టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌కు కేసుల మాఫీ హామీ..

హామీలు అంటే ఇప్ప‌టికే విలువ లేకుండా పోయింది. ఎన్నిక‌ల్లో గెలుపు కోసం ప్ర‌జ‌ల‌కు ఇష్టానుసారం హామీలు ఇచ్చేయ‌డం దాదాపు అంద‌రికీ అల‌వాటైపోయింది. ఎన్నిక‌లు వ‌స్తున్నాయంటే పార్టీల దృష్టంతా కార్య‌క‌ర్త‌ల మీదే ఉంటుంది. ఎందుకంటే, స్థానికంగా ప‌నిచేయాల్సి వారే క‌దా. అందుకే, వారి సంక్షేమం కోసం ఆలోచించ‌డం మొద‌లుపెడ‌తారు. వారికిపై వ‌రాల జ‌ల్లుల్ని కురిపిస్తారు. ఇప్పుడు నంద్యాల ఉప ఎన్నిక‌ల హీట్ బాగా ఉంది. ఈ ఎన్నిక‌ల్లో ఎలాగైనా గెలిచి తీరాల‌న్న‌ది తెలుగుదేశం పార్టీ పట్టుద‌ల‌. ఈ క్ర‌మంలో కార్యాక‌ర్త‌ల‌కు ఉదారంగా కొన్ని హామీలు ఇచ్చేస్తున్నారు జిల్లా నేత‌లు! పార్టీ కోసం క‌ష్ట‌ప‌డి ప‌నిచేసేవారికి గుర్తింపు ఉంటుందని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఎప్ప‌టిక‌ప్పుడు చెబుతూ ఉంటారు. అదే స్ఫూర్తిని పుణికి పుచ్చుకుని జిల్లా పార్టీ అధ్య‌క్షుడు సోమిరెడ్డి వెంక‌టేశ్వ‌ర్లు కార్య‌ర్త‌ల‌కు ఉదారంగా కొన్ని హామీలు ఇచ్చేశారు.

కార్య‌క‌ర్త‌ల‌తో స‌మావేశం సంద‌ర్భంగా వెంక‌టేశ్వ‌ర్లు మాట్లాడారు. త్వ‌ర‌లోనే మంత్రి నారా లోకేష్ నంద్యాల‌కి వ‌స్తున్నార‌నీ, చాలాసేపు ఇక్క‌డే ఉంటారనీ, కార్య‌ర్త‌లంద‌రితోనూ స్వ‌యంగా మాట్లాడ‌తార‌నీ, ఈ సంద‌ర్భంగా క‌ష్టాలు ఏవైనా ఉంటే వారి దృష్టికి తీసుకెళ్లొచ్చ‌ని కార్య‌క‌ర్త‌ల‌కు ఒక ఆఫర్ ఇచ్చారు. ఇంకో బంప‌ర్ ఆఫ‌ర్ ఏంటంటే… రౌడీ షీట్లు ఉన్నాయ‌ని భ‌య‌ప‌డాల్సిన ప‌నిలేద‌నీ, వాటి గురించి టెన్ష‌న్ ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌నీ, రౌడీ షీట్ల సంగ‌తి ఇప్ప‌టికే ముఖ్య‌మంత్రి దృష్టికి తీసుకెళ్ల‌డం జ‌రిగింద‌నీ సోమిరెడ్డి వెంక‌టేశ్వ‌ర్లు హామీ ఇచ్చారు.

నిజానికి, తెలుగుదేశం అధికారంలోకి వ‌చ్చాక సొంత పార్టీకి చెందిన కొంత‌మంది నాయ‌కుల‌పై ఉన్న కేసుల్ని ఎత్తివేస్తూ జీవోలు ఇచ్చిన సంద‌ర్భాలు గ‌తంలో ఉన్నాయి. నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా బ‌హిరంగ స‌భ నిర్వ‌హించినందుకు బాల‌కృష్ణ‌, కోడెల శివ‌ప్ర‌సాద‌రావు, ఆయ‌న కుమారుడితో స‌హా ఓ ప‌దిహేను మందిపై 2009లో న‌ర‌స‌రావు పేట‌లో పోలీస్ కేసు న‌మోదైంది. గ‌త ఏడాది ద్వితీయార్థంలో ఈ కేసుల్లో వీరిపై ప్రాసిక్యూష‌న్ వెన‌క్కి తీసుకోవాలంటూ డీజీపీ ఆదేశాలు జారీ చేసిన సంగ‌తి ఈ సంద‌ర్భంగా గుర్తు చేసుకోవాలి! తెలుగుదేశంలోకి చేరిన త‌రువాత త‌న‌పై ఉన్న కేసుల విముక్తి కోసం భూమా నాగిరెడ్డి కూడా ప్ర‌య‌త్నించారు. ఇప్పుడు ఏకంగా జిల్లా స్థాయిల్లో కార్య‌క‌ర్త‌ల‌కు కేసుల మాఫీ అంటూ హామీలు ఇచ్చేస్తున్నారు.

అక్క‌డితో ఆగినందుకు సంతోషించాలి. అత్యాచారం కేసులున్నా, హ‌త్యా నేరాల కేసులున్నా మాఫీ చేసేస్తామ‌ని ఫ్లోలో మ‌రింత ముందుకెళ్లిపోలేదు! పార్టీ కోసం ప‌నిచేస్తే రౌడీ షీట్లు ఎత్తేస్తామ‌ని హామీలు ఇవ్వ‌డాన్ని ఏమ‌నుకోవాలి..? ఏం చేసినా చెల్లుతుంద‌నే బ‌రితెగింపునకు నిద‌ర్శ‌నంగా చూడాలి. ఓట్లు కోసం, గెలుపు కోసం ఏం చేసినా ఫర్వాలేద‌నే స్థాయికి రాజ‌కీయాలు దిగ‌జారిపోయాయని మ‌రోసారి నిరూపితం అవుతున్నందుకు చింతించాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.