ప‌దేప‌దే ఈ వేర్పాటువాద టాపిక్ ఎందుకు ప‌వ‌న్‌..?

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఏర్పాటు చేసిన జె.ఎఫ్.సి. తొలి స‌మావేశం హైద‌రాబాద్ లో జ‌రిగింది. లోక్ స‌త్తా అధ్య‌క్షుడు జ‌య‌ప్ర‌కాష్ నారాయ‌ణ అధ్య‌క్ష‌త జ‌రిగిన ఈ స‌మావేశంలో ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్‌, మాజీ మంత్రి కొణతాల‌, సీపీఐ కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణ వంటి నాయ‌కుల‌తోపాటు మాజీ ప్ర‌భుత్వోన్న‌త ఉద్యోగులు, సామాజిక‌వేత్త‌లు కూడా భేటీ అయ్యారు. ఏపీకి కేంద్ర కేటాయింపుల లెక్క‌లు తేల్చేందుకు జె.ఎఫ్‌.సి. ఎలాంటి ప్ర‌య‌త్నం కృషి చేయాల‌నే కార్యాచ‌ర‌ణ‌పై చ‌ర్చించారు. ఈ కార్య‌క్ర‌మంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ మాట్లాడుతూ… విభ‌జ‌న హామీల‌కు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు చెబుతున్న మాట‌లు ప‌ర‌స్ప‌ర విరుద్ధంగా ఉన్నాయ‌న్నారు. పాల‌కులు చేసిన త‌ప్పుల‌కు ప్ర‌జ‌లు శిక్ష అనుభ‌వించాల్సి వ‌స్తోంద‌న్నారు. ఇదే క్ర‌మంలో త‌న రొటీన్ వాద‌న‌… ‘ఉత్త‌ర‌, ద‌క్షిణ భార‌త‌దేశాల వేర్పాటు’ అంశం గురించి కూడా మ‌రోసారి అభిప్రాయ‌ప‌డ్డారు!

ఇచ్చినమాట‌కు ప్ర‌భుత్వాలే క‌ట్టుబ‌డి ఉండ‌క‌పోతే అది దేశ స‌మ‌గ్ర‌త‌కు భంగం క‌లిగించే విధంగా ప‌రిణ‌మిస్తుంద‌ని ప‌వ‌న్ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. తాము ద్వితీయ శ్రేణి ప్ర‌జ‌ల‌మ‌నే భావ‌న పౌరుల్లో వ‌స్తుంద‌నీ, అది దేశానికి మంచి కాద‌న్నారు. ఇదే భావ‌న పెరిగితే ఉత్త‌ర‌, ద‌క్షిణ ప్రాంతాలుగా విడిపోయే వేర్పాటువాదం దేశ ప్ర‌జ‌ల్లో ప్ర‌బ‌లే ప్ర‌మాదం ఉంద‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిప్రాయ‌ప‌డ్డారు. ఆంధ్రాకు ఇచ్చిన హామీల విష‌యంలో కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ను ప్ర‌జ‌ల‌ను గంద‌ర‌గోళంలోకి నెట్టేశాయ‌న్నారు. వాస్త‌వాల‌ను ప్ర‌జ‌ల‌కు చెప్పాల‌న్న స‌దుద్దేశంతోనే ఈ క‌మిటీ ప‌నిచేస్తుంద‌ని ప‌వ‌న్ చెప్పారు.

ప్ర‌తిసారీ ఈ ‘ఉత్త‌ర ద‌క్షిణ భార‌తాల వేర్పాటు’ అనే అంశాన్ని ప‌వ‌న్ ఎందుకు తెర‌మీదికి తెస్తుంటార‌నే ప్ర‌శ్న‌..? ద‌క్షిణ భార‌తాన్ని వేరు చేసే విధంగా ప‌వ‌న్ మాట్లాడుతుంటారు. ప్ర‌స్తుత స‌మ‌స్య ద‌క్షిణ భార‌తం మొత్తానిది కాదు క‌దా. ఏపీ విభ‌జ‌న హామీల‌ను కేంద్రం స‌క్ర‌మంగా అమ‌లు చేయ‌డం లేదు. దాన్ని ప్ర‌శ్నించేందుకు వాస్త‌వాలు తేల్చేందుకు జె.ఎఫ్.సి. వేశారు, అంతే! ఈ సంద‌ర్భంలో కూడా ‘దేశంలో ప్ర‌జ‌లు ద్వితీయ శ్రేణి పౌరుల‌మ‌ని భావిస్తే’ అంటూ ప‌నిగ‌ట్టుకు ప్ర‌స్థావించాల్సిన ప‌నేముంది..? కేంద్ర ప్ర‌భుత్వం ద‌క్షిణాదిని నిర్ల‌క్ష్యం చేస్తోంద‌నే అభిప్రాయం ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎప్ప‌ట్నుంచో వ్య‌క్తం చేస్తున్నారు. ద‌క్షిణాదిపై ఉత్త‌రాది ఆధిప‌త్యం చెల్ల‌దూ అంటూ ఓ స్లోగ‌న్ ఆయ‌న ఎత్తుకున్నారు. కేంద్రం ఆధిప‌త్యాన్ని ప్ర‌శ్నించాల‌న్న ఉద్దేశంతో ఈ వాద‌న‌ను ప‌వ‌న్ తెర‌మీదికి తెచ్చినా.. అవ‌స‌రం ఉన్న‌చోటా, లేని చోటా కూడా అదే అంశాన్ని మాట్లాడుతున్నారు. దీన్ని ప‌దేప‌దే ప్ర‌స్థావించ‌డం ద్వారా ప‌వ‌న్ ఇస్తున్న సంకేతాలు ఏంట‌నే ప్ర‌శ్న త‌లెత్తుతుంది క‌దా..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.