కొత్త ట్రెండ్: ఓం కార్, ప్రభాకర్- ఇక హర్షవర్ధన్ వంతు

బుల్లితెర నుంచి వెండితెర కి వచ్చి హిట్ కొట్టాడు ఓం కార్. మొదటి సినిమా జీనియస్ ఫ్లాపయినా, ఆ తర్వాత రాజు గారి గది తో హిట్ కొట్టి, ఆ పేరు తో వరస సీక్వెల్స్ ప్లాన్ చేస్తున్నాడు. మొదట ఒక టివి మ్యూజిక్ ఛానెల్లో యాంకర్ గా మొదలెట్టి, ఆ తర్వాత తెలుగు లో రియాలిటీ షోలు మొదలెట్టి ఒక ట్రెండ్ క్రియేట్ చేసాడు. అఫ్ కోర్స్, ఆయన షో ల్లో ఉండే అతి డ్రామా వల్ల ఆయన మీద సెటైర్లు కూడా విపరీతంగానే వేసుకున్నారు జనాలు. ఏదేమయితేనేం, మొత్తానికి హిట్ డైరెక్టర్ అయిపోయాడు.

ఇక ఈ టివి ప్రభాకర్ గా సుపరిచితం అయిన ప్రభాకర్ కూడా నెక్స్ట్ నువ్వే సినిమాతో దర్శకుడిగా ఆరంగేట్రం చేస్తున్నాడు. జెమిని, మా టివిలు వచ్చిన కొత్తలో ఈటివి రేటింగ్స్ బాగా తక్కువగా ఉన్న టైం లో వచ్చిన ప్రభాకర్, “యాహూ” అనే ప్రోగ్రాం ద్వారా ఈటివిని సక్సెస్ ట్రాక్ ఎక్కించాడు. ఈయనకి ఈటివి సుమన్ తో మంచి ఫ్రెండ్ షిప్ కూడా ఉండేది. అయితే ఆ తర్వాత రకరకాల కారణాల వల్ల ఈటివి కి దూరమై, వేరే ఛానెల్స్ లో సీరియళ్ళు చేస్తున్నాడు. ఇక ఇప్పుడు ఈ వారం రానున్న నెక్స్ట్ నువ్వే అనే చిత్రం ద్వారా దర్శకుడిగా మారాడు. స్వంత కథతో అల్లు శిరీష్ ని డైరెక్ట్ చేద్దామని గీతా ఆర్ట్స్ గడప తొక్కితే దాదాపు మూడేళ్ళ తర్వాత ఈ “నెక్స్ట్ నువ్వే” అవకాశం వచ్చిందని ఇటీవల అన్నాడు.

ఇక అమృతం సీరియల్ ద్వారా పాపులర్ అయిన హర్షవర్ధన్ ది మరొక స్టోరీ. ఓం కార్, ప్రభాకర్ లాగా యాంకర్ గా కాకుండా టివి నటుడిగా మొదలెట్టాడు కెరీర్ ని. అనుకోకుండా ఒక రోజు లాంటి సినిమాల్లోనూ నటించాడు. కానీ ఆ తర్వాత రైటర్ గా టర్న్ తీసుకున్నాడు. “మనం”, “గుండే జారి గల్లంతయ్యిందే” లాంటి సినిమాలకి రచయితగా చేసాడు. ఇప్పుడు “గుడ్, బ్యాడ్, అగ్లీ” అనే సినిమా ద్వారా దర్శకుడిగా మారుతున్నాడు.

అయితే ఈ ముగ్గురికీ మంచి అవకాశాలు వస్తున్నాయి. ఓం కార్, నాగార్జున తో హిట్ కొట్టిన ఆనందం లో ఉన్నాడు. రాజు గారి గది-3 సన్నాహాల్లో ఉన్నాడు. వెంకటేష్ తో సంప్రదింపులు జరుపుతున్నట్టు వార్తలొస్తున్నాయి. ఇక ప్రభాకర్ కి గీతా ఆర్ట్స్ తో సహా ఇతర సంస్థలనుంచి ఆఫర్స్ ఉన్నాయి. మరో రెండు సినీఅలు పైప్ లైన్ లో ఉన్నాయని ప్రకటించాడు ఈ మధ్యే. గుడ్, బ్యాడ్ అగ్లీ మూవీతో మెగాఫోన్ ప‌ట్టిన న‌టుడు, ర‌చ‌యిత హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ ‘ప్రేమకథ చిత్రమ్’ చిత్రం తో టాలీవుడ్ కి ప‌రిచ‌య‌మైన సుధీర్ బాబు కి ఒక క‌థ లైన్ వినిపించాడ‌ట‌..న‌చ్చ‌డంతో సుధీర్ బాబు వెంట‌నే ఓకే చెప్పేశాడు.

మొత్తానికి బుల్లితెర నుంచి వచ్చి వెండతెర మీద దర్శకులవడం అనే ట్రెండ్ ఈ మధ్య కాలం లో వీళు ముగ్గురూ బాగా పాపులర్ చేస్తున్నారు (వీళ్ళందరి కంటే ముందు తెలుగు లో ఆ ట్రెండ్ మొదలట్టింది ఐతే సినిమా దర్శకుడు చంద్ర శేఖర్ ఏలేటి, ఆయన అమృతం సీరియల్ కి దర్శకుడు మొదట్లో). ఈ ముగ్గురిని చూసి మరింత మంది టివి దర్శకులు ఇప్పుడు సినిమా కథలు తయారు చేసుకునే పనిలో పడిపోయారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.