టీడీపీలోకి డీఎల్ రాక అంత ఈజీ కాదు..!

అధికార పార్టీ నుంచి ఆహ్వానం వ‌చ్చిదంటే, సంబ‌ర‌ప‌డ‌ని నేత‌లంటూ ఎవ‌రుంటారు చెప్పండీ! ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తామ‌ని ఎన్నిక‌ల‌కు ఏడాదిన్న‌ర ముందు పిలిస్తే ఎలా ఉంటుంది..? మాజీ మంత్రి డీఎల్ ర‌వీంద్రా రెడ్డి వ‌ర్గంలో ఇలాంటి సంద‌డే ఉండాలి. కానీ, అక్క‌డి ప‌రిస్థితి అందుకు భిన్నంగా ఉంద‌ని తెలుస్తోంది. మంత్రి య‌న‌మ‌ల వియ్యంకుడు పుట్టా సుధాక‌ర్ యాద‌వ్ కు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ఛైర్మ‌న్ ప‌ద‌వి ఇస్తార‌నే ప్ర‌చారం ఊపందుకోవ‌డంతో.. డీఎల్ వార్త‌ల్లోకి వ‌చ్చారు. ఒక్క‌సారిగా మైదుకూరు రాజ‌కీయం వేడెక్కింది. డీఎల్ ర‌వీంద్రారెడ్డికి లైన్ క్లియ‌ర్ చేయ‌డం కోస‌మే స్థానిక నేత సుధాక‌ర్ కు ఆ ప‌ద‌వికి ఇస్తున్న‌ట్టు, ఈ మేర‌కు య‌న‌మ‌ల‌తో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు భేటీ అయి నిర్ణ‌యం తీసుకున్న‌ట్టూ క‌థ‌నాలు వ‌స్తున్నాయి. ఇదంతా డీఎల్ ను పార్టీలోకి తీసుకొచ్చేందుకు జ‌రుగుతున్న ప్ర‌య‌త్నంలో భాగ‌మే! అయితే, ఆయ‌న్నే ఎందుకు ప‌ట్టుబ‌ట్టి తీసుకొస్తున్నారంటే.. మైదుకూరులో రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన‌వారే ఎమ్మెల్యేలుగా గెలుస్తూ వ‌స్తున్న చ‌రిత్ర ఉంది కాబ‌ట్టి!

అయితే, టీడీపీ ఆశిస్తున్న‌ట్టుగా ఇప్ప‌టికిప్పుడే డీఎల్ పార్టీలో చేరిపోయే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో డీఎల్ స్పందించిందీ లేదు. ఎన్నిక‌ల‌కు ఇంకా చాలా స‌మ‌యం ఉంది క‌దా.. అప్పుడు ఆలోచిద్దాం అని ఆయ‌న అంటున్నారు. వాస్త‌వానికి… డీఎల్ టీడీపీలోకి రావాలంటే ముందుగా కొన్ని స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కావాలి. ఎప్ప‌ట్నుంచో పార్టీని న‌మ్ముకుంటున్న సుధాక‌ర్ యాద‌వ్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో టిక్కెట్ కోసం సిద్ధంగా ఉన్నారు. ఈ త‌రుణంలో ఆయ‌న‌కి టీటీడీ ప‌ద‌వి ఇవ్వ‌డంతో ఆ వ‌ర్గంలో అసంతృప్తి మొద‌లైంద‌నే అంటున్నారు. అంతేకాదు, ఛైర్మ‌న్ ప‌ద‌వి ఉన్నా స‌రే.. వ‌చ్చే 2019 ఎన్నిక‌ల్లో సుధాక‌ర్ యాద‌వ్ కే టిక్కెట్ ఇవ్వాల‌నే వాద‌న ఆ వ‌ర్గం నుంచి ఇప్పుడు వినిపిస్తోంది. ఇలాంటి ప‌రిస్థితిలో సుధాక‌ర్ ను కాద‌ని డీఎల్ కు సీటిస్తే… స్థానికంగా ఆయ‌న‌కు మ‌ద్ద‌తుగా నిలిచేది ఎవ‌రు..? ఈ ప‌రిస్థితిపై స్ప‌ష్ట‌త కోసం డీఎల్ ఎదురుచూసే అవ‌కాశం ఉంది. డీఎల్ కు ఇంకో స‌మ‌స్య కూడా ఉంది. ఇదే నియోజ‌క వ‌ర్గంలోని సీనియ‌ర్ నేత రెడ్యం వెంక‌ట‌సుబ్బారెడ్డి వ‌ర్గంతో డీఎల్ కు ప‌డ‌దు! సో.. టీడీపీలోకి డీఎల్ వ‌స్తే… రెడ్యం నుంచి వ‌ర్గ‌పోరు త‌ప్ప‌దనే చెప్పాలి.

రెడ్యం వ‌ర్గంతో ఎలాంటి స‌మ‌స్య ఉండ‌ద‌నీ, సుధాక‌ర్ యాద‌వ్ నుంచి ప‌రిపూర్ణ స‌హకారం ఉంటుంద‌నే భ‌రోసా కోసం ర‌వీంద్రా రెడ్డి ఎదురుచూసే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. పిలిచారు క‌దా అని ఉన్న‌ప‌ళంగా ఇప్పుడే టీడీపీలో చేరితే చాలా స‌మ‌స్య‌లు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌నీ, ప్ర‌తీ పంచాయితీకీ చంద్ర‌బాబు ద‌గ్గ‌ర‌కు ప‌రుగులు తీయాల్సి వ‌స్తుంద‌నే విశ్లేష‌ణ‌లో డీఎల్ వ‌ర్గం ఉందట‌. అందుకే, టీడీపీలో చేరిక‌పై తొంద‌ర‌ప‌డి ప్ర‌క‌ట‌న చేయ‌కుండా.. ఇప్పుడు త‌లెత్తిన గంద‌ర‌గోళ ప‌రిస్థితుల‌ను టీడీపీ అధినాయ‌క‌త్వం స‌ద్దుమ‌ణిగేలా చేశాక‌నే నిర్ణ‌యం ఉంటుంద‌ని అంటున్నారు. స‌రే.. ఒక‌వేళ ఇప్ప‌టికిప్పుడు రెడ్యంతోపాటు, సుధాక‌ర్ యాద‌వ్ వ‌ర్గాల‌ను చంద్ర‌బాబు పిలిచి స‌ర్దిచెప్పినా.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో డీఎల్ కు ప‌క్క‌లో బ‌ల్లెంగానే వారు ఉంటార‌నేది వాస్త‌వం! ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో డీల్ చేరిక అంత ఈజీ కాదు.. చేరినా త‌రువాత ప‌రిస్థితులు కూడా అంత ఈజీగా ఉండ‌వ‌నే అనిపిస్తోంది!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.