టి. కాంగ్రెస్ ఎంపీ అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న ఈసారి త్వ‌ర‌గానే..!

ప్ర‌జాస్వామ్యంలో గెలుపు ఓట‌ములు స‌ర్వ‌సాధార‌ణ‌మైన విష‌యాల‌నీ, దీన్ని అధిగ‌మించి తెలంగాణ‌లో అత్య‌ధిక పార్ల‌మెంటు స్థానాల్లో గెల‌వ‌డానికి సిద్ధ‌మౌతున్నామ‌న్నారు టీపీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి. పార్టీ ముఖ్యుల‌తో అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ స‌మావేశం నిర్వ‌హించి, దిశా నిర్దేశం చేశార‌ని ఉత్త‌మ్ చెప్పారు. దానికి అనుగుణంగా, తెలంగాణ‌లో మొత్తం 33 జిల్లాల‌కి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్య‌క్షుల‌ను వారంలోపుగా నియ‌మించాల‌ని హైక‌మాండ్ నుంచి ఆదేశాలు వ‌చ్చాయ‌న్నారు. గ‌డ‌చిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్ తో పోటీ చేసి గెలిచిన‌వారు, ఓడిన‌వారు… అంద‌రూ వారివారి అసెంబ్లీ నియోజ‌క వ‌ర్గాల ఇన్ ఛార్జ్ లుగా పూర్తి బాధ్య‌త‌లు ఇవ్వ‌డం జ‌రుగుతుంద‌న్నారు. స‌ర్పంచ్ ఎన్నిక‌లు, లోక్ స‌భ ఎన్నిక‌ల్లో వీరే పార్టీ బాధ్య‌త‌లు తీసుకోవాల్సి ఉంటుంద‌న్నారు.

లోక్ స‌భ ఎన్నిక‌ల గురించి ఆయ‌న మాట్లాడుతూ… పొత్తుల విష‌య‌మై రాహుల్ స‌మ‌క్షంలో ఇంకా ఎలాంటి చ‌ర్చ‌లూ జ‌ర‌గ‌లేద‌ని ఉత్త‌మ్ స్ప‌ష్టం చేశారు. అంతేకాదు, ఎంపీ అభ్య‌ర్థుల ఎంపిక‌కు సంబంధించి రివ్యూ మీటింగులు మొద‌లుకొని అభిప్రాయ సేక‌ర‌ణ మొద‌లుపెట్టాలంటూ ఏఐసీసీ సూచించింద‌న్నారు. ఎంపీలుగా పోటీ చేసేందుకు ఎవ‌రెవ‌రు ఆస‌క్తిగా ఉన్నారో, ఎవ‌రు ముందుకొస్తున్నారో అనేది కూడా చూసుకోవాల‌ని పార్టీ అధిష్టానం సూచించిన‌ట్టుగా ఉత్త‌మ్ చెప్పారు. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓడిపోయినంత మాత్రాన‌… లోక్ స‌భ ఎన్నిక‌ల‌కు సిద్ధ‌మ‌య్యే అభ్య‌ర్థుల‌పై దాని ప్ర‌భావం ఉంటుందనుకోవడం సరికాదంటూ ధీమా వ్య‌క్తం చేశారు ఉత్త‌మ్‌.

లోక్ స‌భ ఎన్నిక‌ల‌కు ఎంపీ అభ్య‌ర్థుల‌ను వీలైనంత త్వ‌ర‌గా ప్ర‌క‌టించాల‌నే ఉద్దేశంతోనే కాంగ్రెస్ ఉన్న‌ట్టుగా స్ప‌ష్టంగా తెలుస్తోంది. నిజానికి, గ‌డ‌చిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అభ్య‌ర్థుల ఎంపిక ప్ర‌క్రియ చివ‌రివ‌ర‌కూ కొన‌సాగింది. దాని వ‌ల్లే ప్ర‌చారానికి కూడా స‌రైన స‌మ‌యం కాంగ్రెస్ కి లేకుండా పోయింది. ఇంకోటి… అభ్య‌ర్థుల‌ను వీలైనంత త్వ‌ర‌గా ప్ర‌క‌టించ‌క‌పోతే, క్షేత్ర‌స్థాయిలో పార్టీ ప్ర‌చార బాధ్య‌తలు ఎవ్వ‌రూ స్వ‌చ్ఛందంగా తీసుకునే ప‌రిస్థితి ఉండ‌దు క‌దా! అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓట‌మికి అభ్య‌ర్థుల ఎంపిక‌లో ఆల‌స్యం అనేది కూడా ప్ర‌ధాన కార‌ణంగా చాలా విశ్లేష‌ణ‌లు వచ్చాయి. ఆ అనుభ‌వాన్ని దృష్టిలో పెట్టుకుని, ఇప్ప‌ట్నుంచే ఎంపీ అభ్య‌ర్థుల ఎంపిక‌ను టి. కాంగ్రెస్ ప్రారంభిస్తోంది. అయితే, ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఇదొక్క‌టే స‌రిపోదు. దీంతోపాటు, ఓట‌మితో డీలాప‌డున్న పార్టీ కేడ‌ర్ లో కొత్త ఉత్సాహం నింప‌డం పార్టీ ముందున్న పెద్ద సవాల్‌. దాన్ని కాంగ్రెస్ ఎలా ఎదుర్కొంటుంది అనేది వేచి చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.