ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జీవితంపై సినిమా వస్తుంది. ‘చంద్రోదయం’ పేరుతో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని సీఎం పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 20న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. పసుపులేటి వెంకటరమణ ఈ చిత్రానికి కర్త, కర్మ, క్రియ. ఆయనే రచయిత, దర్శకుడు, నిర్మాత. హిందీ నటులు రఘువర్మ, పల్లవి జోష్, ‘మర్యాద రామన్న’తో పాటు పలు చిత్రాల్లో నటించిన నాగినీడు ఇందులో కీలక పాత్రలు పోషించారు. చంద్రబాబుగా రఘువర్మ నటించినట్టు తెలుస్తోంది. శుక్రవారం విజయవాడలోని ఘంటసాల ప్రభుత్వ సంగీత కళాశాలలో సినిమా టీజర్ విడుదల చేశారు. తెలుగుదేశం ప్రభుత్వ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ రాళ్లపల్లి సుధారాణి, సామాజిక ఆరోగ్య శాఖ చైర్మన్ నారా సుబ్రహ్మణ్యం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. “చంద్రబాబుగారికి టీజర్ ను ముందుగా చూపించాం. సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. బాబుగారి పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 20న చిత్రాన్ని విడుదల చేస్తాం” అని యూనిట్ సభ్యులు తెలిపారు. సాధారణంగా సినిమా కార్యక్రమాలు అన్నీ తెలంగాణ రాజధాని హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా సినిమా మీడియా హైదరాబాద్లో వుంటుంది కాబట్టి. కానీ. ‘చంద్రోదయం’ యూనిట్ విజయవాడలో టీజర్ విడుదల చేశారు. చిత్రంగా సినిమా మీడియాకి కాకుండా పొలిటికల్ మీడియాకి సమాచారం ఇచ్చారు.