జేసీ విష‌యంలో చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌న్న‌మాట‌..!

విశాఖ విమానాశ్ర‌యంలో టీడీపీ ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి సృష్టించిన వీరంగం తెలిసిందే. అయితే, దీనిపై కేంద్ర విమాన‌యాన శాఖ మంత్రి అశోక్ గ‌జ‌ప‌తి రాజు స్పందించారు. తాను గంట ముందు ఎయిర్ పోర్టుకు వ‌చ్చినా బోర్డింగ్ పాస్ ఇష్యూ చెయ్య‌లేదంటూ మీడియా ముందు జేసీ చెప్పార‌నీ, అది త‌ప్పుడు స‌మాచారం అని అశోక్ గజ‌ప‌తి ఖండించారు! సీసీ టీవీ ఫుటేజ్ దీనికి ఆధారం అన్నారు. విశాఖ విమానాశ్రయంలో ఎంపీ జేసీ ప్ర‌వేశించిన ద‌గ్గ‌ర నుంచీ చోటు చేసుకున్న ప‌రిణామాల‌కు సంబంధించిన వీడియో ఫుటేజ్ తో పాటు, ఘ‌ట‌న‌కు సంబంధించి అన్ని వివ‌రాల‌ను అంద‌జేయాల్సిందిగా అధికారుల‌కు ఆదేశించిన‌ట్టు కేంద్ర‌మంత్రి చెప్పారు.

జేసీపై కొన్ని విమాన‌యాన సంస్థ‌లు తీసుకున్న నిర్ణ‌యంపై కూడా అశోక్ గ‌జ‌ప‌తి మాట్లాడారు. విశాఖ విమానాశ్రయంలో జ‌రిగిన ఘ‌ట‌న‌కు సంబంధించి భ‌ద్ర‌తా అధికారులు ఇచ్చిన వివ‌రాల ప్ర‌కార‌మే సంస్థ‌లు చ‌ర్య‌లు తీసుకున్నాయ‌ని ఆయ‌న చెప్పారు. జేసీ దివాక‌ర్ రెడ్డి విమాన‌యాన నిషేధం అనేది మంత్రి వ‌ర్గ ప‌రిధిలోకి రాని అంశం అని స్ప‌ష్టం చేశారు. నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా ఎవ‌రు ప్ర‌వ‌ర్తించినా చ‌ర్య‌లు ఉంటాయ‌నీ, చ‌ట్టం ముందు అంద‌రూ స‌మాన‌మే అని ఆయ‌న వ్యాఖ్యానించారు.

నిజానికి, విశాఖలో జేసీ దురుసు ప్ర‌వ‌ర్త‌న‌ను అంద‌రూ తీవ్రంగా త‌ప్పుబ‌డుతుంటే.. కేంద్ర‌మంత్రి అశోక్ గ‌జ‌ప‌తి ఆయ‌న్ని వెన‌కేసుకొస్తున్న‌ట్టు క‌థ‌నాలు వ‌చ్చాయి. జేసీకి బోర్డింగ్ పాస్ ఆయ‌నే ఇప్పించి, పంపించ‌డం విమ‌ర్శ‌ల‌కు దారి తీసింది. సొంత పార్టీ ఎంపీ కాబ‌ట్టి అశోక్ ఇలా స్పందించారంటూ అంద‌రూ త‌ప్పుబ‌ట్టారు. కానీ, ఈ నెగెటివ్ క‌థ‌నాల వ‌ల్ల ప‌రువు పోయే ప‌రిస్థితి వ‌స్తోంద‌ని ఆయ‌న గ్ర‌హించిన‌ట్టున్నారు. అందుకే, ఇప్పుడు ఇలా స్పందించారు. చ‌ట్టం ముందు అంద‌రూ స‌మాన‌మేన‌నీ, భ‌ద్ర‌త‌కు ముప్పు క‌లిగించేవారిపై చ‌ర్య‌లు ఉంటాయ‌ని ఆయ‌న ప్ర‌క‌టించ‌డం దిద్దుబాటు చ‌ర్య‌గానే చూడాలి.

ఇదే విష‌య‌మై ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు కూడా సీరియ‌స్ గానే స్పందించిన‌ట్టు తెలుస్తోంది. ఇలాంటి చిన్న విష‌యాల్లో కూడా లేనిపోని త‌గాదాలు పెట్టుకుంటూ పార్టీ ప్ర‌తిష్ఠ‌ను దిగ‌జార్చుతున్నారంటూ జేసీ వ్య‌వ‌హార శైలిపై ఆయ‌న ఫైర్ అయిన‌ట్టు చెబుతున్నారు! మ‌రి, ఇది కూడా క్ర‌మ‌శిక్ష‌ణా రాహిత్యం కింద‌కే వ‌స్తుంది క‌దా! నిన్న‌నే మంత్రుల వివాదంపై మండిప‌డ్డారూ, దీప‌క్ రెడ్డిని స‌స్పెండ్ చేశారూ.. మ‌రి, ఇవాళ్ల జేసీపై ఎలాంటి క్ర‌మ‌శిక్ష‌ణ చ‌ర్య‌లు తీసుకుంటారో చూడాలి! పైగా, చ‌ట్టం కూడా త‌న ప‌నిని తాను ఎంత వేగంగా చేస్తుందో కూడా చూడాలి!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.