కొరియోగ్రాఫ‌ర్‌కి ప‌వ‌న్ ఛాన్స్‌??

జానీ మాస్ట‌ర్ తెలుసు క‌దా? త‌న వైవిధ్య‌భ‌రిత‌మైన స్టెప్పుల‌తో.. మాస్‌తో ఈల‌లు వేయిస్తున్న న‌వ‌త‌రం నృత్య ద‌ర్శ‌కుడు ఈయ‌న‌. ఎప్ప‌టి నుంచో… మెగా ఫోన్ ప‌ట్టాల‌న్న‌ది జానీ మాస్ట‌ర్ ఆశ‌. ప‌వ‌న్ క‌ల్యాణ్ కోసం ఓ క‌థ కూడా సిద్ధం చేసుకున్నాడు. ఆ మ‌ధ్య ప‌వ‌న్‌కి వినిపించాడు కూడా. ప‌వ‌న్ కూడా ‘చాలా బాగుంది.. మ‌నం చేద్దాం’ అంటూ మాట ఇచ్చాడు. కానీ.. ఆ ప్రాజెక్టు ఎంత‌కీ క‌ద‌ల్లేదు. ప‌వ‌న్ కోసం జానీ మాస్ట‌ర్‌ ఆ క‌థ‌ని ఎవ్వ‌రికీ చెప్ప‌లేదు. మెగాఫోన్ ప‌ట్టాల‌న్న ఆలోచ‌న కూడా వాయిదా వేసుకున్నాడు. ప‌వ‌న్ ఇప్పుడు రాజ‌కీయాల‌తో బిజీ అయిపోయాడు. సినిమాలు చేస్తాడా, లేదా? అనేది అనుమానంగా మారింది. చేసినా.. త‌న చేతిలో ఉన్న సినిమాల్ని ముందుగా పూర్తి చేస్తాడు. దాంతో జానీ మాస్ట‌ర్‌కి ఇచ్చిన మాట నిల‌బెట్టుకునే అవ‌కాశం లేదు.

కానీ.. ప‌వ‌న్ ఆలోచ‌న‌లు వేరేలా ఉన్నాయి. ఆ క‌థ‌ని మ‌రో హీరోతో చేయ‌మ‌ని జానీకి స‌ల‌హా ఇచ్చాడ‌ట ప‌వ‌న్‌. అంతేకాదు.. ఆ సినిమాకి తాను నిర్మాతగా వ్య‌వ‌హ‌రిస్తాన‌ని మాట ఇచ్చాడ‌ట‌. అంటే ప‌వ‌న్ క‌ల్యాణ్ క్రియేటీవ్ వ‌ర్క్స్‌పై జానీ మాస్ట‌ర్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతాడ‌న్న‌మాట‌. ప‌వ‌న్ తో సినిమా చేయాల‌న్న క‌ల‌… జానీ మాస్ట‌ర్ ఈ విధంగా తీర్చుకుంటున్నాడ‌న్న‌మాట‌. మ‌రి ఆ సినిమా ఎప్పుడు ప‌ట్టాలెక్కుతుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.