పోల‌వ‌రం వెబ్ సైట్ ప‌వ‌న్ కు క‌నిపించ‌లేదా..!

‘నాక్కొంచెం తిక్కుంది.. దానికో లెక్కుంది’.. ఓ సినిమాలో ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పిన డైలాగ్ ఇది. రాజకీయాల్లోకి వచ్చేసరికి తిక్క సంగ‌తేమోగానీ, లెక్క‌ల విష‌యంలో ప‌వన్ చాలా వీక్ అని అర్థమౌతోంది..! ప్ర‌భుత్వం లెక్క‌లు తేల్చుతా అంటూ జ‌న‌సేనాని సిద్ధ‌మైన సంగ‌తి తెలిసిందే. మేధావులు, ఆర్థిక రంగ నిపుణుల‌తో జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ క‌మిటీ (జె.ఎఫ్‌.సి.) ఏర్పాటు చేశారు. దాని లోగో కూడా ట్విట్ట‌ర్ లో షేర్ చేశారు. ఇంత‌కీ ఈ క‌మిటీ ఎందుకు ఏర్పాటు చేశారంటే… లెక్క‌లు తేల్చ‌డానికి..! అదేదో నేరుగా ప్ర‌భుత్వాన్నే అడ‌గొచ్చుగా అంటే… పోల‌వ‌రం ప్రాజెక్టు లెక్క‌లు అడిగినా ప్ర‌భుత్వం తనకు ఇవ్వ‌లేదున్నారు క‌దా! స‌రిగ్గా ఈ పాయింట్ ద‌గ్గ‌రే జ‌న‌సేనాని ఇప్పుడు అడ్డంగా దొరికిపోయారు..! త‌ప్పులో కాలేశారు..! త‌న అస‌మ‌ర్థ‌ను బ‌య‌ట‌పెట్టుకున్నారు..! జ‌న‌సేన స‌మ‌ర్థ‌త‌ను ప్ర‌శ్నించేలా చేసుకున్నారు..!

ముందుగా.. మొన్నటి ప్రెస్ మీట్ లో ప‌వ‌న్ ఏం చెప్పారో చూద్దాం. ‘పోలవరం గురించి శ్వేత పత్రం అడిగాను (ఏపీ ప్ర‌భుత్వాన్ని). డీటెయిల్స్ వెబ్ సైట్లో ఉన్నాయి చూసుకోమ‌ని చెప్పారు. మిత్ర‌ప‌క్షంగా నేను అడిగిన‌ప్పుడు వారు వివ‌రాలు చెప్ప‌లేదు. వెబ్ సైట్లోకి వెళ్లి చూస్తే… ఎక్క‌డా ఏ డీటెయిల్స్ లేవు. ఆ వివ‌రాలేవీ దొర‌క‌లేదు. గ‌త‌సారి పోల‌వ‌రం గురించి అడిగితే వివ‌రాలు ఇవ్వ‌నివారు… ఇప్పుడు ఈ విష‌యం (కేంద్ర కేటాయింపులు) పై అడిగితే ఎలాంటి శ్వేత‌పత్రం ఇస్తారు..? మిత్ర‌ప‌క్షంగా ఉన్నాను, చాలాసార్లు స‌పోర్ట్ చేశాను, వివ‌రాలు నాకే ఇవ్వ‌ని ప‌రిస్థితి ఉంది’.. ఇదీ ప‌వ‌న్ చెప్పిన మాట‌. అంటే, పోల‌వ‌రం వివ‌రాల‌ను అడిగినా ఇవ్వ‌ని ప‌రిస్థితి ఏపీ స‌ర్కారు నుంచి ఉంది కాబ‌ట్టి… ఇప్పుడీ జె.ఎఫ్‌.సి. ఏర్పాటు చేయాల్సి వ‌చ్చింద‌న్నట్టుగా మాట్లాడేశారు.

ఇప్పుడు అస‌లు విష‌యానికొస్తే… పోల‌వ‌రంపై ప‌వ‌న్ శ్వేత ప‌త్రం కోరిన‌ప్పుడు, వివ‌రాలు వెబ్ సైట్లో ఉన్నాయి చూసుకోండ‌ని ఏపీ ప్ర‌భుత్వం చెప్పిన మాట వాస్త‌వ‌మే. అయితే, ఆ వెబ్ సైట్ ప‌వ‌న్ చూడ‌లేదు. చూస్తే ఇలా త‌న అజ్ఞానాన్ని బ‌య‌ట‌పెట్టుకోరు క‌దా! http://polavaram.apegov.com/ispp/home.. ఈ అడ్రెస్ లో పోల‌వ‌రం ప్రాజెక్టుకు సంబంధించిన‌ సర్వ‌మూ ఉంది. పోల‌వ‌రం పుట్టుపూర్వోత్త‌రాలు మొద‌లుకొని ఏపీ స‌ర్కారు చేస్తున్న ప‌నులు, పెడుతున్న ఖ‌ర్చు, జ‌రిగిన ప‌ని, వాటికి సంబంధించి జారీ చేసిన జీవోలూ వాటి తేదీలు, పున‌రావాసం వివ‌రాలు, వారాలూ నెల‌ల వారీ నివేదిక‌లూ, కీల‌క స‌మావేశాలు, నిర్ణ‌యాలు… ఇలా అన్నీ చాలా స్ప‌ష్టంగా ఆ వెబ్ సైట్ లో ఉన్నాయి. ఈ వెబ్ సైట్ ను చూడ‌కుండా ప్ర‌భుత్వంపై ప‌వ‌న్ నింద‌లేయ‌డం ఎంత‌వ‌ర‌కూ స‌బ‌బు..?

ఆయ‌నొక్క‌రే అనుకుంటే, నిజ నిర్థార‌ణ క‌మిటీలో ప్ర‌ముఖ పాత్ర పోషించేందుక సిద్ధమౌతున్న ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ కూడా వెబ్ సైట్ లో వివ‌రాలు లేవంటూ అదే ప్రెస్ మీట్ లో త‌న డాష్ ను బ‌య‌ట‌పెట్టుకున్నారు. ప‌వ‌న్ కంటే ముందే తాను పోల‌వ‌రం వివ‌రాల‌ను ప్ర‌భుత్వాన్ని అడిగితే ఇవ్వ‌లేద‌నీ, మిత్ర‌ప‌క్ష నేత అయిన ప‌వ‌న్ కోరారు కాబ‌ట్టి.. వారికి ఈ మెయిల్ ద్వారా లెక్క‌లు పంపుతారేమో అని ఆశించాన‌ని ఉండ‌వల్లి అన్నారు. ‘వెబ్ సైట్లో చూసుకోండ‌ని అన్నారూ… దాన్ని మీరంతా (విలేక‌ర్లు) కొట్టి చూసుంటారు, అదెక్క‌డుందో.. ఇంకా ప్రారంభం కాలేదు’ అని ఉండ‌వ‌ల్లి కూడా కామెంట్ చేసేశారు! అంటే, ఆయ‌న కూడా పోల‌వ‌రం వెబ్ సైట్ చూడ‌లేద‌న్న‌మాట‌..! అలాంటిదొక‌టి ఉంద‌న్న వాస్త‌వ‌మూ తెలియ‌ద‌న్న‌మాట‌.

సో.. ఇదండీ కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాల మ‌ధ్య ‘లెక్క‌లు తేల్చేందుకు’ రెడీ అయిపోయిన క‌మిటీ పెద్ద‌ల అవ‌గాహ‌న‌..! పోల‌వ‌రం మీద వెబ్ సైట్ ఉందో లేదో, ఉంటే దాన్లో వివ‌రాలు అప్ టు డేట్‌ వ‌చ్చాయో లేదో అనేది తెలుసుకునే ప్ర‌య‌త్నం చేయ‌కుండా ప్రెస్ మీట్ల‌కు వ‌చ్చేసి మాట్లాడేస్తే.. ఇదిగో ఇలానే దొరికిపోవాల్సి వ‌స్తుంది. జ‌న‌సేన‌కు ఒక రీసెర్చ్ టీమ్ ఉంటుంది క‌దా.. క‌నీసం వారైనా ఆ వివ‌రాల‌ను ప‌వ‌న్ కు ముందుగా చెప్పాలి క‌దా! ఇలాంటి వారంద‌రితో క‌మిటీలు ఏర్పాటు చేసుకుని… ‘త‌ప్పు చేసిన వారిని బోనులో నిల‌బెట్టేస్తాం. కడిగేస్తాం, ఆరేస్తాం’ అన్న‌ట్టుగా ప‌వ‌న్ మాట్లాడుతుంటే… జ‌న‌సేన భ‌విష్య‌త్తు ఏంట‌నే ఆవేద‌న స‌గ‌టు అభిమానికి కలగకుండా ఎలా ఉంటుంది..? ప్ర‌జ‌ల కోసం ఏదో చేయాల‌న్న త‌ప‌నా ఆవేశమూ ఆవేద‌నా ఆగ్ర‌హమూ.. ఎన్నైనా ఉండొచ్చు. కానీ, దానికీ ఓ లెక్క ఉండాలి. వాస్తవాలు తెలుసుకుని ఎన్ని ఆరోపణలు చేసినా ప్రజలు హర్షిస్తారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com