌ట్టి ఎలాగూ ఉప ఎన్నిక‌లు రావు. ఇదే వ్యూహంతో జ‌గ‌న్ రాజీనామా అస్త్రాన్ని సంధించారు. ఎలాగూ ఆయ‌న చేస్తున్న ప్రత్యేక హోదా డిమాండ్‌ను కేంద్రం తీర్చడం అసాధ్యంగానే క‌నిపిస్తోంది. అన్నీ తెలిసీ ఆయ‌న రాజీనామా అంటున్నారంటే దీని వెనుక ఉన్న మ‌త‌ల‌బు అర్థం చేసుకోవాలి.

పోనీ లోక్‌స‌భ ఎంపీల‌తోపాటు విజ‌య‌సాయి రెడ్డి మాత్రం ఎందుకు రాజీనామా చేయ‌రు? ఎందుకంటే.. ఈ లోక్‌స‌భ ఎంపీల ప‌ద‌వీకాలం మ‌రో ఏడాది మాత్రమే. ఈలోపు ఎన్నిక‌ల హ‌డావిడి మొద‌లవుతుంది కాబ‌ట్టి వాళ్ల‌కు పెద్దగా న‌ష్టం లేదు. అదే విజ‌య‌సాయి రెడ్డి ప‌ద‌వీకాలం మాత్రం 2022 వ‌ర‌కు ఉంది. మ‌రి ఆయ‌న ఇప్పుడే రాజీనామా చేస్తే ఎలా? ఇదీ వైసీపీ నేత‌ల చిత్తశుద్ధి. ఏది ఏమైనా ప‌ద‌వులు మాత్రం కావాలి. బొత్స చెప్పిన ఈ సీక్రెట్‌తో టీడీపీ నేత‌ల‌కు మ‌రో అస్త్రం దొరికిన‌ట్లయింది. మేం చెబుతున్న‌దే నిజం.. చూశారా రాజీనామాలు ఉత్త డ్రామానే.. వారికస‌లు రాష్ట్ర ప్రయోజ‌నాల‌పై చిత్తుశుద్ధి లేద‌న్న ప్రచారాన్ని అప్పుడే టీడీపీ మొద‌లుపెట్టింది. అంటే జ‌గ‌న్ మ‌రో సెల్ఫ్ గోల్ చేసుకున్నట్లే క‌నిపిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.