లాలూపై తీర్పు: విపక్ష వ్యూహాలకు విఘాతమే..

ఒకవైపున రాష్ట్రపతి ఎన్నికల్లో బిజెపి అభ్యర్థికి వ్యతిరేకంగా అన్ని లౌకిక పార్టీలను కలిపి ఒక అభ్యర్థిని పోటీకి నిలపాలని కాంగ్రెస్‌, వామపక్షాలూ, ఆర్జేడీ జెడియు వంటి పార్టీలు ప్రయత్నిస్తున్న సమయంలో లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు సుప్రీంకోర్టులో ప్రతికూల తీర్పు రావడం ఒక పెద్ద దెబ్బే. ఇదే సమయంలో ఉత్తర ప్రదేశ్‌లో ములాయం సింగ్‌ యాదవ్‌ కూడా కుమారుడు అఖిలేష్‌ను , కాంగ్రెస్‌ను కలిపి తిట్టారు కనక ఆయనా కలవరు.సిపిఎం ప్రధాన కార్యదర్శి ఈ విధమైన ప్రతిపాదనతో కలిసినపుడు ఒరిస్సా ముఖ్యమంత్రి బిజెడి అద్యక్షుడు నవీన్‌ పట్నాయక్‌ లౌకిక అభ్యర్థి వుండాలన్నంత వరకే మాట్లాడారట. టిఆర్‌ఎస్‌ ఇప్పటికే బిజెపికి మద్దతు చెప్పేసింది. వైఎస్‌ఆర్‌సిపి ఇప్పుడున్న స్థితిలో పెద్దగా బిజెపిని వ్యతిరేకిస్తుందని వూహించలేము.బిఎస్‌పి నేత మాయావతి అసలే అనాసక్తిగా వున్నారు. డిఎంకె అద్యక్షుడు కరుణానిధి 93వ పుట్టిన రోజు సందర్భంగా దేశంలోని ప్రతిపక్ష పార్టీలన్నిటినీ చెన్నైకి ఆహ్వానించి సరికొత్త ఐక్యత పెంపొందించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. 1988లోనూ ఇదే విధంగా కరుణానిధి జరిపిన సభ నేషనల్‌ ఫ్రంట్‌ ఏర్పాటుకు బాట వేసింది. అయితే ఇప్పుడు అలా జరుగుతుందని చెప్పడానికి లేదు.అసలు అధికార అన్నా డిఎంకెనే గందరగోళంలో వుంది గనక కేంద్రాన్ని కానదే ప్రశ్నఉత్పన్నం కాదు. ఈ సమయంలో వామపక్షాల తర్వాత కాస్తో కూస్తో చొరవ తీసుకునే లాలూ కూడా కేసుల్లో కూరుకుపోవడంతో ఇక పిల్లికి గంట కట్టేవారు తగ్గుతారన్నమాట. ఇప్పటికే రాష్ట్ర రాజకీయ నేపథ్యంలో ముఖ్యమంత్రి నితిష్‌కు ఆయనకూ మధ్యన అంత సఖ్యత లేదు. జైలులో వున్న మాజీ ఎంపి షహాబుద్దీన్‌తో మాట్లాడారంటూ విడుదలైన సిడి సంచలనం పుట్టించింది. ఇంతలోనే ఈ తీర్పు వచ్చింది.ఈ పరిస్థితిని బిజెపి మాత్రమే గాక జెడియు కూడా తమ స్వంతానికి వాడుకోవడం తథ్యం. కాంగ్రెస్‌ పోగా మిగిలిన ఒకే ఒక్క బలమైన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఏం చేస్తారో తెలియదు. బిజెపిని ఓడించేందుకు మమత కూడా అవసరమని బెంగాల్‌ సిపిఎం నాయకుడు గౌతం దేవ్‌ చేసినట్టుగా చెబుతున్న వ్యాఖ్యలు దుమారం రేపాయి.అయితే సిపిఎం టిఎంసి నాయకులు ఉభయులూ వాటిని తేలిగ్గా తీసిపారేశారు. అదెలా వున్నా రాస్ట్రపతి ఎన్నికల్లో ప్రత్యామ్నాయ అభ్యర్థిని నిలబెట్టి గట్టి పోటీ ఇవ్వడానికి లాలూ కేసు తీర్పు ప్రభావం నష్టమే చేస్తుంది. అయితే ఆ కేసు దాఖలు చేయవలసింది సిబిఐ గనక ఎ ప్పుడు ఎక్కడ చేస్తుందో ఎప్పుడువిచారణ మొదలవుతుందో చూడాలి.ఈ లోగా రాష్ట్ర రాజకీయాలలో లాలూ పట్టు తగ్గడం ఖాయం.మంత్రివర్గంలో ఆయన కుమారులిద్దరు వున్నారు.బహుశా ఆర్జేడీ బలహీనపడితే జెడియు వారిని చేర్చుకోవడానికి వెనుకాడకపోవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.