పికె చూసుకుంటాడు, మీకెందుకన్నా?

వైసీపీలో ప్రస్తుత పరిస్ఠితికి మనస్థితికి అద్దం పట్టే ఉదాహరణ ఒకటి ఆ పార్టీ వారు చెప్పుకుంటున్నారు. గతంలో కాంగ్రెస్‌ హయాంలో రాష్ట్ర నేతగా చక్రం తిప్పి ఇప్పుడు పార్టీలో చేరిన ఒక ముఖ్య నేత కంగు తిన్న సంఘటన అది. నంద్యాలలో వైసీపీకి ఘన విజయం చేకూర్చేందుకు తన వంతు పాత్ర నిర్వహించాలనే ఉత్సాహంతో ఆయన వెళ్లారట. గతంలో అనుభవం వుంది గనక అందరితో చర్చించి కొన్ని ఆలోచనలకు వచ్చారు. ఆ వెంటనే అధినేత జగన్‌కు ఫోన్‌ చేసి తను పడిన కష్టం చెప్పి ఇలా అయితే మనం గ్యారంటీగా నెగ్గుతామని భరోసా ఇచ్చేశారట. దానికి ఆమోదం చెప్పడం లేదంటే చూద్దాం లెమ్మనడం మామూలుగా జరిగేది. కాని జగనా మజాకా? జరిగింది వేరట. ‘అన్నా వ్యూహ రచన అవన్నీ ప్రశాంత్‌ కిశోర్‌కు వదిలేశామని ప్లీనరీలోనే చెప్పాను కదన్నా.. అంత సీనియర్లు మీరే అర్థం చేసుకోకపోతే ఎలా ‘ అని గాలి తీసేశారట. దాంతో ఆయనకు ఏం చేయాలో తోచక మరో రోజు వుండి ఆరోగ్యం బాగాలేదంటూ సొంతూరికి చెక్కేశారు. సో.. అంతటి వారికే దిక్కు లేకుంటే మనదేమిటి బుక్కా ఫకీర్లం అని నిట్టూరుస్తున్నారు చోటా ప్రాణులు. అందుకే నంద్యాల కాకినాడ తర్వాత టీవీ చర్చలకు రావడానికి కూడా వైసీపీ నేతలు పెద్దగా ఉత్సాహం చూపలేదు. ఇప్పుడిప్పుడే మళ్లీ కోలుకుంటున్నారు. పికె చెప్పిన వైఎస్‌ కుటుంబం కాన్సెప్ట్‌ కూడా విమర్శలకు దారితీస్తుందని వారు భయపడుతున్నారు. కుటుంబ సభ్యులకు తప్ప మీకు ఎలాగూ ప్రాధాన్యత లేదని తమను ఎగతాళి చేయొచ్చని ఒక నాయకుడన్నారు. అయితే పికె కాన్సెప్ట్‌ వేరు.పార్టీయే కుటుంబం అని చెప్పడంతో పాటు వైఎస్‌ ఇమేజిని బాగా వాడుకోవాలన్నది అయిడియా.. చూడాలి మరి. ఏదైనా అందరినీ కలుపుకుని పోతే మెరుగుకదా అంటున్నారు వారు.ఇప్పుడు ఏదైనా అడిగితే పీకె చూసుకుంటాడంట కదా.. మాకెందుకు అని ఎదురు ప్రశ్నిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.