ఉప్పెన తొలి గీతం.. ఉప్పొంగిన క‌విత్వం

ఈమ‌ధ్య తెలుగు పాట కాస్త వెలుగుతోంది. కొత్త ర‌చ‌యిత‌లు త‌మ భావాల‌కు ప‌దును పెడుతుంటే, ద‌ర్శ‌కులు వాటిని అందంగా చూపించ‌డానికి తాప‌త్ర‌య‌ప‌డుతున్నారు. ప్రేమ‌క‌థ‌ల్లో క‌విత్వం పొంగ‌డానికి కార‌ణం అదే. ప్రేమ గీతాలు భావాత్మ‌కంగా సాగుతుండ‌డానికి ఆలంబ‌నే అదే. ఇటీవ‌ల 30 రోజుల్లో ప్రేమించ‌డం ఎలా అనే సినిమాలోని ఓ పాట‌… ప్రేమికుల‌కు హాయిని పంచుతోంది. అలాంటి పాటే.. మ‌రోటి వ‌చ్చింది. `ఉప్పెన‌`సినిమాలో. అస‌లే ద‌ర్శ‌కుడు సుకుమార్ శిష్యుడు, పైగా సాగ‌ర తీరానికి చెందిన క‌థ‌ని ఎంచుకున్నాడు. పైగా దేవిశ్రీ ప్రసాద్ సంగీత ద‌ర్శ‌కుడు. ఆ భావాలు.. ఉప్పొంగ‌కుండా ఎలా ఉంటాయి..? క‌విత్వం సాగ‌రంలా ముంచెత్త‌కుండా ఎలా ఉంటుంది?

ఉప్పెన లోని `నీ క‌న్ను నీలి స‌ముద్రం.. నా మ‌న‌సేమో అందులో ప‌డ‌వ ప్ర‌యాణం అనే గీతం విడుద‌లైంది. ఖ‌వ్వాలీ థీమ్ లా సాగిన ఈ పాట సంగీత ప్రియుల‌కు కొత్త అనుభూతి పంచ‌డం ఖాయంలా క‌నిపిస్తోంది. ఉర్దూ ప‌దాల ఆలాప‌న‌తో ఖ‌వ్వాలీ టోన్‌లో పాట మొద‌లైంది. కొత్తగా ప్రేమ‌లో ప‌డిన ఓ కుర్రాడి.. భావాల‌న్నీ పాట రూపంలో వ‌రుస‌క‌ట్టాయి. నీ న‌వ్వు ముత్యాల హారం న‌ను తీరానికి లాగేటి దారం దారం.. అంటూ పాట‌ని క‌డ‌లి తీరానికి అన్వ‌యిస్తూ పాట మొద‌లైంది.

చిన్నిఇసుక గూడు క‌ట్టినా
నీ పేరు రాసి పెట్టినా
దాన్ని చెరిపేసే కెర‌టాలు పుట్ట‌లేదు.. అంటూ స‌ముద్ర తీరంతో సంబంధం ఉన్న అభివ్య‌క్తిని వాడుకుంటూ పాట రాయ‌డం అందంగా ఉంది. పాట‌ని ఆల‌పించిన తీరు, శ్యామ్ ద‌త్ ఫొటోగ్ర‌ఫీ చూడ‌ముచ్చ‌ట‌గా ఉన్నాయి. ముఖ్యంగా కృతి శెట్టి చాలా అందంగా క‌నిపించింది. ఈ సినిమా త‌ర‌వాత తెలుగు కుర్రాళ్లు ఆమె ప్రేమ‌లో ప‌డ‌డం గ్యారెంటీ. ఇక వైష్ణ‌వ్ తేజ్ లుక్స్ లో మెగా ఫ్యామిలీ హీరోలంతా క‌నిపిస్తున్నారు. మొత్తానికి కొన్నాళ్ల పాటు పాడుకోవ‌డానికీ, విన‌డానికి మ‌రో మంచి పాట దొరికింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.