ఈ దర్శకులతో బడా హీరోలకి సమస్య ఏమిటో ?!

కధల విషయంలో పెద్ద హీరోల ఆలోచన ధోరణి మారిందేమో కానీ దర్శకులకు అవకాశాలు ఇచ్చే విషయంలో మాత్రం మన బడా హీరోలు ఇంకా వెనకడుగు వేస్తున్నారు. మంచి దర్శకులు, జెన్యూన్ సినిమాలు తీయగల దర్శకులు అని పేరు తెచ్చుకున్న దర్శకులకు మాత్రం పెద్ద హీరోల నుండి ఇంకా పిలుపు రావడం లేదు. దీంతో మంచి దర్శకులు అని పేరు తెచ్చుకున్నవాళ్ళంత కేవలం దర్శకులుగా మిగిలిపోతున్నారు తప్పితే స్టార్ దర్శకులు కావడం లేదు. టాలీవుడ్ లో ఈ లిస్టు పరిశీలిస్తే.. చంద్రశేఖర్ యేలేటి, శేఖర్ కమ్ముల, ఇంద్ర గంటి, అవసరాల శ్రీనివాస్, అంతకుముందు నీలకంఠ.. ఇలా పెద్ద జాబితానే ఉటుంది. వీళ్ళంత మంచి దర్శకులుగా పేరు తెచ్చుకున్నారు. ప్రేక్షకుడికి ఒక కొత్తదనం అధించిన దర్శకులుగా గుర్తుంపు తెచ్చుకున్నారు. అయితే వీళ్ళకు స్టార్ హీరో తోడైతే వీళ్ళనుండి మరింత మంచి స్టఫ్ వచ్చే అవకాశం వుంది. కానీ బడా హీరోలు మాత్రం వీళ్ళకు సినిమా ఇవ్వాలంటే రిస్క్ గా ఫీల్ అవుతున్నారు.

చంద్రశేఖర్ యేలేటి విషయానికే వద్దాం.. తన తొలి సినిమా ‘ఐతే’తోనే గొప్ప టెక్నిక్ వున్న దర్శకుడు అనిపించుకున్నాడు. తర్వాత ఆయన తీసిన చాలా ప్రయోగాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఆయన కూడా బడా హీరోలకు కధలు చెప్పాడు. కాని ఎవరూ ముందుకురాలేదు. దీంతో ఆయన స్టార్ దర్శకుడి జాబితాలోకి వెళ్ళే అవకాశం ఇంకా రాలేదు. గోపిచంద్ దగ్గరే ఆగిపోయాడాయన. శేఖర్ కమ్ముల పరిస్థితి కూడా ఇదే. కెరీర్ బిగినింగ్ లోనే ఆనంద్, గోదావరి, హ్యాపీ డేస్ లాంటి బ్లాక్ బస్టర్స్ అందించాడు శేఖర్. ఆయన కూడా బడా హీరోలతో సినిమాలు చేయాలనీ ప్లాన్ చేశాడు. కాని అటు నుండి సరైన రెస్పాన్స్ రాలేదు. మహేష్ బాబు కోసం చాల ప్రయత్నించాడాయన. కాని వర్క్ అవుట్ కాలేదు. ఇప్పటివరకూ వరుణ్ తేజే ఆయన స్టార్ హీరో. ఇక ఇంద్ర గంటి కూడా టెక్నికల్ గా మంచి సౌండ్ వున్న దర్శకుడు. ఆయన ఈజీగా ఒక స్టార్ హీరోని డీల్ చేయగలడు. కొంతమందిని కలసి కధలు కూడా వినిపించాడు. కాని లాభం లేదు. మన హీరోలకు ఎక్కడో చిన్న జంకు. అవసరాల శ్రీనివాస్ పరిస్థితి కూడా ఇదే. ఊహలు గుసగుసలాడే సినిమాతో తన దర్శకత్వ ప్రతిభను చాటాడు. జో అచ్చుతానంద తో మరో హిట్ కొట్టాడు. తర్వాత ఒక పెద్ద హీరోని ప్రయత్నించాడు. కానీ ఆయన అవసరాలతో సినిమా అంటే రిస్క్ లా ఫీలయ్యాడు. దీంతో కొత్త సినిమా కోసం మళ్ళీ మీడియం హీరోతోనే జతకడుతున్నాడు అవసరాల.

ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లోనే ఎక్కువగా కనిపిస్తుంది. కోలీవుడ్ నే తీసుకోండి… రజనీకాంత్, పా రంజిత్ లాంటి దర్శకులతో సినిమాలు చేస్తున్నాడు. ఆయన కొత్త సినిమా కూడా పిజ్జా ఫేం కార్తీక్ సుబ్బరాజ్ లాంటి యువ దర్శకుడితోనే. ‘ఒక రాజు ఒక రాణి ‘తో క్లాస్ సినిమా తీసిన అట్లీకి రెండో సినిమాకే అవకాశం ఇచ్చాడు విజయ్. ఇప్పుడు అట్లీ కూడా అక్కడ స్టార్ డైరెక్టర్. స్టార్ డైరెక్టర్ అవ్వాలంటే విషయం వున్న దర్శకులకు బడా స్టార్లు అవకాశం ఇవ్వాలి. అప్పుడే వారి నుండి మరిన్ని మంచి సినిమాలు వస్తాయి. కాని టాలీవుడ్ లో మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఎంతసేపు స్టార్ డైరెక్టర్లు చుట్టూ తిరగడం తప్పితే.. మంచి దర్శకుడిని స్టార్ దర్షకుడిగా చేయాలనే ఆలోచన మన బడా హీరోల్లో కనిపించడం లేదు. స్టార్ హీరోలు కూడా దర్శకుడి మార్కెట్ పైనే ఎక్కువ ద్రుష్టిపెడుతున్నారు. అయితే ఈ ఆలోచనలో మంచి దర్శకులు అని పేరుతెచ్చుకున్న దర్షకులతో గనుక బడా హీరోలు సినిమాలు చేస్తే ఖచ్చితంగా ఓ కొత్తరకం సినిమాలు చూడొచ్చు. అలాగే ఇండస్ట్రీకి మరింత మంది స్టార్ దర్శకులు దొరికే అవకాశం వుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.