ఎడిటర్స్ కామెంట్ : బీవేర్ ఆఫ్ బీజేపీ !

” మీరు నాకు ఎదురొచ్చినా మీకే నష్టం.. నేను మీకు ఎదురొచ్చినా మీకే కష్టం ” అని ఓ సినిమాలో డైలాగ్ ఉంటుంది. దీన్ని రాజకీయాలకు అన్వయిస్తే.. పక్కాగా బీజేపీకి సరిపోతుంది. దేశంలో బీజేపీ ఎవరితో పెట్టుకోవాలనుకున్నా వారికి నష్టం.. బీజేపీతో ఎవరు పొత్తులు పెట్టుకోవాలనుకున్నా వారికే నష్టం. ఈ నష్టాన్ని భరించి .. పార్టీని కాపాడుకునే చాకచక్యం ఉన్న వారు సర్వైవ్ అయిపోతారు. లేదంటే.. శినసేన పార్టీలా కుయ్యో.. మొర్రో అంటూ ఉండాలి. నేషనల్ డెమెక్రాటిక్ అలయెన్స్ లో కొత్త పార్టీల కోసం.. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా కొత్తగా ప్రణాళికలు వేసుకుంటున్న సమయంలో మళ్లీ పాత మిత్రులందర్నీ దగ్గర తీసుకునేందుకు.. రెడీ అవుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇందులో టీడీపీ, అకాలీదళ్, జేడీఎస్ లాంటి పార్టీలు ఉన్నాయి. కొంత మంది పాత మిత్రులు రమ్మంటే కూడా రారు. మీకో దండం బాసూ అని దూరంగా పారిపోతూంటారు. తమను తాము కాపాడుకోవడానికి మధ్యలో బీజేపీకి గుడ్ బై చెప్పిన పార్టీలను మళ్లీ కొత్తగా ఆహ్వానిస్తున్నారు. ఇప్పుడు కొన్ని పార్టీలు .. వివిద కారణాలతో బీజేపీ పొత్తు అవసరం అనుకుంటున్నాయి. మరికొన్ని పార్టీలు తనకు అవసరం అని బీజేపీ అనుకుంటోంది. అందుకే ఇప్పుడు కొత్తగా మిత్రుల కోసం వేట ప్రారంభించింది. ఎంత వరకూ ఈ వేట సాగుతుంది.. ఎన్ని పార్టీల్ని బుట్టలో వేస్తుంది.. ఎన్ని పార్టీలు ఎన్డీఏలో చేరుతాయి.. అంతిమంగా అలా చేరిన పార్టీలు ఎన్ని సేఫ్ గా .. ఉనికి కాపాడుకుంటాయన్నది మాత్రం.. ఇప్పుడిప్పుడే చెప్పలేం.

ఎన్డీఏ.. వాజ్ పేయి హయాంలో వెలుగు వెలిగిన కూటమి !

నేషనల్ డెమెక్రటిక్ అలయెన్స్ అంటే ఎన్డీఏ. ఈ కూటమే ఇప్పుడు దేశాన్ని పరిపాలిస్తోంది. కానీ ఎప్పుడూ అలా చెప్పుకోరు. కనీసం బీజేపీ ప్రభుత్వం అని కూడా చెప్పుకోరు. కేవలం నరేంద్రమోదీ ప్రభుత్వం అని చెప్పుకుంటారు. దేశంలో తిరుగులేని జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ ప్రభ క్రమంగా మసకబారిపోయిన తర్వాత సంకీర్ణ రాజకీయాల శకం వచ్ంది. 90ల్లో కూటముల రాజకీయాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో ప్రస్తుతం కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ, బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ ఏర్పాటయ్యాయి. నడుస్తోంది సంకీర్ణ ప్రభుత్వమే కానీ.. బీజేపీకి గత రెండు విడతలుగా సంపూర్ణ మెజార్టీ రావడంతో ఇతర పార్టీల పేర్లు వినిపించవు, కనిపించవు. ఎందుకంటే.. ఇప్పడు ఉన్నవన్నీ కూటమిలో ఉనికి లేని పార్టీలే. ఉన్న బలమైన పార్టీలన్నింటినీ బీజేపీ నిర్వీర్యం చేయడమో.. నిర్వీర్యం చేస్తారని భయపడి బయటకు వెళ్లిపోవడమో జరిగాయి. అందుకే ఎన్డీఏలో పార్టీల సంఖ్య కూడా తగ్గిపోతూ వస్తోంది. ఒకప్పుడు ఎన్డీఏలో బీజేపీ తర్వాత ఆ పార్టీతో సుదీర్ఘ అనుబంధం ఉన్న పార్టీలు ఎన్డీఏలో ఉండేవి. పంజాబ్‌లో అకాలీదళ్, మహారాష్ట్రలో శివసేన, అన్నాడీఎంకే, లోక్ జనశక్తి , 2014లో టీడీపీ కూడా ఉండేది. అయితే ఇప్పుడు బీజేపీతో జట్టులో ఉన్న ఇతర పార్టీలు ఏవీ ఆ పార్టీతో సుదీర్ఘంగా నడుస్తున్నవి కావు. బలం ఉన్నవి కావు. ప్రస్తతం ఎన్డీఏలో బీజేపీ తర్వాత ఉన్న పార్టీ ఏది అంటే.. శివసేన చీలిక గ్రూపు మాత్రమే. పన్నెండు మంది శివసేన ఎంపీలు విడిగా ఏర్పడి ఎన్డీఏలో భాగమయ్యారు. దాదాపుగా పాతికేళ్ల పాటు బీజేపీకి నమ్మకమైన మిత్రపక్షంగా ఉన్న శివసేన ఇప్పుడు బీజేపీ ధాటికి కకావికలం అయిపోయింది. ఉనికి సమస్యలో పడింది. శివసేన మాత్రమే కాదు.. అకాలీదళ్‌దీ అదే పరిస్థితి. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఎన్డీఏకు గుడ్ బై చెప్పింది. కానీ ఆ పార్టీ మెరుగుపడలేదు. అన్నాడీఎంకే కూడా బీజేపీ రాజకీయ చదరంగంలో చిక్కుకుని విలవిల్లాడుతోంది. ఇక రాంవిలాస్ పాశ్వాన్ చనిపోయాక.. ఆయన పార్టీ లోక్ జనశక్తి చిన్నాభిన్నమైంది. ఆయన కుమారుడ్ని.. బాబాయ్‌ను విడదీసి..బాబాయ్‌ను బీజేపీ అక్కున చేర్చుకుంది. ఇప్పుడా పార్టీకి ఉనికి కష్టంగామారింది. తాజాగా జేడీయూ పరిస్థితి కూడా అదే. బీహార్‌లో జేడీయూ ఒకప్పుడు మేజర్ పార్టీ. బీజేపీ పొత్తు పెట్టుకుని కొన్ని సీట్లు తీసుకునేది. ఇప్పుడు జేడీయూ అల్ప స్థానానికి పడిపోయింది. చివరికి .. అసలు పార్టీని మోదీ , షాలు మింగేస్తారని తెలిసి.. కూటమికి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ , జేడీయూతో కలిసింది. విడిపోయినా ఆ పార్టీకి బీజేపీ నుంచి ముప్పు ఉండనే ఉంటుంది.

మిత్రుల్ని మింగేయడం బీజేపీ వీక్ నెస్ !

ఇప్పటి వరకూ ముఖ్యంగా బీజేపీ అమిత్ షా , నరేంద్రమోదీ చేతుల్లోకి వచ్చిన తర్వాత మిత్రుల్ని అమాంతం మింగేయడం ఓ లక్షణంగా పెట్టుకున్నారు. ఆ పార్టీతో స్నేహంగా ఉన్న ప్రతీ పార్టీని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నించింది. ఆ పార్టీ నేతల రాజకీయం పట్ల అవగాహన ఉన్న వారు తప్పించుకున్నంత వరకూ తప్పించుకుని బతుకుజీవుడా అంటూ బయటపడ్డారు. తప్పించుకోలేని వారు శివసేనలా చితికిపోయారు. ఇప్పుడు బీజేపీకి మళ్లీ మిత్రపక్షాల అవసరం వచ్చింది. అందుకే కొత్త మిత్రుల కోసం వెదకడం ప్రారంభించారు. రాజకీయాల్లో రాజకీయ పార్టీల పొత్తుల ప్రాతిపదిక ఒక్కటే. కలిస్తే ఎంత లాభం అనేదే. బీజేపీ అయినా.. మరో పార్టీతో అయినా ఇతర పార్టలు పొత్తులు పెట్టుకోవాలంటే తమకు ఎంత కలసి వస్తుందనే లెక్కలు వేసుకుంటాయి. ఆ పార్టీలన్నీ పాత ట్రాక్ రికార్డులపై పెద్దగా దృష్టి పెట్టవు. రాజకీయాల్లో చరిత్రను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత కాలంలో నిర్ణయాలు తీసుకోరు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పొత్తులు ఎంత అవసరమో అన్నదే లెక్కలేసుకుంటారు. ఆ ప్రకారమే బీజేపీకి ఇప్పుడు కొత్త మిత్రుల అవసరం చాలా ఉంది. అలాగే బీజేపీ అవసరం ఉన్న పార్టీలు ఎన్ని అన్నదే కీలకం. ఇలాంటి పార్టీలు ఎన్ని ఉంటే.. అన్ని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలో చేరుతాయి. అలాంటి పార్టీలు ఎన్ని అన్నది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. 2024 లోక్‌సభ ఎన్నికలలోపు బీజేపీకి వ్యతిరేకంగా బలమైన కూటమిని ఏర్పాటు చేసుకోవాలని విపక్ష పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. అదే సమయంలో ఎన్‌డిఎలో తాజా శక్తిని నింపేందుకు బిజెపి కొత్త పొత్తులు పెట్టుకోవాలని చూస్తోంది. బీజేపీకి ప్రస్తుతం పూర్తి మెజార్టీ ఉంది. కానీ రాజకీయాల్లో ఎల్లప్పుడూ ఒకేరకమైన బలం ఉండదని అందరికీ తెలుసు. ఒక వేళ తమకు ఊహించని బలం వస్తుందని అధికారంలో ఉన్న వారు అనుకుంటే అది అహంకారమే అవుతుంది. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలు రాజకీయాల్లో ఢక్కామొక్కీలు తిన్నారు. అందుకే వచ్చే ఎన్నికల నాటి పరిస్థితుల్ని గుర్తించి.. మిత్రపక్షాలతో తమ బలగాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

మిత్రుల అండ లేకపోతే గండమే అనుకుంటున్న మోదీ షా !

2024 సార్వత్రిక ఎన్నికలలో కూడా విజయ ఢంకా మోగించాలన్న మోదీ ప్రయత్నాలకు చాలా సవాళ్లు ఎదురవుతున్నాయి. సుదీర్ఘ కాలం అధికారంలో ఉండటంతో ప్రభుత్వ వ్యతిరేకత అనేది చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఈ ఏడాది ఆఖరులోగా శాసనసభ ఎన్నికలు జరగవలసి ఉన్న రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌ గఢ్‌, తెలంగాణల్లో ఒక్క రాజస్థాన్‌లో మినహా ఎక్కడా పరిస్థితులు అనుకూలంగా లేవన్న అభిప్రాయం వినిపిస్తోంది. సామాన్యుల బతుకు భారమై పోవడం, నిరుద్యోగం అదీ యువతలో విపరీతమైన ఆగ్రహంగా మారుతూండటం.. జీవన వ్యయం పెరగడం బీజేపీకి ప్రతికూలంగా మారుతోంది. వంద శాతం ఫలితాలు సాధించిన హిందీ రాష్ట్రాల్లో బీజేపీ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. ఉత్తరప్రదేశ్‌లో అధికారం నిలబెట్టుకోగలిగినా 2014లో వ్యక్తమైన మద్దతు ఇప్పుడు మళ్లీ ఉంటుందని ఎవరూ చెప్పలేకపోతున్నారు. 2014 ఎన్నికలలో బీజేపీ ఉత్తరప్రదేశ్‌ లోని మొత్తం 80 లోకసభ స్థానాలలో 71 సాధించింది. బీజేపీ మిత్రపక్షమైన అప్నా దళ్‌ రెండు లోకసభ స్థానాలలో విజయం సాధించింది. ఉత్తరప్రదేశ్‌లో 2019లో బీజేపీ కేవలం 62 సీట్లకు పరిమితం అయింది. ఈ సారి ఆ సంఖ్య ఇంకా తగ్గుతుందనే అంచనాలు ఉన్నాయి. తగ్గిపోతున్న సీట్లన్నింటినీ భర్తీ చేసుకోవాలంటే.. బీజేపీకి ఉన్న ఒకే ఒక్క మార్గం మిత్రపక్షాలను సాధించుకోవడం. ఇప్పటికి అయితే ఎన్‌డీఏలో లో భాగస్వామ్యం లేని ఆంధ్ర ప్రదేశ్‌ లోని వై.ఎస్‌.ఆర్‌. సి.పి, ఒడిశాలోని బిజూ జనతా దళ్‌ , తెలంగాణలోని బి.ఆర్‌.ఎస్‌. బీజేపీకి దగ్గరగా ఉంటున్నారు. కానీ ఈ మూడు పార్టీలు ఎన్డీఏ కూటమిలో చేరడానికి మాత్రం సిద్దంగా లేవు. బిజూ జనతాదళ్ కేంద్రంలో ఎవరు ఉంటే వారికి మద్దతు ఇస్తుంది. వారు రాష్ట్ర ప్రయోజనాలే చూసుకుంటారు. వైఎస్ఆర్‌సీపీకి బీజేపీతో పొత్తు అంటే.. కోర్ ఓటు బ్యాంక్ ను దూరం చేసుకుని రాజకీయంగా ఆత్మహత్య చేసుకోవడమే. ఇక బీఆర్ఎస్ .. బీజేపీతో పొత్తు అనే ఆలోచనే చేయదు. ఇక సుదీర్గ కలంగా ఉన్న మిత్రుల్ని బీజేపీ ఇప్పటికే చంపేసే ప్రయత్నం చేయడంతో వారెవరూ మళ్లీ పంచన చేరుతారని అనుకునే అవకాశం ఉంది. దశాబ్దాల పాటు పాటు కలసి ఉన్న శివసేనను.. నిర్వీర్యం చేసే ప్రయత్నం చేశారు. అసలైన శివసేనను తాము సృష్టించిన నాయకుడు షిండే చేతిలో పెట్టారు. కానీ ఆయన శివసేనను ప్రజలు గుర్తించడం లేదు. ఉద్దవ్ థాక్రే శివసేనకే గుర్తింపుల భిస్తోంది. దీంతో మహారాష్ట్రలో బీజేపీ గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటోంది. అక్కడ మిత్రులెవరూ కొత్తగా లభించే అవకాశాలు లేవు.

బీజేపీ పంజా నుంచి బయటపడిన పాత మిత్రులకు వల !

ఒకప్పుడు ఎన్‌.డి.ఏ. భాగస్వామ్యం ఉన్న తెలుగు దేశం, పంజాబ్‌లోని అకాలీ దళ్‌ లాంటి పార్టీలను మళ్లీ ఎన్‌.డి.ఏ. లో భాగం చేయాలని బీజేపీ అగ్రనాయకత్వం ప్రయత్నిస్తోంది. పాత మిత్రులు పోతే కొత్త మిత్రులతో భర్తీకి యత్నం మోడీ అమిత్‌షాల ద్వయం చేస్తోంది. తద్వారా తగ్గిందనుకుంటున్న కూటమి బలం యాదాతధంగానే వుందనిచూపించుకునే యోచనలో ఉంది కమలం పార్టీ. తెలుగుదేశం పార్టీకి మా తలుపులు శాశ్వతంగా మూసుకుపోయాయని చెప్పిన అమిత్‌షా స్వయంగా టీడీపీ అధ్యక్షడు చంద్రబాబుతో సమావేశం కావడం, ఆ సమావేశంలో పార్టీ జాతీయ అధ్యక్షలు జేపీ నడ్డాకూడా పాలు పంచుకోవండం చూస్తే పరిణామాలు కొత్త సమీకరణాలకు సంకేతాలని ఎవరైనా ఇట్టే చెప్పేయొచ్చు. 2018కి పూర్వం ఎన్డీయేలో భాగస్వామిగా వున్న చంద్రబాబు పార్టీని తిరిగి చేర్చుకుంటే ఖచ్చితంగా అది జాతీయ స్ధాయిలో బీజేపీకి కలిసివచ్చే అxశమే అంటున్నారు. కానీ టీడీపీకి ఎంత వరకూ కలిసి వస్తుందన్నది సందేహం. బీజేపీకి కనీస ఓటు బ్యాంక్ లేదు. ఆ పార్టీతో పొత్త వల్ల ప్రయోజనమే ఉండదు. ఉంటే గింటే.. జగన్ చేసే అక్రమాలను అడ్డుకోవాలి. అలా అడ్డుకుంటుందన్న నమ్మకం .. టీడీపీ క్యాడర్‌కు లేదు. రాష్ట్రాన్ని జగన్ నాశనం చేస్తూంటే.. చూస్తూ ఉన్నారు కానీ..కనీసం స్పందించలేదన్న ఆగ్రహంతో ఉన్నారు. అదే సమయంలో బీజేపీతో పొత్తులు పెట్టుకుంటే చంద్రబాబు తన పార్టీని కాపాడుకోవడానికి.. బీజేపీ విష కౌగిలిలో ఇరుక్కుపోకుండా చూసుకోవడానికి చాలా కష్టపడాల్సి ఉంది.

ముందుగా చెప్పుకున్నట్లుగా బీజేపీతో పెట్టుకున్న వారికి.. పెట్టుకోని వారికీ ముప్పే. ఖచ్చితంగా బీజేపీతో కలవాల్సి వస్తే.. పార్టీని కాపాడుకోవడానికి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close