జేసీ వ్య‌వ‌హారంలో త‌ప్పు ఎవ‌రిది..?

తెలుగుదేశం ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి దురుసు ప్ర‌వ‌ర్తన‌ వ్య‌వ‌హారం ముగిసిన సంగ‌తి తెలిసిందే! విశాఖ‌లో ఇండిగో విమాన‌యాన సంస్థ ఉద్యోగితో దురుసుగా ప్ర‌వ‌ర్తించిన తీరు చూశాం. దీంతో ఇండిగో సంస్థ‌తో స‌హా మ‌రికొన్ని దేశీయ విమాన‌యాన సంస్థ‌లు జేసీపై ట్రావెల్ బ్యాన్ విధించాయి. ఈ వ్య‌వ‌హారాన్ని సామ‌ర‌స్యంగా ప‌రిష్క‌రించుకోవాల‌ని సీఎం చంద్ర‌బాబు చెప్పినా, జేసీ పంతానికి పోయి, కోర్టుకు వెళ్లారు. అయితే, అనూహ్యంగా జేసీపై ఉన్న నిషేధాన్ని విమాన‌యాన సంస్థ‌లు ఎత్తేశాయి. ఈ వ్య‌వ‌హారంలో రాజీ ఎలా కుదిరింది అనేదానిపై క‌థ‌నాలు బ‌య‌ట‌కి వ‌చ్చాయి. కేంద్ర‌మంత్రి సుజ‌నా చౌద‌రి జోక్యంతో జేసీ వివాదానికి తెర‌ప‌డింద‌ని తెలుస్తోంది. ఇండిగో సంస్థ ఉద్యోగితో ఎంపీ జేసీ క‌ర‌చాల‌నం చేయ‌డంతో వివాదం ముగిసిపోయింది. అయితే, ఈ ప్ర‌క్రియ వెన‌క చాలా ప్ర‌హ‌స‌న‌మే ఉంది!

సంస్థ‌ల నిషేధం కార‌ణంగా ప్ర‌త్యేక విమానంలో జేసీ ఢిల్లీ వెళ్లారు క‌దా! అక్క‌డి నుంచే ప‌రిష్కార ప్ర‌య‌త్నాలు మొద‌ల‌య్యాయట‌. కేంద్ర ఆర్థిక‌మంత్రి అరుణ్ జైట్లీని క‌లుసుకున్నారు. జేసీ వ్య‌వ‌హారంలో రాజీ కుదిర్చే బాధ్య‌త‌ను కేంద్ర‌మంత్రులు సుజ‌నా చౌద‌రి, అశోక్ గ‌జ‌ప‌తుల‌కు ఆయ‌న అప్ప‌గించార‌ట‌! ఆ త‌రువాత, అశోక్ గ‌జ‌ప‌తి రాజు ఆఫీస్ కి జేసీ, సుజ‌నా వెళ్లి, చాలాసేపు చ‌ర్చ‌లు జ‌రిపార‌ట‌. ఆపై, ఇండిగో ఎయిర్ లైన్స్ ప్ర‌తినిధితో కూడా కాసేపు చ‌ర్చ‌లు జ‌రిగాయ‌ని స‌మాచారం. జేసీ ఆరోప‌ణ‌లు చేసిన ఇండిగో సంస్థ ఉద్యోగిని హుటాహుటిన ఢిల్లీ ర‌ప్పించార‌ట‌! సుజ‌నా స‌మ‌క్షంలో ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి, ఇండిగో ఉద్యోగి క‌ర‌చాల‌నం చేసుకున్నార‌ట‌! దీంతోపాటు, విమాన‌యాన సంస్థ‌పై పెట్టిన కేసును కూడా వెన‌క్కి తీసుకుంటాన‌ని జేసీ చెప్పారు. దీంతో జేసీపై ఉన్న ట్రావెల్ బ్యాన్ ను ఎత్తేస్తున్న‌ట్టు ఇండిగో ప్ర‌క‌టించింది. ఇదే విష‌యాన్ని ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియ‌న్ ఎయిర్ లైన్స్ కు కూడా తెలియ‌జేశారు. దీంతో వివాదానికి ముగింపు ప‌లికిన‌ట్ట‌యింది.

స‌రే, జ‌రిగింది ఏదో జ‌రిగిపోయింది. ఈ మొత్తం వ్య‌వ‌హారంలో చివ‌రికి తేలింది ఏంటీ..? ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి త‌ప్పు చేసిన‌ట్టా, చెయ్య‌న‌ట్టా..? జేసీ ఆరోపిస్తున్న‌ట్టుగా ఇండిగో ఉద్యోగిదే ఆ త‌ప్పంతా అని చివ‌రికి తేల్చిన‌ట్టుగా ఉంది! హుటాహుటిన ఆ ఉద్యోగిని ఢిల్లీకి ర‌ప్పించ‌డం, ఎంపీతో క‌ర‌చాల‌నం చేయించ‌డం చూస్తుంటే… జేసీ త‌ప్పేమీ లేన‌ట్టుగా డీల్ చేసిన‌ట్టు క‌నిపిస్తోంది. ఇత‌ర పార్టీల‌కు చెందిన నాయ‌కులు ఎవ‌రైనా జేసీ మాదిరిగా ప్ర‌వ‌ర్తించి ఉంటే, వారి విష‌యంలోనూ ఇలాంటి రాజీతో వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టెయ్య‌గ‌ల‌రా..? వీడియోలు తెప్పించి చ‌ట్ట‌ప్ర‌కారం చ‌ర్య‌లు తీసుకుంటామ‌నీ, భ‌ద్ర‌త‌కు ఆటంకం క‌లిగించేవారు ఏ స్థాయిలో ఉన్నా చ‌ట్టం త‌న‌ప‌ని తాను చేసుకుపోతుంద‌ని మంత్రి అశోక్ గ‌జ‌ప‌తే ఆ మ‌ధ్య అన్నారు. ఇప్పుడు ఆయ‌న స‌మ‌క్షంలో జ‌రిగిన రాజీ గురించి ఏమంటారో..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.