కేంద్రంతో స‌వాల్ కి ఆయ‌నా సిద్ధం..!

ఢిల్లీ ముఖ్యమంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ మ‌రోసారి వార్త‌ల్లో వ్య‌క్తి అయిపోయారు! కేంద్రంపై మ‌రోసార తిరుగుబావుటా ఎగరేసేందుకు సిద్ధంగా ఉన్నారు. సీఎం స‌మ‌క్షంలో సీఎస్ అన్షు ప్ర‌కాష్‌ పై దాడి జ‌రిగిన ఘ‌ట‌న సంచ‌ల‌న‌మైన సంగ‌తి తెలిసిందే. ఇదే కేసులో ఇద్ద‌రు ఆప్ ఎమ్మెల్యేల‌ను అరెస్టు చేశారు. ఈ ఘ‌ట‌న నేప‌థ్యంలో ఉన్న‌తాధికారులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డం, మంత్రుల పేషీల‌కు వెళ్ల‌మ‌నీ, సెక్ర‌టేరియ‌ట్ నుంచి మాత్ర‌మే పనిచేస్తామ‌ని అంటున్నారు. ముఖ్య‌మంత్రి స‌మ‌క్షంలోనే సీఎస్ పై దాడి క‌చ్చితంగా ఖండించాల్సిన అంశ‌మే. అయితే, ఈ దాడిని నేప‌థ్యంగా చేసుకుని పోలీసులు కొంత అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించి, కేజ్రీవాల్ ఇంట్లో సోదాలు చేశారు. దాడికి సంబంధించి వీడియో ఫుటేజ్ కోసం హ‌డావుడి చేశారు. ఎమ్మెల్యేలు అన్షు ప్ర‌కాష్ పై చేసిన దాడిని కూడా కేజ్రీవాల్ స‌మ‌ర్థ‌నీయంగానే మాట్లాడుతున్నారు! ప్ర‌జ‌ల కోసం స‌రిగా ప‌నిచేయ‌ని అధికారుల‌ను ఉపేక్షిస్తామా అన్నట్టుగా కొంద‌రు ఆప్ ఎమ్మెల్యేల ధోర‌ణి ఉంది.

ఇప్పుడీ అంశం చుట్టూ తిరిగి.. కేంద్రం వెర్సెస్ కేజ్రీవాల్ అన్న‌ట్టుగా మారుతోంది. ఢిల్లీలో లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ కే అధికారులు ఎక్కువ‌గా ఉండటం, ఆప్ స‌ర్కారుకు చాలా అంశంలో అది ప్ర‌తిబంధ‌కంగా మార‌డం గ‌తంలో చూశాం. మోడీ సర్కారుతో కేజ్రీవాల్ మొద‌ట్నుంచీ విభేదిస్తూన్న సంగ‌తీ తెలిసిందే. ఈ దాడి త‌రువాతి ప‌రిణామాలు రాజ‌కీయంగా కీల‌క మ‌లుపు తీసుకుంటున్నాయి. అర‌వింద్ కేజ్రీవాల్ మ‌రోసారి ఎన్నిక‌ల‌కు వెళ్లే ప్ర‌య‌త్నంలో ఉన్న‌ట్టుగానే క‌నిపిస్తున్నారు. సీఎస్ పై జ‌రిగిన దాడిని ఢిల్లీ గ‌ల్లీల్లో ప్ర‌చారంగా మార్చేసుకున్నారు. మీకోసం ప‌నులు చేయ‌ని అధికారుల‌కు రెండు త‌గిలిస్తే త‌ప్పేంటీ, పేద ప్ర‌జ‌లే మాకు ఓట్లు వేశారు, అలాంటి ఆఫీస‌ర్లూ బ‌డా బాబులూ త‌మ‌కు ఢిల్లీలో ఓట్లెయ్య‌లేదంటూ ఆప్ ప్ర‌చారం మొద‌లుపెట్టేసింది..!

నిజానికి, ఓ ఇర‌వై మంది ఆప్ ఎమ్మెల్యేపై అన‌ర్హ‌త వేటు ఉంది! కాబ‌ట్టి, ఉప ఎన్నిక‌ల‌కు వెళ్లాల్సిన ప‌రిస్థితి అక్క‌డ ఉంది. ప‌నిలోప‌నిగా ఇప్పుడు మ‌రోసారి అసెంబ్లీని ర‌ద్దు చేసి కేజ్రీవాల్ ఎన్నిక‌ల‌కు వెళ్లే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌ల‌కు వెళ్లినా మ‌రోసారి ఆప్ అధికారం ద‌క్కించుకోగ‌ల‌దంటూ ఇటీవ‌లే కొన్ని స‌ర్వేలు కూడా వ‌చ్చాయి. దీంతో కేంద్రాన్ని స‌వాల్ చేస్తూ, మోడిని ఢీ కొట్టాల‌నే ఆలోచ‌న‌లు కేజ్రీవాల్ ఉన్న‌ట్టుగా క‌నిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.