ప్రొ.నాగేశ్వర్: రాజకీయ విలువలు పడిపోవడం వల్లే ఫిరాయింపులు..!

ఎన్నికల వేడి పెరుగుతున్న కొద్ది.. ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి మారే ఆయారాం.. గయారాంల సంఖ్య పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాలు.. ఆ మాటకొస్తే.. దేశంలో రాజకీయ పార్టీలకు ఎలాంటి సిద్ధాంతం లేదు. గతంలో కమ్యూనిస్టు పార్టీలు, బీజేపీల్లో చేరేవారు .. ఆ పార్టీ నుంచి వెళ్లేవారు కూడా ఉండేవారు కాదు. కానీ ఇప్పుడు.. బీజేపీలోనూ ఇతర పార్టీ నేతల చేరుతున్నారు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ దశాబ్దాల పాటు.. కాంగ్రెస్ పార్టీలో పని చేసిన వ్యక్తి. అందువల్ల ఈ రాజకీయాల్లో సిద్ధాంతాలతో సబంధం లేదు.

అవసరం లేకపోయినా ఫిరాయింపుల్ని ప్రొత్సహిస్తున్న పార్టీలు..!

రాజకీయ పార్టీలు.. కొంత మంది వ్యక్తుల అధీనంలోకి మారిపోయాయో… అప్పుడే రాజకీయాలు మారిపోయాయి. అధినేతలు మాత్రమే కచ్చితంగా ఆ పార్టీలో ఉంటారు. వారి కింద ఉంటే నేతలు… ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో చెప్పలేము. టీడీపీలో చంద్రబాబు ఫ్యామిలీ, టీఆర్ఎస్ లో కేసీఆర్ , వైసీపీలో జగన్ .. స్థిరంగా ఉంటారు. కానీ ఆ పార్టీల్లో కింది స్థాయిలో ఉండే నేతలు మాత్రం ఏ పార్టీలో అయినా ఉండవచ్చు. ఆ పార్టీలో ఉన్నంత కాలం.. మంచోళ్లు. వేరే పార్టీలో చేరితే మాత్రం… విమర్శలు చేస్తారు. అదంతా.. రాజకీయం. సిద్ధాంతాలు, విలువలతో లేని రాజకీయం. ప్రస్తుతం అధికార పార్టీలకు ఉన్న పెద్ద ఇబ్బంది.. ఒక్కో నియోజకవర్గంలో.. ముగ్గురు, నలుగురు ఆశావహులు ఉండటం. ఇప్పుడు ఆ పార్టీలకు ఉన్న మరో ఇబ్బంది.. ఈ పార్టీలు ఫిరాయింపులను… చాలా ఎక్కువగా ప్రొత్సహించాయి. ఒకప్పుడు ఫిరాయింపులు ఎలా ఉండేవి అంటే… ప్రభుత్వానికి మెజార్టీ లేకపోతే… ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికి ఫిరాయింపుల్ని ప్రొత్సహిచేవారు. అంతకు ముందు అయితే.. ప్రభుత్వం పడిపోయినా పర్వాలేదు కానీ.. ఫిరాయింపుల్ని అంగీకరించేవారు కాదు. ఆ తర్వాత ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికో.. ప్రభుత్వాన్ని కూల్చడానికో ఫిరాయింపుల్ని ప్రొత్సహించారు. ఇప్పుడు అలా కాదు.. తమకు పూర్తి మెజార్టీ ఉన్నా కూడా.. ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయడానికి కూడా ఫిరాయింపుల్ని ప్రొత్సహిస్తున్నారు. ఏపీలో టీడీపీ, తెలంగాణలో టీడీపీ ప్రతిపక్ష ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నారు.

ఫిరాయింపులు జరిగిన చోట నేతల మధ్య ఆధిపత్య పోరాటం..!

ఇలా ఫిరాయింపు ఎమ్మెల్యేలు పార్టీలో చేరిన చోట.. నాయకుల మధ్య ఆధిపత్య పోరాటం ఉంటోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేకు.. అప్పటికే టీడీపీలో ఉన్న ఇన్చార్జ్‌కు మధ్య పరిస్థితి పచ్చగడ్డి వేయకుండానే మంటలు వచ్చేలా ఉంటుంది. ఇలాంటి పరిస్థితి రెండు రాష్ట్రాల్లో కనిపిస్తాయి. ఒక్కరికే టిక్కెట్ వస్తుంది. ఈ పరిస్థితిని సర్దుబాటు చేయడానికి ప్రత్యామ్నాయ నేతకు.. ఎమ్మెల్సీనో.. కార్పొరేషన్ పదవో… కాంట్రాక్టులిచ్చే బుజ్జగించే ప్రయత్నం చేస్తూంటారు. అయినా కూడా ప్రతి నియోజకవర్గంలో… అధికార పార్టీలో ముగ్గురు నుంచి నలుగురు ఆశావహులు ఉన్నారు. ఇలాంటి చోట్లే రాత్రికి రాత్రి పార్టీ మారిన నేతల ఉదాహరణలు ఉన్నాయి. ఇవాళ ఎలాంటి పరిస్థితి ఉందంటే.. ఓ నేత రెండు, మూడు పార్టీల్లో ఖర్చీఫ్ వేసి ఉంటారు. ఎక్కడ టిక్కెట్ ఇస్తామంటే అక్కడకు చేరిపోతారు. అదంతా ఇప్పటి రాజకీయం.

కేసీఆర్ సిట్టింగ్‌లు అందరికీ టిక్కెట్లు ఇస్తారా..?

తెలంగాణ సీఎం కేసీఆర్.. సిట్టింగులందరికీ టిక్కెట్లు ఇస్తామని పదే పదే చెబుతున్నారు. అలా చెప్పడానికి కారణాలు ఉన్నాయి. అందరికీ ఆయన టిక్కెట్లు ఇవ్వకపోవచ్చు. ఇప్పుడే టిక్కెట్లు ఇవ్వబోమని చెబితే.. వారు అనేక విమర్శలు చేస్తారు. అందుకే. కనీసం ఎన్నికలు వచ్చి టిక్కెట్లు ఖరారు చేసే వరకూ అయినా.. వారిని కట్టడిలో ఉంచుదామని.. కేసీఆర్ అందరికీ టిక్కెట్లు అనే ప్రకటనలు చేస్తున్నారు. చివరిలో టిక్కెట్ ఇవ్వలేమని చెప్పినా ఏమీ చేయలేరు. ఇలాంటి పరిస్థితి ఒక్క అధికార పార్టీకే ఉండదు. టిక్కెట్లు దక్కని వాళ్లు.. విపక్ష పార్టీల్లోనూ ఉంటారు. ఈ పరిస్థితి కారణం… రాజకీయ విలువలు దిగజారిపోవడమే.

ఫిరాయింపు నిరోధక చట్టాన్ని అపహాస్యం చేస్తున్నారు..!

భారతదేశంలోని ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం.. విప్ ధిక్కరించినా కూడా.. చట్టసభ సభ్యుడు.. తన పదవికి అనర్హుడవుతాడు. స్వచ్చందంగా ఆ పార్టీకి రాజీనామా చేసినా కూడా… ఎమ్మెల్యే, ఎంపీలు కూడా.. ఫిరాయిపుల నిరోధక చట్టం కింద అనర్హుడవుతారు. ఉదాహరణకు ఎమ్మెల్యే గవర్నర్ వద్దకు వెళ్లి… సొంత పార్టీ ముఖ్యమంత్రికి తాను మద్దతు ఇవ్వడం లేదు అని చెబితే.. అనర్హుడవుతాడు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. ఓ పార్టీ తరపున గెలిచినా.. మరో పార్టీ ప్రభుత్వంలో మంత్రలుగా ఉన్నారు. గవర్నరే స్వయంగా ప్రమాణ స్వీకారం చేయించారు. స్పీకర్లు ఏమీ చేయడం లేదు. ఇంత బహిరంగంగా… రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతున్నా బీజేపీ పట్టించుకోవడం లేదు. బీజేపీ నేతల మాటలకు.. చేతులకు చాలా తేడా ఉండి. నీతులు చెబుతారు కానీ… తమకు ఇబ్బంది కలగనంత వరకే అమలు చేస్తారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.