రివ్యూ: బ్ల‌ఫ్ మాస్ట‌ర్‌

Bluff master sameeksha

తెలుగు360 రేటింగ్‌: 2.5

మోప‌పోయిన‌వాళ్లు ఉన్నంత కాలం.. మోసం చేసేవాడు పుట్టుకొస్తూనే ఉంటాడు.

ఎదుటివాళ్ల‌లోని అత్యాశ‌ని క్యాష్ చేసుకోగ‌లిగినోడే బ్ల‌ఫ్ మాస్ట‌ర్‌!

బ్ల‌ఫ్ మాస్ట‌ర్ క‌థ‌ని టూకీగా చెప్పాలంటే ఇది. అయితే.. మోసం చేసిన‌వాడు, చివ‌రికి ఎవ‌రో ఒక‌రి చేతుల్లో మోస‌పోవ‌డం కూడా త‌థ్యం. అది కూడా బ్ల‌ఫ్ మాస్ట‌ర్‌లోనే చూపించారు. మొత్తానికి ఇదో `మోసం` చుట్టూ న‌డిచే క‌థ‌. మ‌రి ఆ మోసాలు ఎలా ఉన్నాయి? బ‌్ల‌ఫ్ మాస్ట‌ర్ నాట‌కం వెండి తెర‌పై ర‌క్తి క‌ట్టిందా, లేదా?

క‌థ‌

ఉత్త‌మ్ కుమార్ (స‌త్య‌దేవ్‌) కి పేరులో ఉన్న ఉత్త‌మ‌మైన ల‌క్ష‌ణాలేవీ లేవు. ఎదుటివాళ్ల‌ని మోసం చేసి, క్యాష్ చేసుకోవ‌డ‌మే త‌న‌కు తెలిసిన ప‌ని. అందులో ఆరి తేరిపోయాడు. రోజుకో కొత్త అవ‌తారం, దానికి త‌గ్గ పేరుతో… ఈజీగా బురిడీ కొట్టించేస్తుంటాడు. అలాంటి ఉత్త‌మ్ కుమార్‌నే ఇద్ద‌రు స్నేహితులు మోసం చేస్తారు. అక్క‌డి నుంచి త‌న‌లో మార్పు వస్తుంది. ఎలాంటి స్వార్థం లేకుండా త‌న‌ని ఇష్ట‌ప‌డిన ఓ అమాయ‌కురాలు (నందిత శ్వేత‌)ని పెళ్లి చేసుకుని.. ఈ మోసాల‌కు దూరంగా ఎక్క‌డో బ‌తుకుతుంటాడు. అయితే అక్క‌డ కూడా త‌న పాత నేరాలు వెంటాడ‌తాయి. ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటున్న భార్య ప్రాణ‌ల‌కు ముప్పు తెప్పిస్తాయి. అలాంట‌ప్పుడు ఉత్త‌మ్ కుమార్ ఏం చేశాడు? త‌న భార్య ప్రాణాల్ని ఎలా కాపాడుకున్నాడు? అనేదే క‌థ‌.

విశ్లేష‌ణ‌

టీవీల్లో చూస్తుంటాం. పేప‌ర్ల‌లో చ‌దువుతుంటాం. బ్రేకింగ్ న్యూస్‌లో అదే. ఫేస్ బుక్‌లో అదే. మోసం.. మోసం. రెండు త‌ల‌ల పాము, అది ఇంట్లో ఉంటే శుభం అని చెప్పి ల‌క్ష‌లు ల‌క్ష‌లు కాజేసే బ్యాచుల గురించి మ‌న‌కు తెలుసు. మా స్కీమ్ మీరు చేరండి, మ‌రో ముగ్గుర్ని చేర్పించండి.. నెల‌కు ల‌క్ష‌లు సంపాదించండి అంటూ చైన్ త‌ర‌హా స్కీము స్కాములు విన్నాం. `రైస్ పుల్లింగ్‌` పేరుతో జ‌రుగుతున్న క‌ప‌ట నాట‌కాలూ చూసేశాం. తెర‌పై ఇవే స‌న్నివేశాలుగా క‌నిపిస్తాయి. ఒక‌ర్ని బురిడీ చేయ‌డం ఇంత సుల‌భ‌మా? ఈరోజుల్లో కూడా ఇంత దారుణంగా మోస‌పోతున్నారా? అని ఆశ్చ‌ర్యం వేస్తుంది. అనుమానం క‌లుగుతుంది. అలాంటి సంఘ‌ట‌న‌ల్ని చూశాం, విన్నాం కాబ‌ట్టి,.. `నిజ‌మే కామోసు` అని స‌ర్దిచెప్పుకుంటుంటాం. సినిమా అంతా మోసాల పుట్టే. ఓ మోసం ముగిశాక‌, మ‌రోటి.. ఆ త‌ర‌వాత ఇంకోటి.. ఇలా జ‌రుగుతూనే ఉంటాయి. ఆయా స‌న్నివేశాల్లో వ్యంగాస్త్రాలు బాగా పేలాయి. పోలీస్ ఇంట‌రాగేష‌న్ లో హీరో చేత చెప్పించిన డైలాగులు చ‌ప్ప‌ట్లు కొట్టించాయి. అయితే.. ఆ ఎమోష‌న్ అంత వ‌ర‌కే.

ద్వితీయార్థంలో ఈ క‌థ ఇంకెన్ని మ‌లుపులు తిరుగుతుందో అనుకుంటే.. తిరిగి తిరిగి మ‌ళ్లీ `మోసం` అనే కాన్సెప్టు ద‌గ్గ‌రే ఆగింది. ఈసారి ఆ స్కామ్ విలువ వంద కోట్లు కాబ‌ట్టి.. సీను, అందుకు వేసిన ప్లానూ లెంగ్తీగా అనిపిస్తాయి. అయితే మోసం చేసే విధానంలోనూ, అందుకోసం వేసే ప్లానులోనూ ఎక్క‌డా కొత్త‌ద‌నం క‌నిపించ‌దు. ఎప్పుడో ఏదో సినిమాలో చూసిన సీనో, ఎక్క‌డో చ‌దివిన న్యూసో గుర్తొస్తుంది. పైగా 2014లో విడుద‌లైన `శ‌తురంగ వెట్టై` అనే సినిమాకి రీమేక్ ఇది. ఆ సినిమా వ‌చ్చే దాదాపు నాలుగేళ్లు పూర్త‌య్యాయి. ఆ సినిమాని ఇంత ఆల‌స్యంగా రీమేక్ చేస్తున్న‌ప్పుడు స‌న్నివేశాల్లోనూ ఆ పాత వాస‌న క‌నిపిస్తుంటుంది. `బ్రూస్లీ` పేరిట జ‌రిగిన తొలి మోసం దాదాపు పావుగంట సాగుతుంది.

అద‌నే కాదు, ప్ర‌తీ ఎపిసోడ్ ఇలా సుదీర్ఘంగా న‌డుస్తూనే ఉంటుంది. ద్వితీయార్థంలో ఎమోష‌న్ స‌రిగా పండ‌లేదు. క‌థానాయిక ప్ర‌స‌వ వేద‌న ప‌డుతుండ‌డం, న‌డి రోడ్డు మీద టాక్సీల కోసం ఎదురుచూపు.. ఇదంతా పాత సినిమాల స్టైల్‌.

కాబ‌ట్టి క‌నెక్ట్ అవ్వ‌డానికి ఛాన్స్ త‌క్కువ‌. ద్వితీయార్థాన్ని ట్రిమ్ చేసుంటే బాగుండేదేమో..?!

న‌టీన‌టులు

స‌త్య‌దేవ్‌లో మంచి న‌టుడున్నాడు. త‌న వాయిస్, డిక్ష‌న్ బాగుంటాయి. కాక‌పోతే ప్ర‌తీ సీన్‌లోనూ ఒకే మీట‌ర్‌లో న‌టిస్తున్నాడు. ఈ సినిమాతో మంచి మార్కులు కొట్టేయ‌డం ఖాయం. క‌థానాయిక పాత్ర ఎంపిక బాలేదు. నందిత శ్వేత‌కు ఈ పాత్ర‌, అందుకు చెప్పించిన డ‌బ్బింగ్ సూటు కాలేదు. ఆమె బాడీ లాంగ్వేజ్ కూడా క్రుత‌కంగా అనిపిస్తుంది.

ఆదిత్య మీన‌న్ పాత్ర‌లోనూ పాత ధోర‌ణే క‌నిపిస్తుంది. బ్రహ్మాజీ కొంత వ‌ర‌కూ ఓకే.

సాంకేతిక వ‌ర్గం

పాట‌లకు స్కోప్ త‌క్కువ‌. ఉన్న ఒక్క పాటా సోసోగా ఉంది. నిర్మాణ ప‌రంగా.. రాజీ ధోర‌ణి క‌నిపించింది. ఇదే సినిమాని లావీష్‌గా తీసుంటే… ఇంకాస్త ఇంపాక్ట్ ఉండేది. ద‌ర్శ‌కుడు చేసిన మార్పులు చేర్పులూ కొంత వ‌ర‌కూ తెలుగు నేటివిటీ తీసుకురావ‌డానికి ఉప‌యోగ‌ప‌డ్డాయి. డైలాగుల్లో వ్యంగ్యం బాగుంది. ఫేస్ బుక్ డైలాగులు కొన్ని కాపీ కొట్టిన‌ట్టు అర్థం అవుతోంది. క‌థానాయ‌కుడి ఫ్లాష్ బ్యాక్ రొటీన్‌గా ఉంది. ద్వితీయార్థంలో ఇంకాస్త శ్ర‌ద్ద తీసుకోవాల్సింది.

తీర్పు

కొత్త‌ద‌నం లేని క‌థ‌, లాజిక్ లేని పాత్ర‌లు, స‌న్నివేశాల‌తో రూపొందిన చిత్ర‌మిది. అక్క‌డ‌క్క‌డా మాట‌లు, మ‌లుపులు మెప్పిస్తాయంతే. మిగ‌తాదంతా కూడా టీవీల్లోనూ, ప‌త్రిక‌ల్లోనూ చూసేసిన విష‌య‌మే.

ఫైన‌ల్ ట‌చ్‌: స్ట‌ఫ్ స‌రిపోలేదు

తెలుగు360 రేటింగ్‌: 2.5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com