జగన్‌ వచ్చినా ఎన్నికల తర్వాతేనన్న ఉత్తమ్‌?

వైఎస్‌ఆర్‌సిపి అద్యక్షుడు జగన్‌ మోహన్‌ రెడ్డి కేంద్రంలో బిజెపికి చేరువయ్యారని ఒకవైపు కథనాలు వస్తుంటే ఆయన మళ్లీ కాంగ్రెస్‌లోకి వచ్చే సూచనలున్నాయని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. జగన్‌ పునరాగమనానికి అవకాశం వుందా అని ఇటీవల రాహుల్‌ గాంధీ పర్యటన సమయంలో ఈ విషయమై టిపిసిసి అద్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డిని వాకబు చేశారట. ఇప్పుడైతే రాడు, ఎన్నికల ఫలితాల తర్వాత చూడాల్సిందేనని ఉత్తమ్‌ జవాబిచ్చారట.ఇది కాంగ్రెస్‌ వర్గాల కథనం. ఇలాటి కబుర్లే ఎపిలోనూ వింటున్నాం. అయితే జగన్‌ పట్ల కాంగ్రెస్‌లో రెండు రకాల అభిప్రాయాలుంటాయి. ఏది ఏమైనా ఆయనతో వెళ్లక తప్పదని ఒక వర్గం వాదిస్తుంటుంది. ఆయన స్థానం బలహీనమవుతున్నది గనక స్వంత పునాది కాపాడుకుంటే తనే వస్తారని మరో వర్గం భావిస్తుంది.ఆయన బిజెపితో పోతే తమకు మంచిదని కూడా వారంటారు. ఈ లోగా చాలామంది అటు వెళ్లిపోతున్నారనే ఆందోళన కూడా వుంది. కాంగ్రెస్‌ తనుగా కోలుకునే అవకాశంలేదు గనక వైసీపీలోకి వెళ్లిపోతారని వారి భయం. చాలా చోట్ల అది నిజమైంది కూడా. అసలు వైసీపీని కాంగ్రెస్‌కు ప్రతిరూపంగా చూడటం వల్లనే సంప్రదాయిక ఓటర్లు అటు మళ్లారని కాంగ్రెస్‌ నేతలు బాధపడుతుంటారు. 2019లో తామేదో పెద్ద పలితాలు సాధిస్తామనే భ్రమలు లేవని కూడా వీరు స్పష్టంగా చెబుతున్నారు.కేంద్రంలో వలెనే ఇక్కడా పదేళ్లు పక్కన కూచుంటే మళ్లీ యుపిఎలా తిరిగొస్తామని వీరు వూహిస్తుంటారు. ఈ కథలో మధ్య మధ్య జగన్‌ ప్రస్తావన కూడా తెస్తుంటారు.ఏమైనా సోనియా గాంధీ రాహుల్‌ గాంధీ బహిరంగంగా విచారం వెలిబుచ్చితే తప్ప తమ నాయకుడు స్పందించబోడని వైసీపీ వారంటారు. దేశమంతా బలహీనపడిన కాంగ్రెస్‌తో చేరినా ఒరిగేదేమిటని వారు ప్రశ్నిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.