తేజ కోసం త‌మిళ హీరో వెయిటింగ్

నేనే రాజు నేనే మంత్రి సినిమాతో మ‌ళ్లీ ఫామ్‌లోకి వ‌చ్చేశాడు తేజ‌. త‌న త‌ర‌హా ల‌వ్ స్టోరీల‌ను ప‌క్క‌న పెట్టి, ఓ పొలిటిక‌ల్ డ్రామాని వెండి తెర‌పై ఆవిష్క‌రించాడు. ఎప్పుడైతే త‌న జోన‌ర్‌ని వ‌దులుకొన్నాడో.. అప్పుడే తేజ‌కు హిట్ ఖాయం అయిపోయింది. చిన్న సినిమాగా విడుద‌లైనా, వ‌సూళ్ల‌లో త‌న రేంజ్ చూపించింది నేనే రాజు నేనే మంత్రి. ప్ర‌స్తుతానికి తేజ కొత్త సినిమా ఏం ఒప్పుకోలేదు. ఈ హ్యాంగోవ‌ర్‌లో సినిమా చేయ‌డం కంటే, కాస్త టైమ్ తీసుకొని క‌థ గురించి ఆలోచిద్దామ‌ని భావిస్తున్నాడు. అయితే ఈలోగా… చెన్నై నుంచి తేజ‌కు పిలుపొచ్చింది. ప్రముఖ క‌థానాయ‌కుడు కార్తి తేజ‌తో ప‌నిచేయ‌డానికి ఉత్సాహం చూపిస్తున్నాడ‌ట‌. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు కార్తి. నిర్మాత కూడా రెడీగా ఉన్నాడు. ఆ సినిమాని ఎవ‌రి చేతుల్లో పెడ‌దామా అని భావిస్తున్నాడ‌ట‌. తేజ‌తో సినిమా చేస్తే బాగుంటుంద‌ని కార్తి ఫీల్ అవుతున్నాడ‌ని టాలీవుడ్ టాక్‌. ఈ విష‌య‌మై తేజ‌తోనూ కార్తి సంప్ర‌దించాడ‌ట‌.

ఇటీవ‌ల కార్తి నేనే రాజు – నేనే మంత్రి తెలుగు వెర్ష‌న్ చూసిన‌ట్టు స‌మాచారం. అప్పుడే తేజ‌కు సినిమా కోసం క‌బురంపాడ‌ట‌. నేనే రాజు నేనే మంత్రి త‌మిళ వెర్ష‌న్ ఇంకా విడుద‌ల కాలేదు. ఆ సినిమా డ‌బ్బింగ్ వెర్ష‌న్ ఆపేసి.. అదే సినిమాకి త‌మిళ రాజ‌కీయాల‌కు అనుగుణంగా మార్చి తీద్దామ‌ని భావిస్తున్నాడ‌ట కార్తి. ఒక‌వేళ పొలిటిక‌ల్ బ్యాక్ గ్రౌండ్‌లో మ‌రో క‌థ చెబితే, దాన్ని తెర‌కెక్కించ‌డానికి కూడా రెడీ అంటున్నాడ‌ట‌. కార్తికి కావ‌ల్సింది పొలిటిక‌ల్ డ్రామా అంతే! తేజ నుంచి ఇంకా స్ప‌ష్ట‌మైన స‌మాచారం ఏదీ వెళ్ల‌లేద‌ని తెలుస్తోంది. నేనే రాజుని త‌మిళంలో రీమేక్ చేయ‌డానికి బ‌హుశా తేజ ఇష్ట‌ప‌డ‌క‌పోవొచ్చు. ఆ స్థానంలో కార్తి కోసం మ‌రో క‌థ సిద్దం చేసినా చేయొచ్చు. కార్తితో తేజ క‌మిట్ అవుతాడా, లేదా? అనేది ఇంకొద్ది రోజుల్లో తెలిసిపోతుంది. మొత్త‌మ్మీద ఒక సినిమాతో మ‌ళ్లీ.. హీరోల దృష్టిలో ప‌డ్డాడు తేజ‌. ఇది శుభ సూచ‌క‌మే క‌దా?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.