హను.. పడి లేచె దర్శకుడు!

మొదటి సినిమా ‘అందాల రాక్షసి’తో దర్శకుడు హను రాఘవపూడికి మంచి పేరు వచ్చింది. కమర్షియల్ పరంగా సినిమా రిజల్ట్ పక్కన పెడితే దర్శకుడిగా అతనికి మార్కులు బాగా పడ్డాయి. రెండో సినిమా ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’తో పేరుకి పేరు, డబ్బుకి డబ్బు వచ్చాయి. కానీ, మూడో సినిమా ‘లై’ తేడా కొట్టింది. అట్టర్ ప్లాప్ అయ్యింది. దాంతో హను టాలెంట్ మీద మచ్చ పడింది. దర్శకుడిగా రెండు మెట్లు కిందకు పడ్డాడు. సినిమాల్లో హిట్టూ ఫ్లాపులు కామన్. కానీ, ‘అందాల రాక్షసి’, ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’ తీసిన దర్శకుడు నుంచి అలాంటి సినిమా ఎవరూ ఊహించలేదు. అయితే ‘లై’ ప్లాప్ తర్వాత హను రాఘవపూడికి వెంటనే అవకాశం వచ్చింది. శర్వానంద్ హీరోగా ‘పడి పడి లేచె మనసు’ తీస్తున్నాడు. హీరో బర్త్ డే సందర్భంగా ఈ రోజు లుక్ విడుదల చేశారు. అది చూస్తుంటే కింద పడిన హను మళ్ళీ పైకి లేచేలా కనిపిస్తున్నాడు. తనపై పడిన మచ్చను చెరిపేసుకునేలా కనిపిస్తున్నాడు. శర్వానంద్ లుక్, ‘పడి పడి లేచె మనసు’ టైటిల్ లోగో, పోస్టర్ డిజైన్ బాగున్నాయి. చక్కటి అందమైన ప్రేమకథతో సినిమా తీస్తున్నట్టు అర్థమవుతుంది. హనుకి పేరు తీసుకొచ్చిన సినిమాలు ప్రేమకథలే. ‘పడి పడి లేచె మనసు’తో ఎలాంటి ప్రేమకథను చూపిస్తాడో!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.