వేసవి సినిమాల జాతర: థియేటర్ల దగ్గర దబిడి దిబిడే!

అసలైన సిసలైన వేసవి సినిమాల జాతర ‘రంగస్థలం’తో మొదలవుతోంది. దీని తరవాత థియేటర్లలోకి వారానికి ఒక సినిమా లేదా వీలయితే రెండు సినిమాలను నిర్మాతలు తీసుకొస్తున్నారు. ‘రంగస్థలం’ తరవాత భారీ సిన్మా అంటే మహేశ్‌బాబు ‘భరత్ అనే నేను’యే. మధ్యలో ఏప్రిల్ 5న నితిన్ ‘చల్ మోహన్ రంగ’, 6న మంచు విష్ణు ‘ఆచారి అమెరికా యాత్ర’ వస్తున్నాయి. ‘రంగస్థలం’ వచ్చిన తరవాత వారమే విడుదలకు సిద్ధమయ్యాయి. అయితే… వీటి ప్రభావం ‘రంగస్థలం’ మీద వుండదని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఈ రెండిటి వల్ల ‘రంగస్థలం’కు వచ్చే ముప్పేమీ వుండదని, వారం తరవాత ఆ సినిమాకు చాలినన్ని థియేటర్లు వుంటాయని లెక్కలు కడుతున్నారు. ఇక్కడి వరకు ఎలాంటి సమస్యల్లేవ్.

నానితో అసలు దడ మొదలు..

ఏప్రిల్ 12న ‘కృష్ణార్జున యుద్ధం’ వస్తోంది. అసలే ఈ మధ్య నాని సూపర్ ఫామ్‌లో వున్నాడు. రొటీన్ సినిమా చేసినా సూపర్ హిట్టవుతోంది. అతడికి తోడు కామెడీ మీద పట్టున్న మేర్లపాక గాంధీ ‘కృష్ణార్జున యుద్ధం’కు దర్శకుడు. ప్రేక్షకులకు సినిమా నచ్చితే… థియేటర్లలో నుంచి తీయడానికి డిస్ట్రిబ్యూటర్ల మనసు ఒప్పుకోదు. అయితే… నాని వచ్చిన ఎనిమిది రోజులకు మహేశ్ ‘భరత్ అనే నేను’ వస్తుంది. ‘శ్రీమంతుడు’ హిట్ తరవాత మహేశ్, కొరటాల కాంబినేషన్లో సినిమా కనుక సినిమాకు క్రేజ్ బాగుంది. కానీ, అప్పటికి కొన్ని థియేటర్లలో ‘రంగస్థలం’, ‘కృష్ణార్జున యుద్ధం’ వుంటాయి.రెండూ హిట్టయితే కూసిన్ని ఎక్కువ థియేటర్లలో వుంటాయి. అందువల్ల, మ‌హేశ్‌కి చాలినన్ని థియేటర్లు దొరుకుతాయా? లేదా? అనేది డౌట్. విడుదల తేదీ విషయంలో ఇగోలకు పోవడం వల్ల ఎంత రచ్చ జరిగిందో అందరూ చూశారు. ఏప్రిల్ 27న అనుకున్న సినిమా ముందుకు రావడం వల్ల వచ్చే తలనొప్పి ఇది. ఈ సినిమా వరకు కొంచెం సమ్మర్ హీట్ వుంటుంది.

రజనీ రానట్టే… ఇదే మనోళ్లకు ప్లస్…

ఏప్రిల్ 27 విడుదల తేదీ కోసం మహేశ్, అల్లు అర్జున్ సినిమాలు కొట్టుకుంటున్న సమయంలో అనూహ్యంగా రజనీకాంత్ ‘కాలా’ వచ్చింది. మహేశ్ ఏప్రిల్ 20కి, అల్లు అర్జున్ మే4కి తమ సినిమా విడుదల తేదీలను మార్చడానికి ‘కాలా’ కూడా ఓ కారణంగా చెప్పుకోవచ్చు. అయితే… ఇప్పుడీ సినిమా వచ్చే ఛాన్సులు కనిపించడం లేదు. తమిళ సినిమా ఇండస్ట్రీ చేస్తోన్న స్ట్రైక్ ‘కాలా’కు బ్రేకులు వేసింది. ఆ సమయానికి స్ట్రైక్ మానేసినా… మార్చి1 తరవాత విడుదలకు సిద్ధమైన సినిమాల షెడ్యూళ్లను అనుసరించాలని తమిళ ఇండస్ట్రీ నిర్ణయం తీసుకుంది. ఆ ఆర్డర్ ప్రకారం రజనీ సినిమా విడుదల ఆలస్యమవుతుంది. ఇది ఒక్కటే మన తెలుగు సినిమాలకు లాభించే అంశం. ‘రంగస్థలం’, ‘కృష్ణార్జున యుద్ధం’ ఎన్ని థియేటర్లలో వున్నా… రెండు వరాలు మహేశ్ సినిమాకి దొరికితే చాలు.

మేలో అల్లు అర్జున్, మహానటి, పూరి మెహబూబా

అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ మే 4న విడుదలకు సిద్ధమవుతోంది.ఈ సినిమా వచ్చే సరికి థియేటర్ల దగ్గర మార్చిలో విడుదలయ్యే సినిమాల సందడి తగ్గుతుంది. మహేశ్ ‘భరత్ అనే నేను’ ఒక్కటే థియేటర్లలో వుంటుంది. అప్పటికే అది విడుదలై రెండు వారాలు అవుతుంది కాబట్టి సమస్య వుండదు. ఇక, అల్లు అర్జున్ తరవాత వచ్చే ‘మహానటి’, తనయుడు ఆకాశ్ పూరి హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ‘మెహబూబా’ వస్తాయి. వాటికి ఎన్ని థియేటర్లు దొరుకుతాయి అనేది చూడాలి. ఎక్కువ థియేటర్లు చేతిలో వున్న అల్లు అరవింద్ తనయుడి సినిమాను తీసేస్తారని అనుకోవడానికి వీల్లేదు. పూరికి ప్లస్ అయ్యే అంశం ఏంటంటే.. దిల్ రాజు సినిమాను కొనడం. ఆయన కిందా మీదా పడి థియేటర్లు సర్దుతారు. కానీ, ఈసారి స్టార్ హీరోల సినిమాలు బరిలో వుండడంతో థియేటర్లను సర్దే విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు.

విడుదలయ్యే ప్రతి సినిమా హిట్టవ్వాలని అందరూ కోరుకుంటారు. కానీ, సక్సెస్ రేట్ తక్కువ వున్న సినిమా ఇండస్ట్రీలో ఏ సినిమా హిట్ అవుతుందో? ఏ సినిమా ఫట్ అవుతుందో? చెప్పలేని పరిస్థితి. ప్రతి సినిమా హిట్ అయితే థియేటర్ల దగ్గర దబిడి దిబిడి తప్పదు. అలా కాకుండా మధ్యలో కొన్ని సినిమాలు ఫట్ అయితే ఎలాంటి సమస్య వుండదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.