రివ్యూ: బాబు బాగా బోరు – బాబు బాగా బిజీ

కొన్ని క‌థ‌లు ఎప్పుడు చెప్పినా బాగుంటాయి. ఎలా చెప్పినా న‌చ్చుతాయి. కొన్ని క‌థ‌లు మాత్రం…. చెప్పే విధంగానే చెప్పాలి. ప్లేబోయ్ త‌ర‌హా క‌థ కాస్త స్పైసీగానే చెప్పాల్సి ఉంటుంది. ఆ హ‌ద్దు దాటితే అది అడల్ట్ కామెడీ అయిపోతుంది. అయినా ఫ‌ర్వాలేదు – ఓ వ‌ర్గానికి సినిమా న‌చ్చినా స‌రిపోతుంది అనుకొన్న‌ప్పుడు ధైర్యంగా అలాంటి ప్ర‌య‌త్నాలు చేయొచ్చు. మ‌న ద‌గ్గ‌ర ఈ వాతావ‌ర‌ణం ఇంకా అల‌వాటు ప‌డ‌లేదు గానీ, బాలీవుడ్‌లో ఇలాంటి క‌థ‌లు కొత్త కాదు. బిఏ పాస్ నుంచి హంట‌ర్ వ‌ర‌కూ.. అడ‌ల్ట్ డోస్ ఎక్కువైన సినిమాలు వ‌స్తున్నాయి. డ‌బ్బులూ దండుకొంటున్నాయి. బీఏ పాస్ లాంటి క‌థ‌ల్ని తెలుగులో రీమేక్ చేయ‌లేం గానీ… హంట‌ర్‌కి ఆ ల‌క్ష‌ణాలున్నాయి. అందుకే ఈ సినిమాని ఇప్పుడు తెలుగులో రీమేక్ చేశారు. ‘బాబు బాగా బిజీ’ పేరుతో. మ‌రి… ఈ ప్ర‌య‌త్నం వర్క‌వుట్ అయ్యిందా? లేదా? ఇందులో అడ‌ల్ట్ కామెడీ ఎంత‌? కామెడీ ఎంత‌? ఈ బాబు బాబోగులు ఎలా ఉన్నాయి?? ఓసారి త‌ర‌చి చూస్తే..??

* క‌థ‌

మాధ‌వ్ (అవ‌స‌రాల శ్రీ‌నివాస్‌) ప్లేబాయ్‌. చిన్న‌ప్ప‌టి నుంచీ సెక్స్‌పై యావ ఎక్కువ‌. అదేంటో తెలుసుకోవాల‌ని, సెక్స్ రుచి చూసేయాల‌ని ఉబ‌లాట‌ప‌డుతుంటాడు. ఆంటీలు, అమ్మాయిల బ‌ల‌హీన‌త‌ల్ని క్యాష్ చేసుకొంటుంటాడు. పారు (తేజ‌స్వి), సుప్రియ (చంద్రిక‌), శోభ (శ్రీ‌ముఖి).. ఇలా చాలామంది అమ్మాయిలు ప‌రిచ‌యం అవుతారు మాధ‌వ్‌కి. వాళ్ల‌తో త‌న అవ‌స‌రాల్నీ అందంగా తీర్చుకొంటాడు. చివ‌రికి పెళ్లీడొచ్చి దాటిపోతుంటుంది. ఈ ద‌శ‌లో పెళ్లి అవ‌స‌రం తెలుసుకొని… జీవితంలో స్థిర‌ప‌డాల‌నుకొంటాడు. ప్ర‌తీ అమ్మాయి ద‌గ్గ‌రా త‌న ఫ్లాష్ బ్యాక్ విపులంగా చెప్పేస్తుంటాడు. ఆ రొమాంటిక్ ఫ్లాష్ బ్యాక్ చూసి త‌ట్టుకోలేక‌, అమ్మాయిలు తుర్రుమంటుంటారు. రాధ (మిస్తీ చ‌క్ర‌వ‌ర్తి) ద‌గ్గ‌ర మాత్రం త‌న గ‌తం దాస్తాడు. అయితే రాధ‌కీ ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. త‌ను ఓ అబ్బాయిని ప్రేమిస్తుంది. ఇప్ప‌టికీ ఇద్ద‌రూ ట‌చ్‌లోనే ఉంటారు. మ‌రి రాధ గ‌తం తెలుసుకొన్న మాధ‌వ్ ఏం చేశాడు? ఇద్ద‌రూ పెళ్లి చేసుకొన్నారా, లేదా? అనేది వెండి తెర‌పై చూడాలి.

* విశ్లేష‌ణ‌

హంట‌ర్ క‌థ‌నీ, స్క్రీన్ ప్లేనీ, స‌న్నివేశాల్ని అచ్చుగుద్దిన‌ట్టు ఫాలో అయిపోయాడు న‌వీన్ మేడారం. కాక‌పోతే అడ‌ల్ట్ కంటెంట్ డోసు త‌గ్గిందంతే. హంట‌ర్‌లో ఉన్న మ‌త్తు ఏంటంటే.. అందులో ఉన్న మ‌సాలా దినుసులు. అది కుర్ర‌కారుని వెర్రెక్కించింది. దానికి తోడు స్క్రీన్ ప్లే. పెళ్లి చూపుల్లో అమ్మాయి ద‌గ్గ‌ర త‌న క‌థ చెబుతుంటాడు. దాంతో.. ఫ్లాష్ బ్యాక్‌లో ఏం జ‌రిగిందో తెలుస్తుంటుంది. అదే క‌థ‌నీ, అదే స్క్రీన్ ప్లేని న‌వీన్ మేడారం ఫాలో అయిపోయినా… హంట‌ర్ చూసిన‌ప్పుడు ఉన్న ఫీల్ బాబు బాగా బిజీతో రాదు. ఎందుకంటే కొన్ని క‌థ‌ల్ని స్పైసీగానే చెప్పాలి. అది బాబు బాగా బిజీలో త‌గ్గింది. దానికి తోడు స‌న్నివేశాల‌న్నీ య‌మ బోరింగ్ గా సాగుతాయి. స్లో నేరేష‌న్ బాగా ఇబ్బంది పెడుతుంది. హంట‌ర్‌లో ఉన్న‌ది ఉన్న‌ట్టు తీస్తే.. తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఏమాత్రం రుచింక‌చ‌పోవొచ్చు. ఎందుకంటే అంత బోల్డ్ ఎటెమ్ట్ మ‌న‌కు ఎక్క‌దు. అలాగ‌ని ఆ స‌న్నివేశాల తీవ్ర‌త త‌గ్గిస్తే మొద‌టికే మోసం వ‌స్తుంది. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసే క్ర‌మంలో ద‌ర్శ‌కుడు బాలెన్స్ త‌ప్పాడ‌నిపిస్తుంది. సీ క్లాస్ ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకొనే కొన్ని సీన్లు. డైలాగులూ ఉన్నాయి సినిమాలో. అయితే వాళ్ల‌కు న‌చ్చ‌ని అంశాలూ చాలానే క‌నిపిస్తాయి. దాంతో అటు మ‌ల్టీప్లెక్స్‌కీ, ఇటు బీసీ ఆడియెన్స్‌కీ రెండింటికీ బాబు.. బాగా దూరం అవుతాడు. మాతృక‌లో చూస్తే.. రాధ పాత్ర‌లో చాలా ఇంటెన్సిటీ క‌నిపిస్తుంది. కాస్త అమాయ‌క‌త్వం… ప్రేమ‌, తెలియ‌ని త‌నం ఇవ‌న్నీ ఆ పాత్ర‌లో చూపించారు. ఇక్క‌డ మాత్రం రాధ పాత్ర‌ని తీర్చిదిద్దిన తీరు.. కృత‌కంగా ఉంటుంది. చాలా పాత్ర‌లు ఇలానే ప్ర‌వ‌ర్తిస్తుంటాయి. బ‌ల‌వంత‌పు కామెడీ కూడా… బాబులో క‌నిపించే ఓ ప్ర‌ధాన లోపం.

* న‌టీన‌టుల ప్ర‌తిభ‌

అవ‌స‌రాల శ్రీ‌నివాస్ బాగానే చేశాడు. కానీ మూడు లుక్స్‌లోనూ ఒకేలా క‌నిపించాడు. మాతృక‌లో క‌నిపించిన గుల్షాన్‌తో పోలిస్తే అవ‌స‌రాల తేలిపోవ‌డం ఖాయం. కానీ… ఆ పాత్రని తెలుగులో అవ‌స‌రాల మాత్ర‌మే ర‌క్తిక‌ట్టిస్తాడ‌నిపిస్తుంది. త‌న‌దైన కామెడీ టైమింగ్ తో కాస్త టైమ్ పాస్ చేస్తాడు. మిస్తీ చ‌క్ర‌వ‌ర్తి ని మిన‌హాయిస్తే మిగిలివాళ్లంతా గెస్ట్ రోల్స్‌కి ఎక్కువ‌, హీరోయిన్ల‌కు త‌క్కువ‌. శ్రీ‌ముఖి అయితే ఒకే ఒక్క సీన్‌లో కనిపించింది. పెళ్లి చూపుల‌తో ఆక‌ట్టుకొన్న ప్రియ‌ద‌ర్శి మ‌రోసారి అల‌రిస్తాడు. అవ‌స‌రాల – ప్రియ‌ద‌ర్శి మ‌ధ్య న‌డిచే సంభాష‌ణ‌లే కాస్త రిలీఫ్ ఇచ్చాయి.

* సాంకేతిక వ‌ర్గం

ఇలాంటి క‌థ‌ల్ని వీలైనంత త‌క్కువ‌లో తీయాలి. అప్పుడే రిస్క్ ఫ్యాక్ట‌ర్ త‌క్కువ‌గా ఉంటుంది. ఈ విష‌యంలో అభిషేక్ పిక్చ‌ర్స్ సంస్థ విజ‌య‌వంత‌మైంది. సునీల్ కాశ్య‌ప్ ఇక‌నైనా కొత్త బాణీల్ని అందించ‌డంలో దృష్టి పెట్టాలి. కెమెరా వ‌ర్క్ బాగుంది. సినిమా నిడివి కూడా త‌క్కువే. ద‌ర్శ‌కుడు న‌వీన్‌… రీమేక్‌లో ఉన్న అడ‌ల్ట్ కంటెంట్ డోసు వీలైనంత త‌గ్గించి తెలుగులో చూపించాల‌నుకొన్నాడు. ఆ ఒక్క విష‌యంలో త‌ప్ప మిగిలిన విష‌యాల్లో ఫెయిల్ అయ్యాడు.

* ఫైన‌ల్ పంచ్‌: అమ్మాయిల విష‌యంలో బాబు బాగా ఫాస్టే అయినా, ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకోవ‌డంలో బాబు బాగా స్లో..! అందుకే బాగా బోర్ కొట్టేశాడు.

రేటింగ్‌: 2.25

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.