సౌరాజ్ : రిపబ్లిక్‌డే కూడా తెలంగాణలోనే..! జగన్‌ వల్ల ఏపీకి ఏంటి లాభం..?

  • ఏపీ పోలీసులపై నమ్మకం లేదు..!
  • ఏపీ అధికారులపై నమ్మకం లేదు..!
  • ఏపీ వ్యవస్థలపై నమ్మకం లేదు..!
  • ఏపీలో టీడీపీ ఉంది కాబట్టి కాబట్టి అందరూ టీడీపీ తొత్తులే..!

ఇది ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఏకపక్ష ధీయరి. ఆయన మాటల్లో దీన్ని చాలా సున్నితంగా చెప్పే ప్రయత్నం చేస్తూంటారు కానీ.. చేతల్లో మాత్రం.. ఆంధ్రప్రదేశ్‌ను అత్యంత దారుణంగా అవమానిస్తూ ఉంటారు. దానికి రిపబ్లిక్ డే జరుపుకున్న వైనమే స్పష్టం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రతిపక్ష నేత.. జగన్మోహన్ రెడ్డి.. హైదరాబాద్‌లోని జెండా వందనం చేశారు. ఏపీకి చెందిన … ఎవరైనా.. అధికారిక కార్యక్రమాల కోసం..జెండా వందనం చేయాల్సి వస్తే.. ఏపీకి వచ్చి చేస్తారు కానీ.. తాము ఎక్కడ ఉంటే అక్కడ చేయరు. దానికి జగన్మహోన్ రెడ్డి భిన్నం. ఆయనకు అన్నీ తెలంగాణే. తనకు అవసరమైన కేసుల దర్యాప్తుల నుంచి రిపబ్లిక్ డే వేడుకల వరకూ.. అన్నింటకీ ఆయన తెలంగాణనే కోరుకుంటారు.

జెండా వందనం కూడా ఏపీలో చేయలేరా..?

విశాఖ విమానాశ్రయంలో కోడి కత్తి దాడి జరిగింది. జగన్మోహన్ రెడ్డికి ఏపీ పోలీసులపై నమ్మకం లేదు. తెలంగాణ పోలీసుల దర్యాప్తును ఆయన కోరుకున్నారు. కానీ.. .సాధ్యం కాదు కాబట్టి… కేంద్రం దగ్గరకు వెళ్లారు. ఆ తర్వాత ఆరేళ్ల కిందట.. ప్రభాస్‌తో షర్మిలకు సంబంధం ఉందంటూ… ప్రారంభమైన ప్రచారంపై… హైదరాబాద్ లో ఫిర్యాదు చేశారు. దానికి కూడా… వాళ్లు చెప్పిన సమాధానం ఏపీ పోలీసులపై నమ్మకం లేకపోవడం. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి.. అక్కడి ఉద్యోగులంతా.. టీడీపీ కార్యకర్తలేనని.. జగన్ భావించడానికి ఏమైనా లాజిక్ ఉందో లేదో కానీ… ప్రతిపక్ష నేతగా… ఓ గౌరవనీయమైన పని చేయడానికి కూడా.. ఏపీ ఎందుకు పనికి రాదో జగన్ ఆలోచించాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రతిపక్ష నేత జగన్మహోన్ రెడ్డి. ఆయన జెండా వందనం చేయాల్సింది ఆంధ్రప్రదేశ్‌లో. ఆయన పార్టీకి విజయవాడలో ఓ కార్యాలయం ఉంది. ఆయనకు తీరిక లేకుండా ఏమీ లేదు. పాదయాత్ర ముగిసిన తర్వాత కుర్చీలో కాళ్లూపుకుంటూ కూర్చున్నారు. ఎవరైనా పార్టీలో చేరుతామని వస్తే కండువాలు కప్పుతున్నారు. అలాంటిది విజయవాడకు వెళ్లి జెండా వందనం చేస్తే.. పోయేదేముంది..?

తెలంగాణపై నమ్మకం పెట్టుకుని ఏపీని కించ పరచడం ఎందుకు..?

వైఎస్ జగన్మోహన్ రెడ్డి .. తెలంగాణలో పూర్తిగా రాజకీయాల్ని వదిలేశారు. ఆయన రాజకీయ భవిష్యత్ ను ఏపీలోనే చూసుకుంటున్నారు. దానికి తగ్గట్లుగా ఆయన వ్యవహరించాలి. ఎల్లకాలం నుంచి టీడీపీనే అధికారంలో ఉన్నట్లు.. అసలు ఏపీ అంటే.. టీడీపీనే అన్నట్లుగా వ్యవహరిస్తూ. .. రాష్ట్రాన్ని పదే పదే కించ పరుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికి.. ప్రతిపక్ష బాధ్యతలను ఎందరో నిర్వర్తించారు. వారెవరూ.. సొంత రాష్ట్ర వ్యవస్థలను కించ పరచలేదు. చివరికి… జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి..సీఎంగా ఉన్నప్పుడు… పరిటాల రవి సహా అనేక మంది హత్యల్లో నేరుగా కొంత మంది పోలీసులతోనే ఆ పని చేయించారనే ఆరోపణలు వచ్చినప్పుడు కూడా.. ఎవరూ.. ఏపీని కించ పరిచే ప్రయత్నం చేయలేదు. ముఖ్యంగా అప్పటి ప్రతిపక్ష నేతలు. పక్క రాష్ట్రానికి పోయి.. అక్కడ్నుంచి రాజకీయం చేయలేదు. కానీ… జగన్ మాత్రం.. తనకు అన్నీ.. తెలంగాణే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.

పవనే నయం ఏపీ నుంచి రాజకీయాలు చేస్తున్నారు.. !

వైఎస్ జగన్.. ఇప్పుడు… పార్టీలో కొన్ని చేరిక కార్యక్రమాల్ని పెట్టుకున్నారు. భట్టిప్రోలు నుంచి ఎంపీటీసీల్ని… అనంతపురం నుంచి మాజీ సీఐని పార్టీలో చేర్చుకున్నారు. ఈ కార్యక్రమాలన్నీ హైదరాబాద్ లో జరిగాయి. ఏపీకి ప్రతిపక్ష పార్టీకి అన్నీ లోటస్ పాండే. ఏపీ విడిపోయి.. ఐదేళ్లయింది. ఏపీ రాజకీయ వ్యవస్థలన్నీ అమరావతి తరలి పోయాయి. చివరికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా.. తన రాజకీయ కార్యక్రమాలను విజయవాడ కేంద్రంగానే చేస్తున్నారు. హైదరాబాద్ లో పార్టీ ఆఫీసు ఉన్నప్పటికీ.. విజయవాడలో మొత్తం రాజకీయం చేస్తున్నారు. పైగా రిపబ్లిక్ డే కూడా.. ఉదయం విజయవాడలోనే జరిపారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం… తెలంగాణకే పరిమితమవుతున్నారు. అక్కడ్నుంచే రాజకీయం చేస్తున్నారు. ఇది కచ్చితంగా ఏపీ ప్రజలను కించ పరచడమే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.